‘తూర్పు’న తారల తళుకులు

‘తూర్పు’న తారల తళుకులు - Sakshi


ఎన్నికల రణరంగంలో సినీ తారల తళుకులు తూర్పు గోదావరి జిల్లా రాజకీయ చరి త్రకు ఓ ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి, విజయాన్ని సొంతం చేసుకున్న తారలు ఉన్నారు. గోదావరి వాసులు కళాకారులను ఆదరిస్తారనడానికి ఆ విజయాలే తార్కాణం. కాగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి అదష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశ పడ్డ వారిలో నిరాశే మిగిలిన వారూ ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజక వర్గాల నుంచి బరిలో ఉండి గెలిచిన వారు, ఓడిన వారు, అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వారి వివరాలు

 

 జమున

 సినీ తారల తళుకు బెళుకులతో సీట్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ప్రముఖ నటి జూలూరి జమునను బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జమున 1989 నుంచి 1991 వరకూ ఎంపీగా కొనసాగారు. 1991లో పోటీచేసి ఓడిపోయారు.

 

 కృష్ణంరాజు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణంరాజు బీజేపీ నుంచి 1998లో కాకినాడ ఎంపీగా గెలిచి, విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా కొనసాగారు. 1999లో ఓడిపోయారు. 2004లో నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గారు. 2009లో పీఆర్‌పీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ పడి ఓడిపోయారు.

 

 మురళీమోహన్

 రాజమండ్రి లోక్‌సభ స్థానానికి మురళీమోహన్ స్థానికుడు కాకపోయినా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను అభ్యర్థిగా నిలుపగా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.

 

 జయప్రద

 పై నటులందరూ స్థానికేతరులుగా ఉండి ఈ ప్రాంతంలో బరిలో నిలిచారు. కానీ రాజమండ్రి ఆడపడుచు జయప్రద మరో రాష్ట్రంలో ఎన్నికల గోదాలో దిగి విజయాలు సాధించారు. 1962లో రాజమండ్రిలో పుట్టిన జయప్రద చిన్ననాడే నగరం వదిలి వెళ్లి పోయారు. 1994లో టీడీపీలో చేరిన జయప్రద ఎన్టీఆర్ మరణానంతరం పార్టీని వీడారు. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడ వ్యక్తిగత, రాజకీయపరమైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పలు విమర్శలు ముప్పిరిగొన్నా తట్టుకుని నిలబడ్డారు.

 

 బాబూమోహన్

ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆంధోల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీ పార్వతి నాయకత్వంలోని ఎన్టీఆర్ టీడీపీలో చేరారు. 1996 ఎన్నికల్లో అమలాపురం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.


ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీల్చి, ఆ పార్టీ అభ్యర్థి బాలయోగి పరాజయానికి కారకులయ్యారని ప్రచారం సాగింది. బాబూమోహన్ 1.43 లక్షల ఓట్లు పొంది మూడోస్థానంలో నిలిచారు. 1998లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ పోటీ చేసిన బాబూ మోహన్ అప్పుడూ ఓటమినే చవి చూశారు.



హేమ

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హేమ పోటీ చేస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top