కాంగ్రెస్‌ను వీడినా బహిష్కరణ వేటు!


 వనమా, దొంతి, మరో 10 మందిపై ఆరేళ్ల వేటు



సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినా కూడా.. వారిని బహిష్కరిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చిత్రమైన నిర్ణయం తీసుకుంది. పార్టీకి రాజీనామా చేసిన  ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డిలను ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.



వీరితో పాటు మరో 10 మందిపైనా బహిష్కరణ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. వాస్తవానికి వనమా, మాధవరెడ్డి 10 రోజుల కిందే కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు.ప్రస్తుతం వనమా వైఎస్సార్‌సీపీ కొత్తగూడెం అభ్యర్థిగా, మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయినప్పటికీ ఇరువురు నేతలను బహిష్కరించడం పట్ల టీ పీసీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వద్ద శనివారం విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా... ‘‘వాళ్లు పార్టీకి రాజీనామా చేసినట్లు మాకు తెలియదు. పత్రికల్లో మాత్రమే చూశాను. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై చర్యలు తీసుకున్నాం’’అని చెప్పడం గమనార్హం.

 

వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా.. ఇంకా బహిష్కరించడం దేనికని ప్రశ్నించగా... ‘అదంతా మాకు తెలియదు’అని పొన్నాల పేర్కొన్నారు. కాగా, బహిష్కరణకు గురైన మిగతా నేతలు.. వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ (ఖమ్మం), రామ సహాయం నరేష్‌రెడ్డి, భూక్యా ప్రసాద్ (వరంగల్), వై.బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఎం.కృష్ణ, ఎం.వెంకటరెడ్డి, కె.గురునాథ్‌రెడ్డి (రంగారెడ్డి), ఎం.సోమేశ్వరరెడ్డి, ఎం.గాలిరెడ్డి(మెదక్) ఈ జాబితాలో ఉన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top