జోరుగా ఫ్యాన్ గాలి

జోరుగా ఫ్యాన్ గాలి - Sakshi


వైఎస్సార్ కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ

నెట్‌లో హల్‌చల్ చేస్తున్న తాజా సర్వేల ఫలితాలు

 

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మరో 24 గంటల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని నెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్‌టీవీ-నీల్సన్, టీవీ5-ఎఫ్‌ఎంఆర్‌ఎస్‌లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేల ఫలితాలు యూట్యూబ్, వివిధ వెబ్‌సైట్లు, బ్లాగ్‌లు, సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో.. ఈ సర్వే ఫలితాలు లీకుల పేరిట వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి.

 

 టీవీ5 - ఎఫ్‌ఎంఆర్‌ఎస్

 

 ఏప్రిల్ 29న 1.75 లక్షల శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించినట్లు నెట్‌లో పేర్కొన్నారు. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్‌కు 120 నుంచి 125 శాసనసభ స్థానాలు వస్తాయని; 25 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీకి 20 నుంచి 22 లోక్‌సభ స్థానాలు వస్తాయని టీవీ5-ఎఫ్‌ఎంఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలో తేలినట్లు చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమికి 48 నుంచి 53 శాసనసభ స్థానాలు, 3 నుంచి 5 పార్లమెంటు స్థానాలు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్, ఇతరులకు కలిపి 2 నుంచి 4 అసెంబ్లీ సీట్లు, 0 నుంచి 1 పార్లమెంటు స్థానం రావచ్చని అంచనా వేశారు. వైఎస్సార్ సీపీకి 49.3 శాతం, టీడీపీ-బీజేపీ కూటమికి 42.1 శాతం, కాంగ్రెస్, ఇతరులకు 8.6 శాతం ఓట్లు అసెంబీ స్థానాల్లో వస్తాయని లెక్కగట్టారు. లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 48.6 శాతం, టీడీపీ-బీజేపీ కూటమికి 42.5 శాతం, కాంగ్రెస్, ఇతరులకు 8.9 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.

 

 ఎన్‌టీవీ - నీల్సన్ సర్వే...

 

 ఏప్రిల్ 25న ఈ సర్వే చేశారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 117 నుంచి 123 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీ, బీజేపీకి క లిపి 52 నుంచి 58 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 0-2, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే వైఎస్సార్ సీపీకి 16 నుంచి 19 పార్లమెంటు సీట్లు వస్తాయని, టీడీపీకి 6 నుంచి 9 సీట్లు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్‌కు వస్తే ఒకటి వస్తుందని, లేకపోతే లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి అసెంబ్లీ స్థానాల్లో 48.5 శాతం, పార్లమెంటు స్థానాల్లో 48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. టీడీపీ-బీజేపీ కూటమికి అసెంబ్లీలో 41 శాతం, పార్లమెంటు స్థానాల్లో 41.5 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్ 6 శాతం ఓట్లు, ఇతరులకు 4.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.




 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top