‘దక్షిణ ముంబై’ బరి మరాఠీ, తెలుగు ఓటర్లే కీలకం


 సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో వివిధ  రాష్ట్రాల ప్రజలు ఉంటున్నప్పటికీ మరాఠీ, తెలుగు ప్రజల ఓట్లే కీలకం. గతంలో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడ్డారు. మూడో విడత ఎన్నికలకు సమయం దగ్గర పడడం, ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.



 తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే వర్లీ, లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భవనాలు, చాల్స్ వద్ద పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. తాము గెలిస్తే చేపట్టే అభివృద్థి పనులపై తెలుగు ప్రజలతో సమావేశాలు, పలుకుబడిన వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు అనేక వస్త్రమిల్లులు ఉండేవి. ప్రస్తుతం అవి మూతపడడంతో అనేకమంది తెలుగు ప్రజలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలే నివసిస్తున్నాయి. మూతపడిన మిల్లు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని వివిధ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అనేక పోరాటాలు కూడా చేశాయి.



 అయితే అధికార డీఎఫ్ కూటమి ప్రభుత్వం అంగీకరించ లేదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోడ్డునపడ్డ మిల్లు కార్మికులకు ఉచితంగా ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ప్రధాన పార్టీలు హామీ ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని, పేదలకు రేషన్ షాపుల్లో అతి తక్కువ ధరకే సరుకుల పంపిణీ ఇలా రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. ఇలా ఇస్తున్న హామీలపై దక్షిణ ముంబై లోక్‌సభ నియోజక వర్గం తెలుగు ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top