పెద్దబాలశిక్ష!

పెద్దబాలశిక్ష!


 జీవితం ఎక్కాల పుస్తకం కాదు...

 



ది అదర్‌సైడ్ ఆఫ్ ఎ కామెడీ కింగ్!

 

మూడు దశాబ్దాల పైగా వెండితెరను ఏలుతూ, సహస్ర చిత్ర దర్శనం పూర్తి చేసుకున్న హాస్య నట శ్రేష్ఠుడు... బ్రహ్మానందం. ఇది అందరూ చూసే ఒక యాంగిల్. మరి, ఏ రోజైనా సరే... సాయంత్రం 6 గంటల కల్లా ముఖానికి రంగు తుడిచేసుకొని, ఇంటికి చేరి తనదైన లోకంలో ఉండే ఆయనను ఎప్పుడైనా గమనించారా? వీలుంటే ఒక్కసారి కలిసి చూడండి. అంత తొందరగా ఎవరికీ దొరకని ఈ ఆలోచనాపరుణ్ణి కాసేపు కదిపి చూడండి. కెమేరాకు చిక్కని కోణాలెన్నో సప్తవర్ణ శోభితంగా పలకరిస్తాయి. తాత్త్వికుల్లో బుద్ధుడు... ఆయుర్వేదంలో ధన్వంతరి... ఖగోళవిజ్ఞానంలో వరాహమిహిరుడు... పద్య సాహిత్యంలో పోతన... ఆధ్యాత్మిక ప్రవచకుల్లో చాగంటి... ఇలా ఎవరి గురించైనా, దేని గురించైనా... అనర్గళంగా వివరించగలరు. సాహిత్య అధ్యాపకత్వంతో మొదలై జీవిత తాత్వికతను బోధించే దశకు మారిన ఈ లోతైన మనిషి 60వ ఏట అడుగుపెడుతున్న వేళ... ఆయన లోలోపలి మనిషితో సుదీర్ఘంగా సాగిన మాటకచ్చేరీ...

 

 

నేను నమ్మే ఏకైక లైఫ్ ఫిలాసఫీ...

 

జీవితాన్ని మించిన ఫిలాసఫీ ఏముంటుంది! జీవితం ఎప్పుడు నిచ్చెనలెక్కిస్తుందో, ఎప్పుడు పాములతో కాటేయిస్తుందో తెలీదు. అయినా నిత్యం నూతనంగా బతకాలనుకునే తాపత్రయం. నీటిలో మునిగిపోతున్నామని తెలిసినా... నీటిపై తేలియాడే ఎండుటాకును పట్టుకుని అది రక్షిస్తుందేమోనని ఆశపడడం - జీవితం!  నిత్యభ్రమణంలో ఉన్న భూమ్మీద నివసిస్తూ... కాంక్రీట్‌తో ఇల్లు కట్టుకుని, వాస్తు గురించి ఆలోచించడం - జీవితం! దేవుడూ, జీవుడూ వేరు కారనే అద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతూనే, అంతమంది దేవుళ్లనూ పూజించడం, అజ్ఞానాంధకారంలో నడవడం - జీవితం! మిణుగురు పురుగులా బతుకుతూ నా అంతటి కాంతి మరెక్కడా లేదనుకునే మూఢత్వం - జీవితం!  నేను కుయ్యకపోతే తెల్లవారదేమోనన్న భ్రమలో బతకడం - జీవితం!  నలుగురితో మంచిగా ఉండాలని - అందరితో మంచి అనిపించుకోవాలని - తన జీవితాన్ని పడుపు వృత్తిలోకి దించడం - జీవితం!  జరిగినదాని గురించి పశ్చాత్తాపపడుతూ, జరుగుతున్న దాని గురించి ఆవేదన చెందుతూ, జరగబోయే దాని గురించి ఆందోళన పడడం - జీవితం! అన్నీ నేనే చేసుకుంటూ, నా జీవితాన్ని నేనే శిల్పంలా తీర్చిదిద్దుకుంటున్నాననుకుంటూ, నీకు జీవితాన్ని ప్రసాదించిన అతీతమైన శక్తిని మరచిపోవడం - జీవితం!  ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎన్నో చెప్పాల్సి వస్తుందని తెలియకపోవడం - జీవితం!  ఇలా లెక్కలేసుకుని బతకడం ... జీవితం కాదు! ఒక్క మాటలో చెప్పాలంటే - జీవితం ఎక్కాల పుస్తకం కాదు... పెద్దబాలశిక్ష  ఎవరో మహాకవి అన్నట్టు - కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం. అందుకే - జీవితాన్ని మించిన ఫిలాసఫీ ఏముంది?.

