తెలంగాణ ప్రజలతో వైఎస్‌ది విడదీయలేని బంధం

తెలంగాణ ప్రజలతో వైఎస్‌ది విడదీయలేని బంధం - Sakshi


 మీ అభిమానంతోనే ఆయన మహానేత అయ్యారు: షర్మిల

 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఈ ప్రాంత ప్రజలతో ఆయనది విడదీయలేని అనుబంధమని వైఎస్సార్ కూతురు షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మంది చనిపోతే వారిలో అత్యధికులు తెలంగాణ వారేనని, ఇక్కడి ప్రజల గుండెల్లో ఆ మహానేతకున్న స్థానం అలాంటిదని ఆమె గర్తు చేసుకున్నారు. ఉత్తమ సీఎం ఎవరంటూ తెలంగాణ ప్రాంతంలో ‘హెడ్‌లైన్స్ టుడే’ వార్తా సంస్థ సర్వే చేస్తే 60 శాతం మంది వైఎస్‌కే ఓటేశారని చెప్పారు. ఈ ప్రాంతంలో రాజశేఖరరెడ్డి ఇంకా బతికే ఉన్నారని, తెలంగాణ ప్రజల అభిమానం లేకుండా ఆయన పెద్ద నాయకుడయ్యేవారా? అని ఆమె వ్యాఖ్యానించారు. ‘మేమే మీకు రుణపడి ఉన్నాం. మా కుటుంబమే మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికే మీ ముందుకు వచ్చాం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళుతున్నాం. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా.. రాజన్న రాజ్యానికి నాంది పలికేందుకు మీరు ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్సార్‌ను గుర్తు చేసుకోండి. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’ అని షర్మిల విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటలో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు.

 

 వైఎస్సార్ పాలనతో భరోసా

 

 వైఎస్సార్ తన పాలనలో ప్రతీ వర్గానికి భరోసా ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్, వడ్డీల మాఫీ, రుణాల మాఫీ, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు పక్కా ఇళ్లు, బీదలకు కార్పొరేట్ వైద్యం, 108, 104, అభయహస్తం, ఉపాధి హామీ వంటి అనేక పథకాలను అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా ఎంతో అద్భుతంగా అమలు చేశారని పేర్కొన్నారు. ‘తన పదవీ కాలంలో వైఎస్సార్ ఏనాడూ ధరలు, పన్నులు పెంచలేదు. ఆయన హయాంలో ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగలేదు. రైతులకు మద్దతు ధర లభించింది. ఇప్పుడు చూస్తే కరెంటు బిల్లులు షాక్ కొట్టిస్తున్నాయి. రూ. 32 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దారు’ అని కాంగ్రెస్ నేతలపై షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చినప్పుడు వైఎస్సార్‌ను ఇంద్రుడు, భగీరథుడు అన్నారు. మహానేత మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి దోషిగా ముద్ర వేయాలని చూశారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చే శారు. ఎందరికో టికెట్లిచ్చి, పదవులు కట్టబెడితే వెన్నుపోటు పొడిచారు’ అని ఆమె ధ్వజమెత్తారు.

 

 చంద్రబాబుపై నిప్పులు

 

 ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనపై ప్రభుత్వ కాలర్ పట్టుకోవాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆ ప్రభుత్వాన్నే తన భుజాలపై మోశారని షర్మిల విమర్శించారు. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ టీడీపీ అధినేత రక్షణ కవచంగా నిలిచారని పేర్కొన్నారు. ‘తనకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియా చేస్తానంటున్నాడు. మరి తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశాడు? ప్రభుత్వ రంగ సంస్థలను మూతేయించి 26 వేల ఉద్యోగాలు ఊడగొట్టిన బాబు.. ఇప్పుడేమో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, రైతుల రుణాలు మాఫీ చేస్తానని అంటున్నాడు. ఆయనకు అధికారమిస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్వర్తించాల్సిన బాధ్యతను వైఎస్సార్ కాంగ్రెస్ తీసుకుందని, ప్రజా సమస్యలపై వారి పక్షాన నిలబడి పోరాడిందని గుర్తు చేశారు.

 

 కాంగ్రెస్ ప్రజలను హింసించింది

 

 ప్రజల బాగోగులను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని, ప్రజలను హింసించిందని షర్మిల ధ్వజమెత్తారు. ‘ఉచిత విద్యుత్ లేదు. మద్దతు ధర లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు ఎగ్గొట్టారు. ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టించారు. చార్జీలు, పన్నులు బాదారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెంచారు. గ్యాస్ ధర రూ. 450కి చేరింది’ అని ప్రజలకు ఏకరువుపెట్టారు. కాంగ్రెస్ అధ్వానంగా పాలించిందని దుయ్యబట్టారు.

 

 రాజన్న రాజ్యం... వైఎస్సార్ సీపీకే సాధ్యం

 

 విలువలకు, విశ్వసనీయతకు వైఎస్ జగన్ కట్టుబడ్డారని, ‘ఓదార్పు’ అన్న ఒక్క మాట కోసం పదవులు వదులుకున్నారని షర్మిల అన్నారు. ‘చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం వారం రోజులు దీక్ష చేశాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎండనక.. వాననకా, పగలనక.. రాత్రనకా ప్రజల్లోనే తిరిగాడు’ అని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో వైఎస్సార్ పథకాలను పక్కాగా అమలు చేయాలన్నా, ఆయనలా ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలన్నా, రాజన్న రాజ్యం స్థాపించాలంటే.. అది ఒక్క వైఎస్సార్‌సీపీకే సాధ్యం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు వేసే సమయంలో వైఎస్‌ను గుర్తు చేసుకోండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’ అని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో నాలుగు చోట్ల జరిగిన బహిరంగ సభలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి, హుజూర్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కోదాడ అభ్యర్థి ఎర్నేని వెంకటరత్నం బాబు, సూర్యాపేట అభ్యర్థి బీరవోలు సోమిరెడ్డి, నకిరేకల్ అభ్యర్థి నకిరేకంటి స్వామిలను ఈ సందర్భంగా ప్రజలకు షర్మిల పరిచయం చేశారు. జిల్లా పార్టీ నేతలు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు.

 

 20న హైదరాబాద్‌లో షర్మిల ప్రచారం

 

 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు. షర్మిల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మూడు రోజుల షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 20వ తేదీన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, శేరిలింగంపల్లిలో నిర్వహించే సభల్లో షర్మిల ప్రసంగిస్తారు. 21న మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో జరిగే సభల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే, 22న గ్రేటర్ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌లో నిర్వహించే సభల్లో షర్మిల ప్రసంగిస్తారని శివకుమార్ తెలిపారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top