టాప్ ఫైవ్ జంపింగ్ జపాంగ్లు

టాప్ ఫైవ్ జంపింగ్ జపాంగ్లు - Sakshi


జంప్ జిలానీలు... జంపింగ్ జపాంగ్ లు.... పేరేదైతేనేం ఎన్నికల సమయంలో ఈ విచిత్ర జీవులు హఠాత్తుగా పుట్టుకొస్తాయి. నిన్నటిదాకా వేసుకున్న కండువాను విసిరేసి, కొత్త పార్టీ కండువాలు వేసేసుకుంటారు. అయితే ఆ కండువా ఎన్నాళ్లుంటుంది? కోడి కూతలో పార్టీలు మార్చే వాళ్లు ఈ ఎలక్షన్లోనూ ఉన్నారు. పార్టీలు మారడం చొక్కాలు మార్చినంత తేలిగ్గా చేస్తారు. మన రాష్ట్రంలో టాప్ అయిదుగురు జంపింగ్ జపాంగ్ లెవరో చూద్దామా?



1) జేసి దివాకర్ రెడ్డి - అసలు జెసి కాంగ్రెస్ ను విడిచిపెడతారన్నది ఎవరూ ఊహించని పరిణామం. కానీ ఈ పరిణామం స్విచ్ నొక్కితే లైటు వెలిగినంత వేగంగా జరగలేదు. కోడి గుడ్డు పొదిగినంత నిదానంగా జరిగింది. 'పార్టీకి భవిష్యత్తుండదు,' 'నేను తప్ప పార్టీలో ఎవరూ మిగలరు' వంటి స్టేట్ మెంట్లు ముందు వచ్చాయి. తరువాత మువ్వన్నెల కండువా రంగు మారి పసుపు రంగుకి నెమ్మదిగా మార్ఫింగ్ చేసినంత సులువుగా జరిగింది. ఇప్పుడు జెసి, ఆయన సోదరుడు పచ్చ కండువా వేసుకున్నారు.




2) ఆకుల రాజేందర్ - 'కన్ ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను' అన్న హీరోకి ఉన్న దూకుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కి కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి చెప్పా పెట్టకుండా వచ్చి టీఆర్ ఎస్ కండువా వేసుకున్నారు. అదీ కేసీఆర్ సమక్షంలో. ఆ మరుసటి రోజే గులాబీ కండువాను పారేసి, మళ్లీ పాత కండువా వేసేసుకున్నారు. ఇంత శరవేగంగా పార్టీలు మారిన ఘనత ఈ మధ్యకాలంలో ఆకుల రాజేందర్ కే దక్కింది. ఇంత చేసినా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు.




3) రఘురామ కృష్ణం రాజు - బిజెపి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సీపీ, అక్కడి నుంచి మళ్లీ బీజేపీ. కానీ కట్ చేస్తే ఆయన నర్సాపుర్ లోకసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి. ఆయన పోటీ పడితే పాదరసంతోనే పోటీ పడాలి. అంత వేగంగా స్టెప్పులేశారు రఘురామ.




4) దాసోజు శ్రవణ్ - ఆవేశం శ్రవణ్ సొంతం. ఆయన విమర్శించడం మొదలుపెడితే కామాలు, ఫుల్ స్టాపులు ఉండవు. పీఆర్ పీలో ఉన్నప్పుడు అంతే. అక్కడనుంచి టీఆర్ ఎస్ కి వచ్చినప్పుడు అంతే. అక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. కండువాలైతే మారాయి కానీ విమర్శ ఊపు మాత్రం అదే. కేసీఆర్ ను ఆయన పొగిడినంతగా ఎవరూ పొగడలేదు. ఆయన తిట్టినంతగా ఎవరూ తిట్టలేరు.




5) డీ ఎల్ రవీంద్రా రెడ్డి - బెస్ట్ జంపింగ్ జపాంగ్ మాత్రం డీ ఎల్ రవీంద్రా రెడ్డిదే. ఉన్న తాజ్ మహల్ ను లేనట్టు చేసే ఐంద్రజాలికుడు ఆయన. ఆయన పార్టీ మారకుండానే పార్టీ మారిన ఫీలింగ్ ఇవ్వగలరు. మొదట్లో టీడీపీలో చేరతానని లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే మాట వినిపిస్తున్నారు. వెళ్తారా, వెళ్లరా అన్నది మాత్రం తెలియదు మరి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top