టీఆర్‌ఎస్ వసూళ్ల పార్టీ


 సాక్షి, ఖమ్మం: ‘టీఆర్‌ఎస్ బూతుల పార్టీ.. వసూళ్ల పార్టీ.. బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేయడమే వారి ధ్యేయం..’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణరాష్ట్రసమితిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భద్రాచలం, కొత్తగూడెం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో  నిర్వహించిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.   టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాదనుకుని దళితుడిని సీఎం చేస్తానని బీరాలు పలికాడని, తెలంగాణ రావడంతో ఇప్పుడు ఆ మాట మరిచాడని విమర్శించారు. తెలంగాణ ఇవ్వగానే సోనియా దేవత అని చెప్పిన కేసీఆర్ హైదరాబాద్‌వచ్చి గుర్రం ఎక్కి తన వైఖరి మార్చుకున్నాడని ఎద్దేవా చేశారు.



 అధికారం కోసం వెంపర్లాడే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తున్నాడని విమర్శించారు. ఆయనపై ఆయనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు స్థానాల్లో పోటీచేస్తున్నాడని, ఇక తెలంగాణ ప్రజలను ఏం అభివృద్ధి చేస్తాడని విమర్శించారు. రాజకీయాలను కుటుంబంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెల్లని కాసుగా మారిందన్నారు. మన్మోహన్ సోనియాగాంధీ పపెట్ అని, రాహుల్‌గాంధీ మొదబ్బాయ్ అని విమర్శించారు. కొడుకు, కూతురు, అల్లుడు పాలనలా యూపీఏ ప్రభుత్వం తయారైందన్నారు.  తాము అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్నారు. సింగరేణి సంస్థను అభివృద్ధిచేయడంతోపాటు ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.



 అలాగే ఖమ్మం నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. డైనమిక్ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. చంద్రబాబు పర్యటనలో... ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు,ఫణీశ్వరమ్మ, కోనేరు సత్యనారాయణ, సండ్ర వెంకటవీరయ్య, బాణోతు బాలాజీనాయక్, మోత్కుపల్లి నర్సింహులు, స్వర్ణకుమారి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top