జోరుగా ఫ్యాన్ గాలి.. ప్రత్యర్థుల పని ఖాళీ

జోరుగా ఫ్యాన్ గాలి.. ప్రత్యర్థుల పని ఖాళీ - Sakshi

 పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. పార్టీపరంగా ఎలా సిద్ధమయ్యారు?


 కృష్ణదాస్: జిల్లాలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ సర్వసన్నద్ధమైంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ మాకు కొండంత అండగా ఉంది. మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయత, నాయకత్వ పటిమ మాకు స్ఫూర్తినిస్తున్నాయి. రెండేళ్లుగా జిల్లాలో మా పార్టీ దశలవారీగా బలోపేతమవుతూ వచ్చింది. జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ పార్టీ ఘన విజయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించేశారు. ఎన్నికల్లో దాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 


 


 సాక్షి: జిల్లాలో మీ పార్టీ అభ్యర్థుల కూర్పు ఎలా ఉందని భావిస్తున్నారు? 


 కృష్ణదాస్: జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. కాపు, కాళింగ, వెలమ, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో మా ఎన్నికల జట్టు సమతూకంతో ఉంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కాపు వర్గానికి ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. పాతపట్నం, ఎచ్చెర్ల అసెంబ్లీ అభ్యర్థిత్వాలను కూడా ఆ వర్గానికే కేటాయించారు. కాళింగులకు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కింతలి కాళింగ వర్గానికి ఆమదాలవలస, టెక్కలిల్లో, బూరగాని కాళింగకు పలాసలో అవకాశమిచ్చారు. ఈ వర్గానికి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కూడా కేటాయించారు. వెలమ వర్గానికి చెందిన వారికి నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో అవకాశమిచ్చారు.  యాదవ వర్గ నేతను ఇచ్ఛాపురం అభ్యర్థిగా ఎంపిక చేశారు. రిజర్వేషన్ ప్రకారం రాజాంలో ఎస్సీ, పాలకొండలో ఎస్టీ నేతలకు అవకాశం కల్పించారు. మత్స్యకార వర్గానికి చెందిన నేతను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని ప్రకటించారు. ఇలా వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే జిల్లాలో ఉన్న అన్ని సామాజికవర్గాలకు సమప్రాధాన్యమిచ్చింది. అనుభవం, నవతరం మేలు కలయికగా ఉన్న మా అభ్యర్థుల జట్టును జిల్లా ప్రజలు ఆశ్వీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. 


 


 సాక్షి: ఏ ప్రాతిపదికన మీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు? 


 కృష్ణదాస్: దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నది అందరూ అంగీకరించే వాస్తవం. శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వంశధార, తోటపల్లి విస్తరణ ప్రాజెక్టులు చేపట్టారు. టెక్కలి డివిజన్‌కు ప్రాణధారమైన ఆఫ్‌షోర్ పనులు చేపట్టారు. వరదలు వస్తే జిల్లాలో పంట పొలాలు మునిగిపోకుండా కరకట్టల నిర్మాణం చేపట్టారు. రిమ్స్ ఆస్పత్రి నిర్మించి పేదలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు. ఎచ్చెర్లలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఉన్నత విద్యను జిల్లా ముంగిటికి తీసుకువచ్చారు. ఇక పింఛన్లు, ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు చేరాయి. ఇక మా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సర్వజనరంజకంగా మేనిఫెస్టోను రూపొం దించారు. అధికారం చేపట్టిన రోజే తాను చేయనున్న  5 సంతకాలు, మరో 5 కార్యక్రమాలను ప్రకటించి ప్రజల మన్నన పొందారు. అందుకే జిల్లా ప్రజలకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. తన 9 ఏళ్ల పాలనలో జిల్లాకు ఏమీ చేయని చంద్రబాబు టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని ప్రజలే నిర్ధారణకు వచ్చేశారు. 


 


 సాక్షి: ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పడేలా ఎలాంటి వ్యూహం రచిస్తున్నారు? 


 కృష్ణదాస్: రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలి. విభజన అనంతరం రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీలో పట్టు ఉండాలంటే జగన్‌మోహన్‌రెడ్డికి అత్యధిక ఎంపీలను అందించాలి.  ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు వివరిస్తున్నాం. పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తపరిచాం. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ తప్పకుండా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓటమి భయం పట్టుకున్న టీడీపీ క్రాస్ ఓటింగ్ అంటూ అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ ఎత్తులను చిత్తు చేసి జిల్లాలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది. 


 


 సాక్షి: ఇటీవలి కాలంలో జిల్లాలో తమ బలం పెరిగిందని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది కదా! ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? 


 కృష్ణదాస్: టీడీపీ బలోపేతమైందన్నది కూడా గోబెల్స్ ప్రచారమే. టీడీపీ పట్ల  ప్రజలకే కాదు.. ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం సడలిపోయింది. పార్టీ బలోపేతమైతే మరి చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఎందుకు వెంపర్లాడారు?  జగన్‌మోహన్‌రెడ్డి మాదిరిగా ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదా? ఇక జిల్లాలో ఒక్క సీటు బీజేపీకి కేటాయించేసరికి టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేశారు? అంటే జిల్లాలో తమకు గెలిచే అవకాశాలు లేవని అంగీకరించినట్లేగా! నరసన్నపేటలోగానీ ఇచ్ఛాపురంలోగానీ బీజేపీ పోటీచేస్తే ఓడిపోయేంత బలహీనంగా ఉందా ఆ పార్టీ? అంత బలంగా ఉంటే ఓ సీటులో బీజేపీని గెలిపించుకోలేరా?. ఎన్నికలకు ముందే తాము బలహీనంగా ఉన్నామని టీడీపీ నేతలు అంగీకరించినట్లైంది.  2009లో టీడీపీ జిల్లాలో ఒక్క సీటైనా గెలిచింది. ఈసారి అది కూడా దక్కదు. 


 


 సాక్షి: టీడీపీ నేతలు కొన్నిచోట్ల దౌర్జన్యాలకు తెరతీశారు. ఎన్నికల నాటికి అవి మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? 


 కృష్ణదాస్: ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి రౌడీయిజానికి, కవ్వింపు చర్యలకు మేం బెదరిపోయే ప్రసక్తే లేదు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటానికి ఎంతకైనా సిద్ధం. టెక్కలి నియోజకవర్గంతోపాటు ఎక్కడైనా టీడీపీ నేతలు అంగబలం, అర్థబలంతో ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తే ఉపక్షించేది లేదు. 


 


 సాక్షి: జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎలా సమన్వయపరుస్తున్నారు?


 కృష్ణదాస్:  అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ బలంగా ఉంది. అందరూ అభ్యర్థులతోనూ నాతోపాటు అధిష్టానం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, పాలవలస రాజశేఖరంలతో ఎప్పటికప్పుడు సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. అదే విధంగా కొత్త అభ్యర్థులకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తున్నాం. పార్టీ అభ్యర్థులతో చక్కటి సమన్వయం ఉంది.


 


 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top