సినీ నేతల ఖిల్లా.. గోదావరి జిల్లా

సినీ నేతల ఖిల్లా.. గోదావరి జిల్లా - Sakshi


సినిమా పరిశ్రమకు, గోదావరి జిల్లాలకు ఉన్న అనుబంధం విడదీయరానిది. పలువురు నటీనటులు, దర్శకులు ఈ ప్రాంతం నుంచి వచ్చినవాళ్లే. నాటి నుంచి నేటివరకు కూడా చాలామంది నటీనటులను, దర్శక నిర్మాతలను పశ్చిమగోదావరి జిల్లా ఆదరించి, వాళ్లను చట్టసభలకు పంపింది. మరికొందరిని తిప్పికొట్టింది కూడా. పాలకొల్లు ప్రాంతానికి చెందిన దాసరి నారాయణరావు, మొగల్తూరులో పుట్టిన రెబల్స్టార్ కృష్ణంరాజు కేంద్ర మంత్రిపదవులను అలంకరించారు. సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. సొంత జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి  స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్లాపయ్యింది. 2009 ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి, పాలకొల్లు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయగా పాలకొల్లులో ఓడిపోయారు.



రెబెల్‌స్టార్ కృష్ణంరాజు స్వగ్రామం మొగల్తూరు. ఆయన తొలిసారి 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరసాపురం లోక్‌సభ  స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1999 ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసి గెలిచి, కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. అనంతర పరిణామాల్లో బీజేపీని వీడి 2009లో పీఆర్పీలో చేరి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. సూపర్‌స్టార్ కృష్ణ 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 1991 ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పాల కొల్లు వాసి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజ్యసభ సభ్యుడయ్యారు. కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.



పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సినీ నిర్మాతలు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), చేగొండి హరరామ జోగయ్య, అంబికా కృష్ణ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. హరరామజోగయ్య, మాగంటి బా బు మంత్రి పదవులు కూడా నిర్వహించారు. జోగయ్య ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా వ్యవహరించారు. మాగంటి బాబు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీచేసి ఓసారి గెలిచారు. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్నారు. 2004లో దెందులూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాగంటి వైఎస్ హయాంలో చిన్నతరహా నీటిపారుదలశాఖ మంత్రిగా వ్యవహరించారు. మరో నిర్మాత అంబికా కృష్ణ 1999 ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top