 

 

 

గతాన్ని మార్చే  శక్తి లభిస్తే... నేను  చేసే రెండు పనులు




దేశాన్ని మళ్లీ బళ్లో వేసి, అక్షరాభ్యాసం జరిపించాలి. చీకటి నుంచి వెలుతురు చూపించే మార్గం, అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్లే మార్గం, మరణం నుంచి అమరత్వానికి నడిపించే మార్గం - వీటి గురించి దేశానికి బాగా బోధించాలి. దైవకణం నుంచి ఉద్భవించిన ఈ జీవికి ఈశ్వర స్వరూపమనేది ఒక్కటే అని తెలియాలి. ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకునే మార్గాన్వేషణ చేయాలి.

 

 

ఎప్పటికైనా నేను తెలుసుకోవాలనుకునే  మూడు విషయాలు...




అందమైన భార్యనూ, సామ్రాజ్యాన్నీ, అధికారాన్నీ, బంధుగణాన్నీ వదిలేసి వెళుతున్నప్పుడు గౌతమ బుద్ధుడి మదిలో ఆ క్షణం రేగిన భావసంచలనపు గాఢత తెలుసుకోవాలని ఉంది. కురుక్షేత్ర సమరంలో కర్ణుడు హోరాహోరీగా పోరాడి, సమస్త శస్త్రాస్త్రాలూ కోల్పోయాడు. భూమిలో కుంగిపోయిన రథచక్రాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు బాణం సంధించాడు. కర్ణుడు మరణానికి దగ్గరైన సందర్భమది. సరిగ్గా అప్పుడే ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను అన్నట్లుగా సూర్యుడు పడమటి కొండల మధ్య వాలిపోతున్నాడు. కన్నబిడ్డ కర్ణుడు చావు ముంగిట్లో ఉంటే, అతని జన్మకారకుడైన సూర్యుడు చాలా నిర్దయగా, అలా వదిలేసి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి, అప్పుడాయన మానసిక స్థితి ఏమిటో తెలుసుకోవాలని ఉంది. యావత్ మానవాళి సుఖం కోసం తన రక్తాన్ని చిందించి, మానవకోటిని సన్మార్గం వైపు నడిపించాలని శిలువ నెక్కిన మహనీయుడు - ఏసుక్రీస్తు. ఆయన దేహాన్ని హింసించగలిగారు కానీ, ఆయన ఆత్మను మాత్రం ఎవరూ ఏమీ  చేయలేకపోయారు. దాహానికి ఆయనకు నీళ్ళిస్తే, ‘ఐ థర్‌స్ట్ ఫర్ సోల్స్’ అన్న దైవకుమారుడాయన. అలా శిలువ నెక్కిన సమయంలో ఆయన ఆత్మస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఉంది.

 

  నా అభిమాన చిత్రకారులు నలుగురు...



 1. బాపు: అతి చిన్న గీతలో అనల్పమైన భావాన్ని నింపి, అద్భుతమైన కళాఖండాలు సృష్టించిన కమనీయ చిత్రశిల్పి.

 2. వడ్డాది పాపయ్య: ఈయన కుంచెలోకి ఎప్పుడెప్పుడు ప్రవేశిద్దామా అని రంగులన్నీ ఆరాటపడిపోయి, ఒకదానితో ఒకటి కలహించుకునేవట!

