అభిమాన ‘శోభ


ఆమెది పరిచయం అవసరం లేని పేరు.పొరుగు జిల్లా అయిన కర్నూలు రాజకీయాలతో పాటు, రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన శైలిని చూపిన మహిళా నేత. పెదవులపై చెదరని చిరునవ్వు, సూటిగా నిలదీసే నైపుణ్యం, ఆమె సొంతం. ఆమెకు పాలమూరుతోనూ అనుబంధం ఉంది.  ఇక్కడి నేతల్లో పలువురు ఆమెకంటే సీనియర్లో, సహచరులో కావడంతో వారితో ఆమె ఆత్మీయంగా మెలిగేవారు. అనుకోని రీతిలో ఆమెను రోడ్డు ప్రమాద దుర్ఘటన  మృత్యువు  ఒడికి చేర్చిందని తెలిసి జిల్లావాసులు తట్టుకోలేక పోతున్నారు. ఆమెతో ఉన్న పరిచయాన్ని ఆత్మీయులు గుర్తుకు తెచ్చుకొని కన్నులు చెమర్చారు. ఇదీ వైఎస్సార్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డి ఇక లేరని తెలిసి జిల్లాలో కనిపించిన శోకతప్త పరిస్థితి.    

 

 అలంపూర్,గద్వాల, న్యూస్‌లైన్ : చురుకైన నాయకురాలిగా తనదైన ముద్ర వేసుకున్న భూమా శోభానాగిరెడ్డికి మహబూబ్‌నగర్ జిల్లాతోనూ చక్కని అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆమె  అలంపూర్‌క్షేత్ర ఆలయాలను పలుమార్లు దర్శించి అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరుని ఆశీర్వాదాలు పొందేవారు.

 

 ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమె బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ హైదరాబాదులో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. శోభ తరచూ అలంపూర్‌లో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి  ఆలయాన్ని, శ్రీబాలబ్రహ్మేశ్వర సామి వారి ఆలయాలను  పలుమార్లు దర్శించుకున్నారు. ఆళ్ల గడ్డ నుంచి హైదరబాదు వెళ్లే సమయంలోనో..తిరుగు సమయంలోనో  క్షేత్రాన్ని సందర్శించి అమ్మ వారి, స్వామివారి ఆలయంలో పూజలు జరిపే వారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రల నుంచి కాపాడాలని ఇక్కడ పూజలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.

 

 అమ్మవారి భక్తురాలిగా ఆమె ఈ ప్రాంతానికి సుపరిచితురాలు.ఇలా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న ఆమె మరణాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆళ్లగడ్డ నియోజక వర్గ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి అలంపూర్ ఆలయాలంటే ఎంతో భక్తి ప్రపత్తులని ఆలయ అర్చకుడు  ఆనంద్‌శర్మ ఈ సందర్భంగా తెలిపారు. తన నియోజక వర్గం నుంచి హైద్రాబాద్ వెళ్లే ప్రతి సారి ఆమె ఆలయాలను దర్శించేందుకు వచ్చేవారని తెలిపారు. శోభనాగిరెడ్డి మరణ వార్త ఆలయ సిబ్బందిని తీవ్ర ద్రిగ్భాంతికి గురి చేసిందన్నారు. విగత జీవిగా మారిన ఆమె పార్థివ శరీరం కూడా జాతీయ రహదారి మీదుగా ఆమె స్వస్థలానికి తరలించిన సంఘటన తమను మరీ కలచి వేస్తోందని స్థానికులు కన్నులు చెమర్చారు.

 

 కార్యకర్తలకు వెన్నంటి.. శోభానాగిరెడ్డి 2005,06లలో టీడీపీ తరపున గద్వాల పార్టీ పరిశీలకురాలిగా ఆ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు టిక్కెట్లు ఇప్పించడం, పార్టీని గద్వాల ప్రాంతంలో బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. టీడీపీ పార్టీ సభ్యత్వాల కార్యక్రమాలకు కూడా ఆమెనే ఇన్‌చార్జిగా వ్యవహరించారు. రెండేళ్ల పాటు గద్వాల రాజకీయాలతో ఆమె మంచి పట్టు కలిగి ఉండేవారు. ఇక్కడి తెలుగుదేశం నేతలతో కూడా ఆమెకు మంచి పరిచయాలు ఉండేవి.           

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top