సిగ్గు లేకుండా ఎందుకొచ్చావ్..?

సిగ్గు లేకుండా  ఎందుకొచ్చావ్..? - Sakshi


శైలజానాథ్‌పై శివాలెత్తిన ఎమ్మెల్సీ శమంతకమణి

టీడీపీ, కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన శైలజానాథ్

చివరకు కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నానని ప్రకటన


 

 శింగనమల,   సభ్యత్వం లేకున్నా సిగ్గు లేకుండా టీడీపీ తరఫున పోటీ చేయడానికి వచ్చావా అని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా తహశీల్దారు కార్యాలయంలో శైలజానాథ్ నామినేషన్ దాఖలు చేస్తుండగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో దూషించారు. ‘కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉండి, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి.. ఇప్పుడు మా పార్టీ తరఫున దొంగ బీ-ఫాంతో నామినేషన్ వేయాలని వచ్చావా..?  చంద్రబాబు, సీఎంరమేష్ మాకు నామినేషన్ వేసుకోవాలని సూచించారు. మా అమ్మాయి యామిని బాల నామినేషన్ వేస్తున్నారు.



అయితే, బీ-ఫాం నాకిచ్చారని డ్రామా ఆడుతున్నావా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ దగ్గరకు వెళ్లి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున శైలజానాథ్ నామినేషన్ వేశారని, మళ్లీ టీడీపీ తరఫున ఎలా నామినేషన్ వేయిస్తారని శమంతకమణి ప్రశ్నించారు. ఈ విషయాలు మీరు బయటే మాట్లాడుకోవాలని సదరు అధికారి సూచించడంతో పోలీసులు ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు. చివరకు శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ వేసి బయటకు వచ్చారు. శైలజానాథ్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చి వెంటనే వెనక్కు తీసుకున్నట్టు తెలిసింది.



 కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశా: శైలజానాథ్



 తనకు ఇతర పార్టీల నుంచి ఒత్తిళ్లు, బీ-ఫాంలు వచ్చినా చివరకు కాంగ్రెస్ పార్టీ తరఫునే శింగనమల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశానని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయంగా ఎదిగానన్నారు. ఉదయం నుంచి అందరూ రకరకాలుగా ఊహించుకున్నారని, అవేవీ నిజం కాదన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top