విజయవాడ బరిలో నిలిచేదెవరు?


* కేశినేని నాని, పొట్లూరి అభ్యర్థిత్వంపై టీడీపీ తర్జన భర్జన

* లోక్‌సభ సీటు కోసం ఇద్దరూ చంద్రబాబుపై ఒత్తిడి

* పవన్ అండ ఉన్న పొట్లూరివైపే టీడీపీ అధినేత మొగ్గు

* ఓ మీడియా అధిపతి జోక్యంతో నానికే టికెట్ ఖరారైనట్లు ప్రచారం


 

సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీకి దింపాలన్న విషయంపై టీడీపీ తర్జనభర్జన పడుతోంది. ఇక్కడి నుంచి తానే పోటీచేస్తానని కేశినేని ట్రావెల్స్ యజమాని కేశినేని నాని పట్టుబడుతుంటే, సినీనటుడు పవన్‌కల్యాణ్ మద్దతుందని చెప్పుకుంటున్న పీవీపీ గ్రూప్ యజమాని పొట్లూరి వరప్రసాద్ అంతకంటే ఎక్కువగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కేశినేని నానియే అక్కడ పార్టీ అభ్యర్థి అవుతారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం కొందరు మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. మరోవైపు పొట్లూరి వరప్రసాద్‌కు టికెటిస్తే పార్టీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

 

 చంద్రబాబు సైతం పవన్ పేరును ముందు పెట్టి బీజేపీని ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పొట్లూరికి మార్గం సుగమమైందన్న విషయం తెలిసిన నానీ వర్గం భగ్గుమంది. పవన్‌కల్యాణ్‌తో పాటు పొట్లూరిపై నాని విమర్శలకు దిగారు. ఆ సీటు నుంచి తానే పోటీచేస్తానని తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. నానీని పిలిచి బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా తగ్గేది లేదని భీష్మించారు. విజయవాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

 

 ఇదే సమయంలో ఓ మీడియా అధిపతి జోక్యం చేసుకున్నారు. నానికే టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తాజాగా నానీకే టికెట్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎవరెంత ప్రచారం చేసుకున్నా తానే విజయవాడ ఎంపీ అభ్యర్థినని, ఈ విషయంలో చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌కు హామీనిచ్చారని పొట్లూరి వరప్రసాద్ ధీమాగా చెబుతున్నారు. కాగా, చంద్రబాబుతో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే దిరశం పద్మజ్యోతి సోమవారం భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల లోక్‌సభ సీటును ఆమె ఆశిస్తున్నారు. ఈ మేరకు బాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top