‘ఫ్యాన్’ జోరు

‘ఫ్యాన్’ జోరు - Sakshi


జిల్లాలో ‘ఫ్యాన్’ గాలి జోరుగా వీస్తోంది. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ధాటికి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఇంటి పోరుతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతుండగా, ప్రచారం కూడా దండగనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వుండడం వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరింత కలిసివచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

 

 సాక్షి, ఒంగోలు: ఎన్నికల ఘట్టంలో కీలకమైన ప్రచార పర్వం ఊపందుకుంది. వైఎస్సార్ సీపీ ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. టీడీపీ ఇంకా అసమ్మతి సెగతో అవస్థలు పడుతూనే ఉంది. వైఎస్సార్ సీపీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశంగా మారింది. ఎక్కడా అసమ్మతి కనిపించలేదు. ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీలకు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండటంతో వారి ఎన్నికల వ్యూహ ప్రణాళికతో వైఎస్సార్‌సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షోలతో ఎన్నికల ప్రచారంలో జోష్ పెరిగింది.

 

 దర్శి, మార్కాపురం, పర్చూరు, అద్దంకి, గిద్దలూరు, యర్రగొండపాలెం, కొండపి, కందుకూరు, సంతనూతలపాడు, చీరాలతో పాటు కనిగిరి, ఒంగోలులో ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి వస్తున్నారు. ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నీతానై నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్‌ను పిలిపించుకుని.. ఆయాచోట్ల అభ్యర్థులతో సమన్వయంగా పనిచేసేందుకు అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రత్యర్థుల స్వయంకృతాపరాధాలు, కీలక తరుణంలో టీడీపీ, బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నిర్లిప్తతతో ప్రచారం డీలాపడటం.. వంటి కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలమంతా కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 అసమ్మతి సెగతో టీడీపీ నేలచూపులు

 ప్రచారంలో టీడీపీ బాగా వెనుకబడింది. అభ్యర్థులను ప్రకటించే విషయంలోనూ పేచీలు తలెత్తాయి. 12 నియోజకవర్గాల్లో బీజేపీ తొలుత రెండింటిని అడగడం.. అధినేత చంద్రబాబు సంతనూతలపాడు ఒక్కటే ఇస్తాననడం తెలిసిందే. ఈ విషయంపై స్థానికంగా తెలుగు తమ్ముళ్లు భగ్గుమని జిల్లా పార్టీ కార్యాలయాన్నే ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కొండపి, గిద్దలూరుకు ఎసరు పెట్టే ఆలోచనలు కూడా సాగాయి. నామినేషన్ల ఆఖరు నాటికి బీజేపీ కేటాయించామన్న సంతనూతలపాడు సీటును కూడా తమపార్టీ సొంత అభ్యర్థికే కట్టబెడుతున్నామంటూ బీఎన్ విజయకుమార్‌కు పార్టీ బీఫారమిచ్చి పంపారు. తాజాగా, మళ్లీ విజయకుమార్ నామినేషన్ ఉపసంహరించుకునేలా మంతనాలు సాగుతున్నాయి.

 

ఈ పరిణామాల క్రమంలో జిల్లాలో  టీడీపీకి అసమ్మతి బెడద వెంటాడుతోంది. ఆయాచోట్ల అభ్యర్థులు కూడా ప్రచారానికి వెళ్లలేక.. అసంతృప్తులను బుజ్జగించుకోలేక సతమతమవుతున్నారు.

 

ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంటరి పోరు తప్పడం లేదు. ఆయనతో నియోజకవర్గాల్లో కలిసి పనిచేసేందుకు టీడీపీ ఆస్థాన సామాజికవర్గం మొగ్గుచూపడం లేదు.

 

బాపట్ల లోక్‌సభ పరిధిలో టీడీపీ ప్రచారం మొక్కుబడిగా సాగుతోంది. ఎంపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రి స్థానికంగా ఉండకుండా..డబ్బులిస్తే జనాలు ఓట్లేయకపోతారా అన్నట్లు పార్టీ శ్రేణుల ఎదుట వ్యాఖ్యలు చేయడం చేటు తెస్తుందంటూ సన్నిహితవర్గాలే వాపోతున్నాయి.

 

 దీనికితోడు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీల్లో కలిసిరాని పార్టీ కేడర్  వీరికి పెనుసవాల్ విసురుతోంది.

 

 ఇక, కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వారే కరువై.. దొరికిన కొత్త ముఖాలకు సీట్లిచ్చి మమ అనిపించుకుంది. నామినేషన్ల పరిశీలన కూడా ముగియడంతో ప్రచారంపై దృష్టిపెట్టింది. అయితే అడుగడుగునా విభజన సెగలు అభ్యర్థులకు చెమటలు పోయిస్తున్నాయి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top