భలే మంచి రోజు..


సాక్షి, కర్నూలు: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు బుధవారం నుంచి ఊపందుకోనున్నాయి. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా మొదటి రోజు ముగ్గురు అభ్యర్థులు 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత 13, 14 తేదీల్లో సెలవులు వచ్చాయి. 15వ తేదీ మంగళవారం కావడం, అలాగే పౌర్ణమి రావడంతో పలువురు అభ్యర్థులు ఉత్సాహం చూపలేదు. 19వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉన్నప్పటికీ 18న సెలవు రోజు కావడంతో ఇక మూడు రోజులే సమయం ఉంది. దీంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్ వేయడానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. తక్కువ సమయం ఉండటంతోనూ, బుధవారం రోజు ముహూర్తం బాగుండడంతోనూ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అధిక సంఖ్యలో 16న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమయ్యారు.



ఈ నేపథ్యంలో పోలీసులకు బందోబస్తు కత్తిమీద సాములా మారనుంది. అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించనుండటం, పైగా కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదుతో పోలీసుల విధులు కఠినతరం కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజకీయ పార్టీల అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు.

 వైఎస్‌ఆర్‌సీపీ దూకుడు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించడంతో ఈనెల 16న అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. బుధవారం కర్నూలులో కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బుట్టా రేణుక, నంద్యాలలోని జేసీ చాంబర్‌లో నంద్యాల పార్లమెంటు అభ్యర్థి ఎస్పీవై రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

 

 అలాగే నంద్యాలలో భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి, కోడుమూరులో మణిగాంధీ, ఆత్మకూరులో బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మిగనూరులో ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక మంత్రాలయంలో బాల నాగిరెడ్డి, ఆలూరులో గుమ్మనూరు జయరాం, బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి, ఇక 17వ తేదీన డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నందికొట్కూరులో ఐజయ్య నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అయితే 12వ తేదీనే పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా,  మంగళవారం(15వ తేదీన) నాడు ఆదోనిలో సాయిప్రతాప్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

 

 కాంగ్రెస్, టీడీపీల్లో టెన్షన్.. కాంగ్రెస్, టీడీపీల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించడం వల్ల నామినేషన్ల ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతాయని ఇరు పార్టీ నేతలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా 16వ తేదీన కర్నూలులో కాంగ్రెస్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, టీడీ పీ అభ్యర్థి వీరభ ద్రగౌడ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, కోడుమూరులో కాంగ్రెస్ అభ్యర్థి పి.మురళీకృష్ణ తమ నామినేషన్లను దాఖలు చేయబోతున్నారు.

 

 ‘నామ’మాత్రం

 కర్నూలు(కలెక్టరేట్) : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులు 22 నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి రెండు రోజుల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు శ్రీశైలం, బనగానపల్లె, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు బోణీ కాలేదు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top