‘కండువాలు’... కలవవట!


రాష్ట్రస్థాయిలో ఒక్కటై నడవాలని బాసలు చేసుకున్న తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు జిల్లా స్థాయిలో ‘పొత్తు’ కుదరడం లేదు. ఆశావహులు అలకపాన్పు దిగక పోవడంతో ప్రచార పర్వంలో ఇంకా ఇరుపక్షాలు కలిసి పనిచేయడం లేదు. నేతల స్థాయిలో అంటీముట్టనట్టుగా ఉన్నా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు మూతిబిగింపు సడలించడం లేదు. వీరిని సమన్వయ పరిచే ‘పెద్ద’ దిక్కూ లేకపోవడమూ ఓ ఇరకాటంగా మారింది.దీనితో అభ్యర్థులది ఒంటరి ప్రయాణమే అవుతోంది.

 

 సాక్షి, మహబూబ్‌నగర్: బలవంతపు బం ధంతో ఒక్కటైన తెలుగుదేశం, బీజేపీ పొ త్తుల పీటముడిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.  సీట్ల పంపకాలు, టికెట్ల పంపిణీలో తేడాలు రావడంతో రెండు పార్టీల నేతలు అసమ్మతి కుంపటిని మరింత రాజేస్తున్నారు. దీంతో ప్రచార పర్వం మొదలై రోజులు గడుస్తున్నా ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిత్రపక్షాలను రెంటినీ సమన్వయం చేసే నాథుడు లేకపోవడంతో బీజేపీ, టీడీ పీ ఎవరికి వారే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో టికెట్ దక్కిన చోట అధికారిక అభ్యర్థులు మిత్ర పక్షాన్ని బుజ్జగించే పనికి స్వస్తి చెప్పి సొంత ప్రచార ఏర్పాట్లపై దృష్టి సారించారు. జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు గాను మహబూబ్‌నగర్‌ను బీజేపీకి, నాగర్‌కర్నూలును టీడీపీకి కేటాయించారు. 14 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ, బీజేపీ ఆరు చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే సొంత పార్టీ అభ్యర్థులకు టికెట్ దక్కని చోట నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల ముఖ్య నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పొత్తుల కోసం ఒత్తిళ్లు చేసిన నేతలు ప్రస్తుతం పరిస్థితిని చక్క దిద్దే అంశంపై దృష్టి సారించడం లేదు.

 

 మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం వైఖరిని నిరసిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరుకున్నారు. పొత్తుల మూలంగా తిరిగి టీడీపీ కండువాను మెడలో వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 

  కొడంగల్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో వున్నా బీజేపీ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. నారాయణపేటలో టికెట్ దక్కక పోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో వున్నారు. బీజేపీ ముఖ్య నేతలు నాగూరావు నామాజి, కొండయ్య తదితరులను బుజ్జగించినా టీడీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో కనిపించడం లేదు.

 

 మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడటంతో టీడీపీ బలం నామమాత్రంగా వుంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి సయోధ్య కోసం ప్రయత్నించినా టీడీపీ కేడర్ కలిసి రావడం లేదు.

 

  నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిం హులు అభ్యర్థిగా  పోటీ చేస్తున్నా ప్రచా రం ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, కొల్లాపూర్ అసెం బ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. కొల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పగిడాల శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు.

 

 వనపర్తి, ఆలంపూర్, గద్వాల, అచ్చం పేటలో బీజేపీ బలం నామమాత్రంగా కనిపిస్తోంది.

 ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ, బీజేపీ స్థానికంగా అవగాహనకు వచ్చి పోటీ చేశాయి. కొన్ని చోట్ల రెండు పార్టీల అభ్యర్థులు ముఖాముఖి తలపడ్డారు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు పార్టీల్లో వుంటూ ఎన్నికల బరిలో నిలిచిన కేడర్ ఇప్పుడు పొత్తుల పేరిట కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

 

   ఈ నెల 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జిల్లా పర్యటనకు వస్తుండటంతో ఏవైనా అద్భుతాలు జరుగుతాయని రెండు పార్టీల అభ్యర్థులు ఆశిస్తున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top