ఆశీర్వాదం.. అపురూపం !


* పులివెందులలో నామినేషన్ సందర్భంగా జగన్‌కు జన నీరాజనం

* నామినేషన్ పత్రాలు తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేసిన జగన్

* అనంతరం మహోత్సవంలా సాగిన నామినేషన్ ర్యాలీ..

* వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో పోటెత్తిన పులివెందుల వీధులు

* త్వరలో జరగబోయే ఎన్నికల్లో.. ఈ కుట్రలకు దీటైన జవాబివ్వండి

* కుట్రలు, కుయుక్తులతో మహానేత వైఎస్‌ను మన మధ్యలేకుండా చేశారు

* ఆ కుట్రలతోనే నన్ను జైలుకు పంపేందుకూ వెనుకాడలేదు..

*అవే రాజకీయాలతో బంగారంలాంటి రాష్ట్రాన్నీ చీల్చేశారు..

* మన  తీర్పుతో సోనియా గాంధీ నీళ్లు తాగేలా చేయాలని జగన్ పిలుపు


పులివెందుల గడ్డ పులకించింది. ఎన్నికల యుద్ధంలో ఉన్న తన ముద్దుల బిడ్డకు మద్దతుగా  ఊరు ఊరంతా ఏకమై వీధుల్లోకి వచ్చి నిలబడింది. గురువారం నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ వేస్తున్నారని ఆనోటా ఈనోటా వినిపించిన మాట తప్ప.. రమ్మని పిలిచిన వారు లేరు. వాహనం సమకూర్చిన వారు లేరు. అయినా.. తమ ఇంట్లో శుభకార్యానికి నడుం బిగించిన చందంగా, ఇంటికొకరుగా చుట్టుపక్కల గ్రామాల జనం పులివెందుల బాట పట్టారు. ఉదయం 7 గంటలకే ఊరంతా జన సందడి. అలలు అలలుగా జనం. ఆశీర్వదించ వచ్చిన జన సంద్రాన్ని చూసి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. అపురూపమైన ఆ అభిమానానికి కంటనీరు చిలికింది. మాట పెగల్లేదు. కుట్రలను ఛేదించాలంటూ అతి కష్టంగా విజ్ఞప్తి చేశారు.

 

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘మహానేత వైఎస్ ఐదు సంవత్సరాల పాలన అనంతరం ఎన్నికలు అయిపోయిన వందరోజులకే కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలతో ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డిని మన మధ్యలేకుండా చేశారు. బాధనిపిస్తుంది, రాజకీయాలకోసం ఎంతటి అఘాయిత్యాలకైనా పాల్పడుతున్నారు. వ్యవస్థలు చెడిపోయాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన పావురాల గుట్ట వద్దకు వెళ్లినపుడు ముక్కలు ముక్కలుగా, చల్లాచెదురుగా పడిపోయిన ఆ హెలికాప్టర్ శకలాలను చూసినప్పుడు బాధ అన్పించింది. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలతో ఏమైనా చేశారన్న అనుమానం తలెత్తింది. ఆ కుట్రలు, కుతంత్రాలను మీ అండదండలతో ఎదుర్కొంటూ వచ్చాను. నన్ను ఎదుర్కోలేక జైలుకైనా పంపేందుకు వెనుకాడలేదు. అదే కుట్ర రాజకీయాల కోసం ఓట్లు, సీట్లు ధ్యేయంగా బంగారంలాంటి రాష్ట్రాన్నీ చీల్చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో.. ఈ కుట్రలకు, కుతంత్రాలకు దీటైన జవాబు ఇవ్వండి. మీ బిడ్డను ఆశీర్వదించండి, మనమిచ్చే తీర్పు.. సోనియా గాంధీని నీళ్లు తాగేలా చేయాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా జగన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పూల అంగళ్లు సర్కిల్‌లో వేలాదిగా తరలివచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 వైఎస్ సమాధి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి..

 అంతకుముందు ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంతన నామినేషన్ పత్రాలు ఉంచి ప్రార్థనలు చేశారు. తర్వాత పులివెందులలోని తన స్వగృహంలో బంధువులతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం పొందారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరారు. వేల మంది ప్రజలు ఈ సందర్భంగా జగన్‌కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. పూల అంగళ్లు సర్కిల్‌లో మాట్లాడుతూ ‘‘నాలుగున్నరేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు నాకు తెలుసు. శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయిందీ తెలుసు.