 3. రవివర్మ: భగవంతుడెలా ఉంటాడో అన్న మన ఊహలకు రూపమిచ్చిన కుంచె ఆయనది. ఆయన తన సృజనతో చిత్రకళకు బ్రహ్మోత్సవం జరిపించాడు.

 4. లియొనార్డో డావిన్సీ: ఏం చెప్పాలి? ఎన్నని చెప్పాలి? ఆయన గీసిన మోనాలిసా పెయింటింగ్‌లోని ఆ ఒక్క భావప్రకటన చాలు... మనకు ఎన్నో కబుర్లు చెబుతుంది.

 

పంచభూతాల గురించి విశ్లేషణ...

 

పంచభూతాలంటే భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు. వీటిని ఎవరు సృష్టించారో మనకు తెలీదు. వాటంతట అవే పుట్టాయని అనుకోవడం కంటే, వీటి పుట్టుకకు ఎవరో కారణం ఉన్నారని భావించి, ఆ కారకుడికి ‘దేవుడ’ని పేరు పెట్టుకోవడంలో తప్పేమీ లేదనుకుంటా! (నాస్తికవాదులు కూడా దీన్ని సమర్థిస్తారనుకుంటా. ఈ మధ్యనే విశ్వమంతటికీ మూలమైనది దైవకణమని కనిపెట్టారు కదండీ).

 కేజీ బంగారం కావాలా? ఐదు నిమిషాల గాలి కావాలా? అంటే - బంగారమే కావాలంటాం.

 ఏదైనా మంచి పదవి కావాలా? బిందెడు నీళ్లు కావాలా ? అంటే - పదవే కావాలంటాం!

 షడ్రసోపేతమైన భోజనం కావాలా? ఒక నిప్పుకణిక కావాలా? అంటే - భోజనమే కావాలంటాం!

 ప్రపంచాధికారం కావాలా? పదెకరాల భూమి కావాలా? అనడిగితే - అధికారమే ఆశిస్తాం!

 అద్భుతమైన ఆకాశహర్మ్యం కావాలా? ఆకాశంలో పక్షిలా ఎగరాలా? అని కోరితే - ఆకాశహర్మ్యాన్నే కోరుకుంటాం!

 ఇందుకు కారణం - అయాచితంగా మనకు లభించిన పంచభూతాలు.



 కానీ, కంటిన్యూస్‌గా ఒక నిమిషం గాలి పీల్చకపోతే చచ్చిపోతాం. యావత్తు జీవకోటినీ తన అధీనంలో ఉంచుకుని, నియమోల్లంఘన చేసేవారిని శిక్షించి, మరణం ప్రసాదించే అతి శక్తిమంతమైన ఈశ్వరుని ఆయుధం - గాలి! ఈ గాలి లేకపోతే, ఎన్ని టన్నుల బంగారం ఉండి ఏం లాభం చెప్పండి!



 శాస్త్రజ్ఞులు గ్రహాంతరయానం చేస్తూ, నీటి జాడల కోసం అన్వేషిస్తుంటారు. ఎందుకంటే - యావత్ ప్రాణికోటికీ అత్యంత ఆవశ్యకమైనది - నీరు. అది అందకపోతే, శరీరం శవంలా మారిపోతుంది. ఆ నీళ్ల ముందు పదవులేపాటి?



 ఇక - అగ్ని విషయానికొద్దాం. సర్వజగత్తుకీ కర్మసాక్షి సూర్యభగవానుడు. ఆయన కిరణాలు ప్రసరించనిదే నిద్రాణమైన సృష్టి మేల్కొనదు. మనిషి శరీరంలో వేడి నిర్ణీతంగా ఫలానా డిగ్రీలు ఉండాలి. లేకపోతే శవంతో సమానం. అగ్ని విలువ తెలుసుకోలేక, చిన్నపాటి రుచులకే దాసోహమంటున్నాం. దయాగుణంతో ఆ భగవంతుడు ప్రసాదించిన అగ్ని విలువ తెలుసుకోలేకపోతే మనం ఎందుకూ పనిచేయం!

