తొలిసారి శాసనసభకు వైఎస్ జగన్ పోటీ

తొలిసారి శాసనసభకు వైఎస్ జగన్ పోటీ - Sakshi


పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి  గురువారం పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహిన నడుమ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన  ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఉన్నారు.



కాగా  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా పులివెందుల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిపై 1.75లక్షలపైచిలుకు ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం 2011లో వైఎస్‌ఆర్ సీపీని స్థాపించడం.. మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ జగన్‌కి 5,45,043ఓట్ల భారీ మెజార్టీని అందించడంతో దేశస్థాయిలోనే ఆయన పేరు మారుమోగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభంజనం వీస్తున్న నేపథ్యంలో పులివెందుల నుంచి వైఎస్ జగన్ సీఎం అభ్యర్థిగా శాసన సభకు పోటీ చేస్తున్నారు.



ఇక నామినేషన్ కార్యక్రమం ముగిసిన అనంతరం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం కానున్నారు. ప్రజలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్చించనున్నారు. 18వ తేదీన జగన్ కడప పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేస్తారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top