కారు జోరు


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాదేశిక పోరులో కారు జోరు కొనసాగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. జిల్లాలో 52 జెడ్పీటీసీ స్థానాలకు 38 స్థానాలు కైవసం చేసుకుని జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేస్తోంది. 27 మంది జెడ్పీటీసీల మద్దతు ఉంటే జెడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. కానీ టీఆర్‌ఎస్‌కు సాధారణ మెజారిటీ కంటే 11 జెడ్పీటీసీలు అధికంగా వచ్చాయి. తెలంగాణ సాధన కోసం ఆ పార్టీ చేసిన పోరాటానికి జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు.



తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన భారీ మెజారిటీ వచ్చింది. టీడీపీకి కంచుకోటగా పేరున్న జిల్లా పరిషత్‌ను తొలిసారిగా టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఆ పార్టీ వర్గాల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. బోథ్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. బోథ్‌లో ఏడు, మంచిర్యాలలో మూడు, చెన్నూర్‌లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు.



 నామమాత్ర స్థానాల్లో కాంగ్రెస్

 తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నామమాత్ర స్థానాలకు పరిమితమైంది. కేవలం పది జెడ్పీటీసీ స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఖాతాను కూడా తెరువలేదు. తెలంగాణపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమన్న టీడీపికి రెండు జెడ్పీటీసీ స్థానాలే వచ్చాయి. భైంసా జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి, దహెగాంలో బీఎస్పీ అభ్యర్థి జెడ్పీటీసీలు గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చిన బీజేపీకి జిల్లాలో ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదు. ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు ఖాతా తెరువలేదు.



 మండల పరిషత్‌లపైనా గులాబీ జెండా..

 అత్యధిక మండల పరిషత్‌లపైనా టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసింది. జిల్లాలో మొత్తం 636 ఎంపీటీసీ స్థానాలుండగా, మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 633 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగగా, టీఆర్‌ఎస్ 292 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. 52 మండల పరిషత్‌లకు 20 మండల పరిషత్‌ల చైర్‌పర్సన్ పీఠాలను దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 27 చోట్ల హంగ్ ఫలితాలు వచ్చినా 20కి పైగా మండలాల్లో టీఆర్‌ఎస్సే అధిక్యం సాధించింది.



 165 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగలిగిన కాంగ్రెస్‌కు నాలుగు మండల పరిషత్‌లలో మాత్రమే స్పష్టమైన మెజారిటీ దక్కింది. భైంసాలో మాత్రం స్వతంత్రులే ఎక్కువగా ఎంపీటీసీలుగా గెలుపొందారు. కేవలం 63 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ ఏ ఒక్క మండల పరిషత్‌లో కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీకి 24 ఎంపీటీసీలు, ఎంఐఎంకు రెండు, బీఎస్పీకి 28, సీపీఐకి ఏడు చొప్పున ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. 55 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.



 అర్ధరాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు

 జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో జరిగాయి. మొదటి విడత ఏప్రిల్ 6న 21 మండలాల్లో పోలింగ్ జరుగగా, రెండో విడత 31 మండలాల్లో అదేనెల 11న జరిగింది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరుగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు.. అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. ముందుగా బ్యాలెట్ పేపర్లను ఒక చోట పోసి రెండు బ్యాలెట్లను వేర్వేరుగా డబ్బాల్లో వేశారు.



ఆ తర్వాత 25 బ్యాలెట్లకు ఒక కట్టగా కట్టి ఓట్లను లెక్కించారు. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో ఈ లెక్కింపు జరిగింది. ఆదిలాబాద్ డివిజన్‌లోని పది మండలాల ఓట్లను జిల్లా కేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో లెక్కించారు. నిర్మల్ డివిజన్‌లోని 13 మండలాల లెక్కింపు నిర్మల్ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఉట్నూర్ డివిజన్‌లోని ఎనిమిది మండలాల ఓట్లు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో, ఆసిఫాబాద్ డివిజన్‌లోని తొమ్మిది మండలాల ఓట్లు ఐటీడీఏ బాలికల హాస్టల్‌లో, మంచిర్యాల డివిజన్‌లోని 12 మండలాల ఓట్ల లెక్కింపు లక్సెట్టిపేట్‌లోని సాంఘీక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగింది.



 క్యాంపునకు టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు..

 జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ ఆ పార్టీ నేతలు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. చైర్‌పర్సన్ పీఠానికి ఆ పార్టీలో పోటీ నెలకొంది. మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ జెడ్పీటీసీ, నిర్మల్ ప్రాంతానికి చెందిన మరో జెడ్పీటీసీలు చైర్‌పర్సన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సుమారు 31 మంది టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు మంగళవారం క్యాంపునకు తరలివెళ్లారు. వారిలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకే జెడ్పీ చైర్మన్ ఎన్నికవుతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top