సీమాంధ్ర ప్రజలతో కొట్లాటలు వద్దు: సోనియా

సీమాంధ్ర ప్రజలతో కొట్లాటలు వద్దు: సోనియా - Sakshi


కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో సోనియా ప్రసంగించారు. సోనియా ప్రసంగం ఆమె మాటల్లోనే... 'పోరాటం అయిపోయింది. ఇక పాలన చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పని కేవలం కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. టీఆర్ఎస్ కేవలం అవతలివాళ్లను దూషించడానికే పరిమితం అయిపోతోంది తప్ప వాళ్లకు పాలనానుభవం లేదు. అందువల్ల మీ అందరికీ నేను చేసేది ఒకటే విజ్ఞప్తి. మీరు సీమాంధ్ర ప్రజలందరితో సోదర భావంతో ఉండాలి తప్ప.. కొట్లాటలు కూడదు. మీ అందరూ ఒక్కొక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే వేయండి. ఆ ఓట్లే తెలంగాణ బంగారు భవిష్యత్తును నిర్దేశిస్తాయి.



తెలంగాణ.. మీరు మీ స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి సుదీర్ఘ పోరాటం చేశారు. కొన్నేళ్లుగా మీరు చేసిన పోరాటం ఇప్పుడు నిజమై సాక్షాత్కరించింది. కాంగ్రెస్ పార్టీ మీ స్వప్నాన్ని సాకారం చేసింది. జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ 29వ రాష్ట్రం కానుంది. అమరవీరులందరికీ సలాం చేస్తున్నాను. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నవారు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, పాత్రికేయులు.. ఇలా 60 ఏళ్లుగా ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆవేదన విన్నది. అందుకే రాష్ట్రం ఇచ్చాం. రెండోవైపు ఉన్నవాళ్లను ఒప్పించడానికిసమయం పట్టింది. అందుకే ఆలస్యమైంది. మీ అధికారం, మీ న్యాయమైన వాటా దక్కాలనే మేం భావించాం. రెండు రాష్ట్రాల ప్రజలు నా హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్లే. సీమాంధ్ర ప్రజలకు మేం చేసిన వాగ్గానాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చుకుంటాం.



తెలంగాణ ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ప్రతిజ్ఞ. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ రాదన్న విషయంలో అనుమానం ఏమాత్రం లేదు. కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనుకుంది. ఈ బిల్లు చేసింది మేమే, ఉభయ సభల్లో దాన్ని ఆమోదింపజేసింది మేమే. ఈ బిల్లు తయారీలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదు. ఎప్పుడో 2000 సంవత్సరంలోనే మేం తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ లోని 4 కోట్ల మంది ప్రజల భావనలను గౌరవించాలని ఇచ్చాం. సామాజిక న్యాయం చేయాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకునే ఇచ్చాం. సమాజంలో బలహీనవర్గాల చేతుల్లోనే దళితులు,ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, యువకులు.. ఇలా అందరి చేతుల్లో అధికారం పెట్టాలనే తెలంగాణ ఇచ్చాం.



తెలంగాణలో ఎప్పుడూ లౌకిక భావనలను గౌరవిస్తూనే వచ్చారు. వీటికోసమే ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల వల్ల ఈ లౌకిక భావన ప్రమాదంలో పడింది. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ కులమతాల ఆధారంగా, భాష పేరుతో భేదభావాలు చూపించలేదు. ఇతర పార్టీలు కులమతాల పేరుతో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు అవే పార్టీలు అధికారంలోకి రావాలని కలలు కంటున్నాయి. భవిష్యత్తులో కూడా అలా చేసే ప్రమాదముంది కాబట్టి మీరంతా జాగ్రత్తగా వ్యవహరించాలి. యూపీఏ ప్రభుత్వం తమ పదేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాల మేలు కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది' అని సోనియా అన్నారు.



యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్లలో ఒకటిగా 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుచేస్తున్నాం. మా తెలంగాణ మేనిఫెస్టోలో కూడా రైతుల రుణబాధలను తగ్గించడం, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి లాంటి అనేక కార్యక్రమాలున్నాయి. హైదరాబాద్ ప్రాధాన్యాన్ని అలాగే నిలబెట్టడంతో పాటు తెలంగాణలోని ఇతర నగరాలను కూడా అభివృద్ధి చేస్తాం. మేం చేసిన వాగ్దానాలు కచ్చితంగా నిలబెట్టుకుంటాం.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top