రెండువారాల్లో జగన్ ప్రభుత్వం

రెండువారాల్లో జగన్ ప్రభుత్వం - Sakshi

భీమవరం, న్యూస్‌లైన్ : మరో రెండు వారాల్లో ప్రజలు కోరుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాబోతోందని ఆ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. భీమవరం మండలంలో మంగళవారం ఆయన భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ప్రజలు రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వంక విలేకరులతో మాట్లాడారు. తమ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందని, దీన్ని బట్టి చూస్తే ప్రజలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఎదురుచూస్తున్నారని అర్థమవుతోందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్న జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై మంచి విజన్ ఉన్న నాయకుడని అన్నారు. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది జగన్‌కే సాధ్యమన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్సార్ సీపీకి పట్టం కట్టాలన్నారు. నరసాపురం ఎంపీ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు తథ్యమని రవీంద్రనాథ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆక్వా పరిశ్రమకు పేరుగాంచిన భీమవరం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

 

 చంద్రబాబు ఎత్తులను చిత్తుచేయండి

 ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న ఎత్తులను చిత్తు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమవరం అసెంబ్లీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను తీవ్రంగా వంచించిన చంద్రబాబు మరోసారి ఆల్‌ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఆయనకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని గ్రంధి ప్రజలను కోరారు. పార్టీ నాయకులు గుబ్బల తమ్మయ్య, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, కొయ్యే మోషేన్‌రాజు, వేండ్ర వెంకటస్వామి, బండి శక్తేశ్వర సాంబమూర్తి, తిరుమాని ఏడుకొండలు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

 రోడ్‌షోకు విశేష స్పందన

 భీమవరం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం అభ్యర్థి వంక రవీంద్రనాథ్, భీమవరం అసెంబ్లీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేశారు. లోసరి, బర్రెవాని పేట, తోకతిప్ప, గూట్లపాడు, గొల్లవానితిప్ప, ఎల్‌వీఎన్ పురం, అనాకోడేరు, కొమరాడ, రాయలం, చిన అమిరం గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వ్యవసాయ, ఆక్వా రైతులు, గృహ నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకుంటూ అండగా నిలుస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. యువకులు వైఎస్సార్ సీపీకి మద్దతు ప్రకటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వృద్ధులు, వికలాంగులు ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అని స్పష్టం చేయడంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. మేడిది జాన్సన్, కనకరాజు సూరి, చినిమిల్లి వెంకటరాయుడు, కొప్పర్తి సత్యనారాయణ, వీరరాఘవులు, కటారి కాశిరాజు, కాండ్రేకుల నరసింహరావు, రేవు పూర్ణచంద్రరావు, నాగిడి సుభద్రా నరసింహ స్వామి, సర్పంచ్‌లు పెచ్చెట్టి సుబ్బారావు, తిరుమాని బాలరాజు, కొప్పర్తి ఉమాపల్లారావు, రావూరి విజయకుమార్, అల్లూరి రవిరాజు, జెడ్పీటీసీ అభ్యర్థి రేవు సత్యవతి  పాల్గొన్నారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top