కలిసేపోదాం ఎన్నియాలో..!

కలిసేపోదాం ఎన్నియాలో..! - Sakshi


కాంగ్రెస్, సీపీఐ పొత్తు వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న సీపీఐ కార్యకర్తలను దారికి తెచ్చేందుకు అటు సీపీఐ, ఇటు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను బుజ్జగించేందుకు పాట్లు పడుతున్నారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో సమావేశమై కార్యకర్తల్లో ఏకాభిప్రాయం కుదిర్చేందుకు యత్నించారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని ఇరుపార్టీల నేతలు కార్యకర్తలకు హితవు పలికారు. పొత్తులో హుస్నాబాద్ సీటు కాంగ్రెస్‌కు వచ్చింది కనుక సీపీఐ కార్యకర్తలు తమతో కలిసి రావాలని కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కోరారు.



పార్టీ రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని గౌరవించాలని, కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ కార్యకర్తలకు నిధులు కేటాయిస్తూ, తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కూన శోభారాణి అన్నారు.  సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు కేడం లింగమూర్తి, మట్టా రాజిరెడ్డి, ముత్యాల సంజీవరెడ్డి, ఆకుల వెంకట్, కోమటి సత్యనారాయణ, హసన్, బొల్లి శ్రీనివాస్, నోముల శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, పెండెల ఐలయ్య, రాంగోపాల్‌రెడ్డి, జాగీరు సత్యనారాయణ, సృజన్‌కుమార్, అందె స్వామి, గడిపె మల్లేశ్, బాలమల్లు, బందెల కిషన్ తదితరులు పాల్గొన్నారు.



చేతి’లో ఇమడని కార్యకర్తలు



 బలమున్న స్థానాన్ని కాంగ్రెస్‌కు కట్టబెట్టారని సీపీఐ కార్యకర్తలు మండిపడ్డారు. ఒంటరిగానైనా బరిలో నిలవాలనుకున్న నాయకత్వం వెనుకడుగు ఎందుకు వేసిందని ప్రశ్నించారు. పేదలను ఆదుకోని ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వానికి ఓట్లేసేది లేదని తెగేసి చెప్పారు. బీడుపడిన భూములకు నీళ్లు మళ్లించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీకే ఓట్లేసి, మహానేత రుణం తీర్చుకుంటామన్నారు. కార్యకర్తలపై కేసులు పెట్టించి, ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.



గౌరవెళ్లి, గుడాటిపల్లి, రామవరం, అక్కన్నపేట తదితర గ్రామాలకు చెందిన సీపీఐ కార్యకర్తలు గంభీరపు వివేకానంద్, చిట్టాల కొముర య్య, మంద శ్రీనివాస్, కొమ్ముల పర్శరాములు, గుంటుపల్లి దుర్గేశం, మాటూరి సదానందం తదితరులు వచ్చి కార్యల యం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీకి గౌరవం దక్కేదన్నారు. ఎట్టి పరిస్థితిలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ఓట్లు వేయబోమన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే ఓట్లు వేయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు పెండెల అయిలయ్య, గడిపె మల్లేశ్, సృజన్‌కుమార్ తదితరులు వచ్చి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదని వెళ్లిపోయారు.

 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top