ఆరో విడతలో భారీ పోలింగ్

ఆరో విడతలో భారీ పోలింగ్ - Sakshi


117 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి

మొత్తం 349 స్థానాలకు ఎన్నికలు పూర్తి.. మిగిలింది 194 స్థానాలే

ఇప్పటివరకూ అన్ని చోట్లా సగటున 10 శాతం పెరిగిన పోలింగ్

అస్సాం, జార్ఖండ్‌లలో హింస... తొమ్మిది మంది మృతి


 

 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరో విడతలో దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో గల 117 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ 2009 నాటి ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైంది. పలు చోట్ల చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ  ఎన్నికలు భారీ పోలింగ్‌తో ప్రశాంతంగా ముగిశాయి. అస్సాం, జార్ఖండ్‌లలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ముగ్గురు పోలీసులు సహా తొమ్మిది మంది ఎన్నికల సిబ్బంది మృతిచెందారు. మొత్తం తొమ్మిది విడతల్లో రెండో అతిపెద్ద విడత అయిన ఆరో విడతలో 2,100 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.



ఇక్కడ 18 కోట్ల మంది ఓటర్లున్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటివరకూ 349 స్థానాలకు.. అంటే మూడింట రెండు వంతుల స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 194 స్థానాలకు మరో మూడు విడతలుగా(ఏప్రిల్ 30న 89 సీట్లు, మే 7న 64 సీట్లు, 12న 41 సీట్లకు) పోలింగ్ జరగనుంది. అన్ని స్థానాలకూ ఓట్ల లెక్కింపు మే 16న జరుగుతుంది. పూర్తయిన 349 స్థానాలకు కలిపి సగటున 66 శాతం పోలింగ్ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్‌సిన్హా తెలిపారు. 2009లో ఈ స్థానాలన్నిటికీ కలిపి కేవలం 57.53 శాతం పోలింగ్ నమోదు కాగా.. అది ఇప్పుడు దాదాపు 10 శాతం పెరిగిందన్నారు.

 

ఆరో విడతలో..: జమ్మూకాశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానం, అస్సాంలో 6, పశ్చిమబెంగాల్‌లో 6, బీహార్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 7, జార్ఖండ్‌లో 4, ఉత్తరప్రదేశ్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 10, రాజస్థాన్‌లో 5, మహారాష్ట్రలో 19, తమిళనాడులో మొత్తం 39, పుదుచ్చేరిలో 1 స్థానానికి పోలింగ్ పూర్తయింది. ములాయంసింగ్ యాదవ్(సమాజ్‌వాదీ), సుష్మాస్వరాజ్. షానవాజ్‌హుస్సేన్ (బీజేపీ), దయానిధి మారన్, ఎ.రాజా(డీఎంకే), సల్మాన్‌ఖుర్షీద్, వి.నారాయణసామి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ(కాంగ్రెస్) తదితర ప్రముఖుల భవితవ్యం ఈ పోలింగ్‌లో తేలనుంది. తాజా ఎన్నికల్లో పుదుచ్చేరిలో అత్యధికంగా 83 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ స్థానంలో కేవలం 28 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. అనంతనాగ్‌లో గత ఎన్నికల్లో నమోదైన 26.9 శాతం కన్నా ఇప్పుడు పెరగటం విశేషం. పశ్చిమ బెంగాల్‌లో 82 శాతం, అస్సాంలో 77, తమిళనాడులో 73, ఉత్తరప్రదేశ్‌లో 60.2, బీహార్‌లో 60, రాజస్థాన్‌లో 59.2, మహారాష్ట్రలో 55.33, ఛత్తీస్‌గఢ్‌లో 62, జార్ఖండ్‌లో 63, మధ్యప్రదేశ్‌లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది.

 

ముంబైలో వ్యాపార, సినీ ప్రముఖుల ఓట్లు




 దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్ వంటి వ్యాపార దిగ్గజాలతో పాటు.. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రేఖ, విద్యాబాలన్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సచిన్ టెండూల్కర్ సతీమేతంగా వెళ్లి ఓటు వేశారు. చెన్నైలో సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్, ఉదయమే ఓటేశారు. పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగసామి మోటార్‌సైకిల్ మీద వెళ్లి ఓటు వేయటం విశేషం.

 

మోడల్ పోలింగ్ బూత్‌లపై ఓటర్ల హర్షం



 ఓటర్లకు రెడ్‌కార్పెట్ ఆహ్వానం పలుకుతూ ఆహ్లాదకరమైన సౌకర్యాలు కల్పిస్తూ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ బూత్‌లపై ఓటర్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశారు. బూత్‌లకు వచ్చే ఓటర్లకు పూలు, స్వీట్లు ఇచ్చి ఆహ్వానించటం.. వారు వేచి ఉండటానికి పందిళ్లు, వాటి కింద కుర్చీలు సిద్ధంగా ఉంచటం, ఏసీలు పెట్టటం, వృద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్లు, చల్లని పానీయా లు అందించటం తదితర సౌకర్యాలు కల్పించారు. కాగా, ఆరో విడత పోలింగ్ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం రూ.81 కోట్ల నగదును జప్తు చేసింది. ఆంధప్రదేశ్‌లో 43 చెల్లింపు వార్తల ఉదంతాలను గుర్తించి నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.     

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top