 ఆకాశాన్ని తాకే హర్మ్యాల్లో నివసించాలనుకుంటాం గానీ, వీటన్నిటికీ ఛత్రమైన ఆకాశం విలువ మనకు తెలియదు. అసలు అన్నిటికీ పునాది అయిన భూమి విలువ కూడా మనకు వేరే కోణంలో తెలుసు తప్ప, అసలు కోణం గ్రహించడం లేదు. అసలు కోణం తెలిస్తే ఈ పంచ

 భూతాలు పంచ మహాద్భు  తాలలా అనిపిస్తాయి.

 

ఇష్టమైన ఆరుగురు ఫిలాసఫర్స్...

 


1. వ్యాసుడు: వ్యాసుడు తాను రాసిన మహాభారతంలోనే శ్రీకృష్ణునితో అర్జునునికి ఉపదేశించిన గీతా సారాంశాన్ని మించిన అత్యుత్తమమైన ఫిలాసఫీ ఇంకేముంటుంది? మానవుని మనుగడకు కావలసిన ధర్మ సూత్రాన్నీ, ధర్మ సూక్ష్మాలనూ నిబిడీకృతం చేసి,  మానవాళికి అందించిన వేదాంతి ఆయన.

 2. గౌతమ బుద్ధుడు: భగవంతునికీ, మానవునికీ మధ్య ఎటువంటి అంతరం లేకుండా ప్రత్యక్షంగా భగవంతునితో మాట్లాడుకునే అవకాశాన్ని తన అష్టాంగమార్గం ద్వారా తెలియపరిచిన తాత్వికుడు.

 3. బమ్మెర పోతన: తెలుగు సాహిత్య చరిత్రలో బమ్మెర పోతన లాంటి తాత్వికుడైన కవి మరొకరు లేరు. ‘‘కలడందురు దీనుల యెడ - కలడందురు పరమయోగి గణముల పాలన్ - కలడందురు అన్ని దిశలను - కలడు కలండనెడివాడు కలడో లేడో’’ అనే ఆయన భాగవత పద్యం చూడండి. దేవుడు ఉన్నాడో లేడో అన్న మీమాంసకు ఆ కాలంలోనే తెర తీశాడు. మళ్లీ ఆయనే ‘‘ఇందుగల డందు లేడని సందేహము వలదు..’’ అంటూ, సర్వేశ్వరుడు ఎక్కడైనా ఉంటాడని చెప్పాడు. తన కవిత్వంతో విశ్వానికి కాంతిపథం చూపించాడు.

 4. రామకృష్ణ పరమహంస:  ఈ మహాత్ముడు చెప్పిన మాటను ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. సృష్టిలోని అణువణువులో భగవత్ స్వరూపాన్ని దర్శించుకున్న మహాత్ముడు. సాక్షాత్తూ ధర్మపత్నిలోనే అమ్మను దర్శించిన అద్భుత జ్ఞానయోగి.

 5. స్వామి వివేకానంద: భారతీయ ధార్మికతను భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా విస్తరింపజేసిన రామకృష్ణ పరమహంస శిష్యుల్లో అగ్రగణ్యుడు - ‘నరేంద్రుడు’... వివేకానందుడు. ఈయన ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్తో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు అక్కర్లేదు. చికాగోలో జరిగిన ‘సర్వమత సభ’లో ఉపన్యసించినప్పుడు సభికులను ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అని సంబోధించడంలోనే ఆయన భారతీయత, తాత్విక విజ్ఞత ప్రస్ఫుటమవుతుంది.

