కొద్ది రోజులు ఓపిక పట్టండి..

కొద్ది రోజులు ఓపిక పట్టండి.. - Sakshi


 పులివెందుల, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు మరో 20 రోజుల్లో రాబోతున్నాయి.. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాలం అతి సమీపంలోనే ఉంది. అందరి కష్టాలు తీరుతాయి... కన్నీళ్లు పోతాయి.. కేవలం మూడు వారాలు ఓపిక పట్టండంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఓదార్చారు. శుక్రవారం ఉదయం పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన యువనేత వైఎస్ జగన్‌కు అడుగడుగునా జనాలు బ్రహ్మరథం పట్టారు. ముద్దనూరు మండలం పెద్దదుద్యాల వద్ద పలువురు స్థానికులు వచ్చి రోడ్డుపై నిలబడి వైఎస్ జగన్ కాన్వాయ్‌ను నిలబెట్టారు.

 

 అవ్వ చేతులు చూసి చలించిన జగన్:

 పెద్ద దుద్యాల గ్రామానికి చెందిన వారందరితో మాట్లాడుతుండగా.. సమీపంలో పొలం పనులు చేసుకుంటూ

 వైఎస్ జగన్‌ను చూసి వృద్ధురాలు అక్కడికి వచ్చారు. జగన్ చేతులను పట్టుకుని నాయనా బాగున్నావా అంటూ పలకరించింది. ఇంతలోనే జగన్ అవ్వ చేతులను చూసి.. ఏమిటి అవ్వ నీ చేతులు ఇలా అయిపోయాయి... పొలంలో పనులు చేస్తూ నన్ను చూడటానికి ఇలా వచ్చావా.. నీ చేతులు చూస్తుంటే చాలా బాధేస్తోంది.

 

 ఇంకా ఎక్కడ పనిచేస్తావవ్వా.. ఇంత వయస్సు వచ్చినా పని చేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయి.. 20రోజులు ఆగవ్వా.. నేను సీఎం కాగానే పింఛన్ పెంచడంతోపాటు అందరి కష్టాలు తొలిగిపోయేలా కృషి చేస్తానని వైఎస్ జగన్ వృద్ధురాలు  చెన్నమ్మతో పేర్కొనగానే చెమర్చిన కళ్లతో నాయనా... నా మనుమడు లాంటి నీవు చల్లగా ఉండాలంటూ దీవించారు.

 

 గ్రామ.. గ్రామాన నీరాజనాలు :

 పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరుకు బయలుదేరారు. అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు  ప్రయాణించగానే.. రాయలాపురం సమీపంలో పలువురు రచ్చుమర్రిపల్లె గ్రామస్తులు వాహనాన్ని ఆపి జగన్‌ను పలకరించారు. అనంతరం ఆర్.తుమ్మలపల్లె ఎస్సీ కాలనీ వద్ద రెండు చోట్ల వాహనాన్ని అడ్డుకుని జగన్‌తో మాట్లాడారు. సమీపంలోని తోటల్లోని కొంతమంది రైతులు వైఎస్ జగన్‌పై  మల్లెపువ్వులు చల్లి అభిమానం చాటుకోగా.. మరికొంతమంది జగన్‌కు చీనీకాయలు ఇచ్చారు. అనంతరం తొండూరు వద్ద కూడా మండల కన్వీనర్ వై.వి.మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు జగన్‌ను కలిశారు. చిన్నారులను వైఎస్ జగన్ ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం మల్లేల సమీపంలో కూడా అభిమానులు పార్టీ నాయకులను కలిసి చర్చించారు.

 

 ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. ముద్దనూరు మండలం పెద్దదుద్యాల వద్ద మహిళలు.. ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి సమీపంలో తరలి వచ్చిన వందలాది మందిని వైఎస్ జగన్ పలకరిస్తూ ముందుకు సాగారు. ఎర్రగుంట్ల సర్కిల్‌లో తరలి వచ్చిన జనంతో జగన్ మమేకమయ్యారు. సమస్యలు తెలుసుకున్నారు. అందరికీ  అభివాదం చేస్తూ కదిలారు. అక్కడ నుంచి వైఎస్ జగన్‌తోపాటు బైకులలో అనేక మంది యువకులు వెంట కదిలి వచ్చారు. పొట్లదుర్తి వద్ద వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ జగన్ నినాదాలతో హోరెత్తించారు.

