ఉద్యమకారులను గెలిపించండి

ఉద్యమకారులను గెలిపించండి




 టీజేఏసీ పిలుపు  ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయం

 

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వారినే ఈ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యమకారులకు మద్దతుగా నిలవాలని, తెలంగాణ వ్యతిరేక పార్టీలను ఓడించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలా లేక ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలా? అన్న దానిపై జేఏసీలో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పటిదాకా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పార్టీలకు మద్దతివ్వకుండా.. తటస్థంగా వ్యవహరించడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.



తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఏఐసీసీ ముఖ్యులతోనూ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ పార్టీకి తెలంగాణలో అండగా ఉండాల్సిన బాధ్యత జేఏసీపై ఉందని వాదించారు. అయితే మరికొందరు మాత్రం టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ఉద్యమ గొంతుకు బలం చేకూరిందని వాదించారు. టీఆర్‌ఎస్ అండగా ఉండటం వల్లనే అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు క్రియాశీలంగా వ్యవహరించాయని గుర్తుచేశారు. బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీఆర్‌ఎస్‌లు మాత్రమే జేఏసీలో ఉన్నాయని, మిగిలిన పార్టీలకు మద్దతివ్వాలన్న చర్చ ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతోనే పవిత్రతను కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా సురేఖ, మహేందర్ రెడ్డి వంటివారి గురించే ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌లో సమైక్యవాదానికి అనుకూలంగా వ్యహరించిన పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు వంటి నేతల గురించి ఎందుకు చర్చించడం లేదన్న ప్రస్తావన కూడా వచ్చింది. ఏ పార్టీకి మద్దతివ్వాలన్న విషయంలో జేఏసీ నేతల మధ్య విభజన వచ్చే అవకాశాలున్నాయనే ఆందోళన కూడా ఒక దశలో వ్యక్తమైంది. చివరకు తటస్థంగా ఉంటేనే జేఏసీ మనుగడకు మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.



భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని, ఉద్యమకారులెవరో, తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు పనిచేశారో కూడా ప్రజలకు అర్థమైందని కోదండరాం పేర్కొన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ, వైఎస్సార్ సీపీలను తెలంగాణలో తిరస్కరించాలన్నారు. జేఏసీలో చేరడానికి వివిధ సంఘాలు ఆసక్తి చూపిస్తున్నాయని, అలాగే జేఏసీ నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ కమిటీ ప్రతిపాదనలను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని కోదండరాం వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్, కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, విఠల్, నేతలు రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రఘు, మణిపాల్ రెడ్డి, పిట్టల రవీందర్ పాల్గొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top