 6. రమణ మహర్షి: శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యం లేకుండా, మనసుకి ప్రాధాన్యమిస్తూ భగవంతుణ్ణి మనసులో పూజిస్తేచాలు. భగవంతుణ్ణి తనలో ప్రతిష్ఠింప జేసుకుని యావత్ ప్రాణికోటిలో దైవత్వాన్ని చూసిన తాత్వికుడాయన. ఆయన తత్వమంతా ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవాలనే! ఏ మానవుడైనా ‘నేను’, ‘నాది’ అన్న భావన వదిలిపెడితే, ‘ఇదంతా భగవంతుడిదే’ అనుకోగలిగితే అంతకంటే జ్ఞానం మరొకటి లేదు. ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా సంపాదించుకుని, మౌనమే భాషగా ఎంతోమందికి ఆధ్యాత్మిక భావనను అందజేసిన మహనీయుడు.

 

కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగితే... నేను కలవాలనుకునే ఏడుగురు మహానుభావులు...

 

1. ఆది శంకరాచార్యులు - ఉపనిషత్తులు, వేదవేదాంగాలు ఆపోశన పట్టి ధార్మిక విశ్వరూపం చూపించిన మహానుభావుడు.

2. బమ్మెర పోతనామాత్యులు - శ్రీమదాంధ్ర మహాభాగవతం చదివి చూడండి. ‘సత్కవుల్ హాలికులైన నేమి’ లాంటి ఆయన పద్యపాదాలను అవగాహన చేసుకోండి. ఆయనను మించిన కమ్యూనిస్టు, ధార్మికవేత్త, తార్కికుడు, మహాకవి, శాస్త్రవేత్త, ఫిలాసఫర్ ఇంకెవరున్నారని మీరే అంగీకరిస్తారు.

3. వేమన - సమాజంలో ఉన్న రుగ్మతల్ని అతి సహజమైన శైలిలో, అందరికీ అర్థమయ్యే భాషలో ఎత్తిచూపి ఆత్మప్రబోధం చేసిన మహనీయుడు.

4. అల్లూరి సీతారామరాజు - పీడిత ప్రజల కోసం పోరు బాట పట్టి, జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ధైర్యశాలి.

5. సర్ ఆర్థర్ కాటన్ - ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు నీటి విలువ చెప్పి, కోట్ల ఎకరాల భూమిని పచ్చని మాగాణులను చేసి, తెలుగు నేలను సుభిక్షం చేసి, సుసంపన్నం కావించిన తెల్ల జాతీయుడు... కానీ మనవాడే!

6. మదర్ థెరిసా - దయాగుణాన్ని మించిన సౌందర్యం లేదని చాటిచెప్పిన విశ్వమాత.

7. చలం - కాలానికన్నా ముందుండి, స్త్రీ స్వేచ్ఛ కోసం రచనలు చేసిన - రచయిత.

 

 నేను మెచ్చిన  ఎనిమిది పాటలు...




 మనసున మనసై, బతుకున బతుకై... (చిత్రం - ‘డాక్టర్ చక్రవర్తి’)

 మనసున మల్లెల మాలలూగెనే... (చిత్రం - ‘మల్లీశ్వరి’)

 అన్నానా భామిని... (చిత్రం - ‘సారంగధర’)

 హాయిహాయిగా ఆమని సాగే... (చిత్రం - ‘సువర్ణ సుందరి’)

 ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా... (చిత్రం - ‘రోజులు మారాయి’)

 కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్... (చిత్రం - ‘దేవదాసు’)

 లాహిరి లాహిరి లాహిరిలో... (చిత్రం - ‘మాయాబజార్’)

 సడి సేయకో గాలి... (చిత్రం - ‘రాజమకుటం’)

 

 నాకు నచ్చిన తొమ్మిది రచనలు...

 

 ధూర్జటి మహాకవి రచించిన ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’

 విశ్వనాథ సత్యనారాయణ విరచిత ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’

 అన్నమయ్య సంకీర్తనా సాహిత్యం

 గుర్రం జాషువా రచించిన ‘ఫిరదౌసి’, ‘గబ్బిలం’ కావ్యాలు

 శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’

 సి. నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన ‘విశ్వంభర’ కావ్యం.

 రావూరి భరద్వాజ ‘పాకుడు రాళ్లు’ నవల

 రావిశాస్త్రి ‘రాజు-మహిషి’ నవల.

 కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ నవల.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top