ప్రభంజనం

ప్రభంజనం - Sakshi


 పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ ఘట్టా న్ని తిలకించేందుకు తరలి వచ్చిన జనంతో పులివెందుల పురవీధులు పులకించాయి. ఏ వీధి చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. మిద్దెలు, చెట్లు, స్తంభాలు ఎక్కడ అవకాశం అంటే నిలబడి స్వాగతం పలికారు.

 

ఒకపక్క భానుడి సెగ.. మరో పక్క ఉక్కపోత అన్నింటినీ బిగ్గపట్టి కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ వెంట నడుస్తూ ముందుకు సాగారు. 17వ తేదీన వైఎస్ జగన్ నామినేషన్ వేస్తున్నారన్న విషయం ముందుగానే గ్రామీణ ప్రాంతాలలో ప్రచారం జరగడంతో పులివెందులలో గురువారం ఎక్కడ చూసినా జనమే జనం. డప్పు వాయిద్యాల నడుమ పలువురు కార్యకర్తలు జగన్‌కు జై కొడుతూ ముందుకు సాగారు. ఒకపక్క ర్యాలీ కదం తొక్కుతుండగా.. మరోపక్క దారి వెంబడి మేడలపై వేల సంఖ్యలో జనాలు నిలబడి జగన్‌కు అభివాదం చేస్తూ కనిపించారు.

 

 ఇంట్లో ప్రత్యేక ప్రార్థనలు

 పులివెందులలోని భాకరాపురంలో ఉన్న నివాస గృహంలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలలో కుటుంబ సభ్యులతోపాటు వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరుపతి వేద పండితుల మం త్రోచ్ఛారణల మధ్య ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేసేందుకు వైఎస్ జగన్ బయలుదేరారు.

 

 ఆద్యంతం అభివాదం చేస్తూ..

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితోపాటు పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, పారి శ్రామికవేత్తలు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ఆనంద్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నేతలు నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు ప్రచార వాహనంపై ఉండగా.. వైఎస్ జగన్ ముందువైపున ఉన్నారు. ఇంటి వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు అడుగడుగునా వైఎస్ జగన్ అభివాదం చేస్తూనే ఉన్నారు.

 

 అవినాష్‌పట్ల

 అదే ఆప్యాయతను చూపండి..

 ఇంతకాలం మీరు మాకుటుంబం పట్ల చూపిన ప్రేమ మరువలేనిది. నాపట్ల మీరు చూపిన ఆప్యాయత, ఆదరణ ఇకపై నాతోపాటు నాతమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి పట్ల చూపాలని వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెం దుల ఎమ్మెల్యేగా తాను, కడప ఎంపీగా తన తమ్ముడు పోటీ చేస్తున్నామని మా ఇరువురిని ఆశీర్వదించాలని కోరారు. మీకు అన్ని విధాల అణుకువగా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా అందుబాటులో అవినాష్‌రెడ్డి ఉంటారని తెలిపారు.

 

 వైఎస్ జగన్‌పై పూలవర్షం..

 పులివెందులలోని ఆర్టీసీ బస్టాండు నుంచి మెయిన్ బజార్, పాత బస్టాండు, పూలంగళ్లు, ముద్దనూరు రోడ్డు, జూబ్లీ బస్టాఫ్, నాలుగు రోడ్ల కూడలి వరకు ప్రతి ఇంటి మీద నుంచి వైఎస్‌ఆర్ అభిమానులు జగన్‌పై పూల వర్షం కురిపించారు. సెక్యూరిటీ సిబ్బంది వద్దని వారిస్తున్నా.. వైఎస్ జగన్‌పై ఉన్న మమకారాన్ని అభిమానులు ఆపుకోలేకపోయారు. పూలవర్షంతోపాటు కొన్ని చోట్ల పూల దండలను, బొకేలను వాహనంపైకి విసిరి త మ అభిమానాన్ని చాటుకున్నారు. పూలు వర్షంలా కురవడంతో మెయిన్ రోడ్డంతా ఎక్కడ చూసినా పూలతోనే నిండిపోయి పచ్చగా మారిపోయింది.

 

 జనసంద్రమైన  ర్యాలీ..

 వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ జనసంద్రంగా మారింది. ఇంటి వ ద్ద నుంచి కడప రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, మెయిన్ రోడ్డు మీదుగా పూలంగళ్ల వరకు ర్యాలీ సాగింది. ఆశేష జన వాహినిని ఉద్ధేశించి వైఎస్ వివేకా, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు దాదాపు 11గంటలనుంచి 1గంట వరకు మండుటెండలో జగన్‌ను అనుసరిస్తూనే ర్యాలీలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, యువకులు అనే తేడా లేకుండా ర్యాలీలో పాల్గొనడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు.

 

 జగన్ నినాదాలతో

 మారుమోగిన పులివెందుల

 ర్యాలీ ఆరంభమైన సమయం నుంచి అయిపోయేంతవరకు పులివెందుల పట్టణం జగన్ నినాదాలతో మారుమోగిపోయింది. వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి.. జై వైఎస్‌ఆర్ సీపీ.. జై జై వైఎస్‌ఆర్ కాంగ్రెస్... కాబోయే సీఎం వైఎస్ జగ న్.. వైఎస్‌ఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో పులివెందుల దద్దరిల్లింది.

 

 కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్

 వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల శాసన సభ అభ్యర్థిగా వైఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. చిన్నాన్నలు వైఎస్ వివేకా, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, మామ ఇసీ గంగిరెడ్డి తదితరులు వెంట రాగా.. వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ ఆనంద్‌రెడ్డి కూడా వెంట ఉన్నారు. వైఎస్ జగన్ మూడు సెట్ల నామినేషన్  పత్రాలను రిటర్నింగ్ అధికారి అనిల్‌కుమార్‌రెడ్డికి అందజేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top