 

 వారందరి కోరిక మేరకు వైఎస్ జగన్ కిందకు దిగి అందరితో కరచాలనం చేశారు. అనంతరం సమీపంలోని  శివాలయంలో పెళ్లి వేడుక జరుగుతుండగా వైఎస్ జగన్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న పెళ్లి బంధువులంతా రోడ్డుపైకి వచ్చి వైఎస్ జగన్ కాన్వాయ్ ఆపాలని కోరారు. వెంటనే వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదలగా.. పెళ్లి బృందం ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి వేడుకకు వచ్చిన మహిళలతోపాటు వధూవరుల బంధువులందరూ జగన్‌తో మాట్లాడారు.. కరచాలనం చేశారు. జగన్‌తో ఫొటోలు తీయించుకుని సంబరాలు చేసుకున్నారు. అలాగే సమీపంలో కాంట్రాక్టు లెక్చరర్లతోపాటు మెడికల్ డిపార్ట్‌మెంటుకు చెందిన పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వం రాగానే అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

 

 అక్కడ నుంచి కూడా ప్రొద్దుటూరుకు వెళ్లడానికి గంటకుపైనే సమయం పట్టింది. ఎక్కడ చూసినా జనాలు రోడ్డుపైనే ఆపుతూ జగన్‌తో మమేకమవుతుండటంతో ఎక్కువ సమయం పట్టింది.  పులివెందుల నుంచి 9గంటలకు బయలుదేరిన జగన్ మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రొద్దుటూరు వెళ్లడానికి దాదాపు 4.30గంటల సమయం పట్టింది. వైఎస్ జగన్ వెంట ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 

 ఇమాంబి రోడ్డు దాటినంత వరకు వేచి చూసిన జగన్

 ప్రొద్దుటూరు పట్టణంలో బహిరంగ సభ అనంతరం వైఎస్ జగన్ మైదుకూరుకు బయలుదేరారు. ఇంతలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో జనాలు వైఎస్ జగన్‌ను చూసి కలిసేందుకు వాహనాన్ని ఆపారు. ఎదురుగా ఉన్న వృద్ధురాలు ఇమాంబి జగన్ వద్దకు ట్రాఫిక్‌ను దాటుకుంటూ మిట్ట మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో పాదరక్షలు లేకుండా వచ్చింది. జగన్ రెండు బుగ్గలను నిమురుతూ బేటా అచ్చా హై అంటూ పదం కదిపింది. రెండు మాటలు మాట్లాడింది.. ఆనందంతో తిరుగు ముఖం పట్టింది.

 

 అయితే ఆమెకు పాదరక్షలు లేని విషయాన్ని గమనించిన జగన్.. ట్రాఫిక్ ఎలా దాటుకుని వెళుతుందో అనే ఆందోళనతో కొద్దిసేపు అలాగే చూస్తూనే ఉన్నారు. అంతలోనే అక్కడ ఉన్న అభిమానులంతా జగన్‌ను కరచాలనం చేసేందుకు ఎగబడటంతో ఒకవైపు వారితో మాట్లాడుతున్నా.. మనస్సు మాత్రం ఇమాంబి ఎలా వెళ్లిందనే ఆలోచన మదిలో మెదులుతునే ఉంది.  వాహనాలు కదిలే సమయంలో కూడా మరోమారు ఇమాంబి ఎలా వెళ్లింది.. క్షేమంగా చేరింది కదా అంటూ.. 10నిమిషాలు అక్కడే ఆగి వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతలోనే  మనుమడు ఇమాంబి అవ్వను ఎత్తుకుని సార్.. ఇవతలికి వచ్చిందంటూ చూపించడంతో అప్పుడు వైఎస్ జగన్ రెండు చేతులతో చల్లగా ఉండాలంటూ నమస్కరిస్తూ వాహనంలో కూర్చొన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top