 

నా పట్ల, మా కుంటుంబం పట్ల మీరు చూపిస్తున్న ఆప్యాయత, ఆదరణ మరువలేనిది. మీ ప్రేమ, ఆప్యాయతను నా గుండెల్లో పెట్టుకొని వెళ్తున్నా.. మరో ఇరవై రోజుల్లో ఎన్నికలవగానే మీ బిడ్డ, మీ పులివెందుల ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పులివెందులకు వస్తా. ఇక్కడ నిలిచిపోయిన పనులు వందరోజుల్లో పూర్తిచేస్తానని హామీ ఇస్తున్నా’’ అని భరోసా ఇచ్చారు. తనను, కడప ఎంపీగా పోటీచేస్తున్న తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.

 

జగన్ కోసం ఒక్కటైన జనం..

 జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఓ మహోత్సవంలా సాగింది. ఎటూ చూసినా జనం.. కనుచూపు మేర జనమే జనం. ఉదయం 7గంటలకే పులివెందుల పురవీధులు పట్టణ ప్రజలతో నిండిపోయాయి. గ్రామీణ ప్రజానీకం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరిలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. భాకరాపురం నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ ర్యాలీ నాలుగు కిలోమీటర్లు.. పోటెత్తిన జనసంద్రంలో, మండుటెండలో సాగింది. ఎండ మండిపోతున్నా జనం మాత్రం లెక్క చేయలేదు. దారి పొడవునా జై జగన్ నినాదాలు హోరెత్తాయి. ఆర్టీసీ బస్టాండు నుంచి పూలఅంగళ్లు సర్కిల్ వరకూ రోడ్డు కిక్కిరిసిపోయింది. వృద్ధులు, రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలూ జగన్‌ను చూసేందుకు, ఆశీర్వదించేందుకు, కరచాలనం చేసేం దుకు పోటీపడ్డారు. జగన్ స్వగృహం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం వరకూ దారి పొడవునా జనం పూల వర్షం కురిపించారు. డప్పు వాయిద్యాల ముందు మహిళలు చిందులేశారు.

 

 నామినేషన్ వేయడానికి వెళ్లిన జగన్ వెంట వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డితోపాటు, మూడున్నర దశాబ్దాలుగా అండగా నిలుస్తున్న ఆత్మీయులు తోడు వచ్చారు.

 

 ఆస్తులు రూ.416.68 కోట్లు

 అఫిడవిట్‌లో పేర్కొన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పులివెందులలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.

 

 అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు

 మొత్తం ఆస్తి రూ. 416.68 కోట్లు

 2012-13లో ఆదాయం

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయం రూ. 13,92,03,275

 వైఎస్ భారతిరెడ్డి(సతీమణి) పేరిట రూ. 4,21,41,228

 

 మొత్తం ఆస్తులు

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట రూ. 371,79,75,863, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పేరిట రూ. 44,88,55,688 కలిపి మొత్తం రూ. 416,68,31,551 ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు.

 ఇందులో చరాస్తులు

 తన పేరిట రూ. 313,98,30,322, సతీమణి భారతి పేరిట

 రూ. 57,73,56,006, కుమార్తెలు హర్షిణిరెడ్డి పేరిట

 రూ. 5,69,564, వర్షారెడ్డి పేరిట రూ. 2,19,901 ఉన్నాయి. చరాస్తుల్లో ముఖ్యమైనవి..

 నగదు..

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నగదు రూ. 39,440, సతీమణి భారతిరెడ్డి వద్ద రూ. 45,529.

 బంగారు ఆభరణాలు

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వ్యక్తిగతంగా 667.300 గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాల విలువ రూ. 28,11,437.

 ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి వద్ద 9277.082 గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాల విలువ రూ. 5,69,19,751.

 వివిధ సంస్థల్లో పెట్టుబడులు

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట రూ. 307,27,42,795

 వైఎస్ భారతిరెడ్డి పేరిట రూ. 46,56,15,794

 

 స్థిరాస్తులు

 వ్యవసాయ భూములు, వ్యవసాయేతర స్థలాలు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలు అన్నీ కలిపి ఆస్తుల వివరాలు.

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట రూ. 30,02,10,668

 వైఎస్ భారతిరెడ్డి పేరిట రూ. 14,86,45,020

 మొత్తం...రూ. 44,88,55,688

 పన్ను బకాయి వివరాలు

 ప్రభుత్వ సేవా పన్ను బకాయి రూ. 3,94,375

 ప్రభుత్వ బకాయిలపై వివాదమున్నవి

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట రూ. 66,68,54,338.

 సతీమణి వైఎస్ భారతిరెడ్డి పేరిట రూ. 7,07,31,725 ఉన్నాయి.

 కేసులు

 సీబీఐ అభియోగాలు 10 ఉన్నాయి. కమలాపురం కోర్టులో ఒక కేసు విచారణ దశలో ఉంది. ఈడీ కేసుతోపాటు మరో మూడు కేసులు ఎఫ్‌ఐఆర్ దశలో పెండింగ్‌లో ఉన్నాయి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top