వైఎస్సార్సీపీలో జోష్!

వైఎస్సార్సీపీలో  జోష్! - Sakshi


 సాక్షి ప్రతినిధి, కర్నూలు: సార్వత్రిక సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. విభేదాలతో తెలుగుదేశం పార్టీ కుదేలవుతోంది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చతికిల పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి విడతలోనే జిల్లాలోని అభ్యర్థులను ప్రకటించారు. జాబితా ప్రకటించిన రోజే జననేత డోన్, పత్తికొండ, ఆలూరు నియోజక వర్గాల్లో పర్యటించారు. దీంతో జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది.

 

 వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం  ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. మూడు విడతలుగా జాబితా ప్రకటించినా ఇంకా కర్నూలు పార్లమెంట్, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది.

 

 ఈ నేపథ్యంలో అసంతృప్తి నాయకులు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మరికొందరు ఏకంగా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నంద్యాలకు చెందిన టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి, ఆయన సోదరుడు ఎన్‌హెచ్ ప్రసాద్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

 

 అదేవిధంగా గోపవరం కుటుంబ సభ్యులు నాగిరెడ్డి, నాగేంద్రప్రసాద్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదోనికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పంపాపతి, ఆయన సోదరుడు ఉమాపతి జననేత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కర్నూలుకు చెందిన సుబ్రమణ్యం ఇటీవల పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు 12 మంది ఇటీవల బుట్టా రేణుక ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి మారెప్ప సోదరుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మూలింటి బాలకృష్ణ ఇటీవలే పార్టీలో చేరారు.

 

 అదే విధంగా టీజీ వెంకటేష్ ప్రధాన అనుచరుడు తిమ్మారెడ్డి, మాజీ కార్పొరేటర్  గిరిజారెడ్డి, కట్టమంచి విద్యాసంస్థల అధినేత జనార్దన్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకుడు స్టార్ మోటార్స్ అధినేత అయూబ్‌ఖాన్, న్యాయవాది జాఫర్, ఆంధ్ర కిచెన్ ప్రొప్రైటర్ నిజాం, ఫైజన్, పీసీసీ కార్యదర్శి సత్యం యాదవ్ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు మున్సిపల్ మాజీ చైర్మన్ దావూద్ ఖాన్ కుమారుడు ఇలాయాస్ ఖాన్, కాంగ్రెస్ లీగల్ సెల్ చెర్మైన్ రామకృష్ణారెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు. చేరికలతో వైఎస్సార్సీపీకి రోజు రోజుకూ బలం పెరుగుతోంది.

 

 రగిలిపోతున్న అసంతృప్తులు..

 టీడీపీలో రోజు రోజుకు అసంతృప్తులు పెరిగిపోతున్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్ అధినేత బాబుపై గుర్రుగా ఉన్నారు. పాణ్యంలో ఎవరూ జెండా మోయని సమయంలో టీడీపీ బాధ్యతలు స్వీకరించిన కేజే రెడ్డిని కాదని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో కేజే రెడ్డి, అతని అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నందికొట్కూరు టికెట్ కోసం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన విక్టర్‌ను కాదని తాజాగా పార్టీలో చేరిన లబ్బి వెంకటస్వామికి కట్టబెట్టడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 అదే విధంగా మంత్రాలయం, ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థులను తేల్చకపోవటంతో కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ పొత్తులో భాగంగా కోడుమూరు అసెంబ్లీ స్థానాన్ని కమలదళానికి కట్టబెట్టటంపైనా తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధినేత రెండు కళ్ల సిద్ధాంతాన్ని అభ్యర్థుల ఖరారులోనూ పాటిస్తుండటంతో తమ్ముళ్లు మండిపడుతున్నారు. ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారిని నట్టేటముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పితీరుతామని హెచ్చరిస్తున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top