'తిరుగుబాటు' దేశం పార్టీ

'తిరుగుబాటు' దేశం పార్టీ - Sakshi


టీడీపీ అంటే.. తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి తిరుగుబాటు దేశం పార్టీగా మారిపోయింది.  కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజకీయ ఉద్ధండులకు పెద్ద పీఠ వేసిన నారా వారి పార్టీ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా తయారైంది. వలసల పక్షలకు పార్టీలోకి తీసుకుని వారికే టికెట్లు కేటాయించడంపై టీడీపీలో అసంతృప్తి సెగలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి. వేరే పార్టీల నుంచి మాజీలకు సముచిత స్థానం కల్పించి.. ఎప్పట్నుంచో పార్టీని వెన్నంటి ఉండి అభివృద్ధికి కృషి చేసిన వారికి మొండిచేయి చూపించడంతో బాబు గారి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. కొండనాలుకకు వలవస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా తయారైంది బాబు గారి పరిస్థితి.





అధ్యక్షుని తీరుతో ఇప్పటికే విసుగుపోయిన తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపేందుకు సిద్ధమైయ్యారు. ఇది ఏదో ఒక్క జిల్లాకు పరిమితమైనకుంటే పొరపాటే. దాదాపు అన్ని జిల్లాలోనూ టీడీపీకి రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. గతంలో పీఆర్పీకి ఎదురైన చేదు అనుభవాలే ఇప్పుడు టీడీపీలో కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కార్పోరేట్ లాబీయింగే టీడీపీలో ప్రధానంగా కనిపించడంతో తెలుగు తమ్ముళ్లకు పాలుపోని పరిస్థితి.



పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజక వర్గంలో కూడా నిరసన జ్వాలలు మిన్నంటాయి. మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి(బాబ్జి) కి టికెట్ పై భరోసా ఇచ్చి అనంతరం నిమ్మల రామానాయుడుకి కేటాయించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న బాబ్జి ఒకనొక దశలో స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైయ్యారంటేనే స్థానికంగా టీడీపీ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.





రాత్రి పార్టీలో చేరినవారికి ఉదయాన్నే బీ ఫారం ఇచ్చేస్తున్నారు చంద్రబాబు. గురువారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా గిద్దలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నె రాంబాబు టీడీపీలో చేరారు. ఆ వెంటనే ఆయనకు టికెట్ ఖాయం చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఇలా టీడీపీలో చేరి, అలా సీటు దక్కించుకున్నారు. టీడీపీ ఇప్పటి వరకూ 155 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా, వీరిలో 29 మంది కాంగ్రెస్ నుంచి చేరినవారే ఉన్నారు. కాగా, పదిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఈసారి అవకాశం ఇవ్వలేదు. ఇలా అవకాశం రానివారిలో సివిరి సోమ, టీవీ రామారావు ,  జయమంగళ వెంకట రమణ, అంబటి హరిప్రసాద్ , దాసరి బాలవర్ధనరావు, బల్లి దుర్గాప్రసాదరావు హేమలత ,మల్లేల లింగారెడ్డి , కేఈ ప్రభాకర్, అబ్దుల్ ఘనీ ఉన్నారు.  కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల బరి నుంచి చంద్రబాబు తప్పించారు. అవనిగడ్డను కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌కు ఇవ్వగా, గన్నవరం నియోజకవర్గాన్ని నందమూరి హరికృష్ణకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు వల్లభనేని వంశీమోహన్‌కు కేటాయించారు. కైకలూరును పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు.



వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌ను  కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి  కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం పార్టీ ప్రచార సామగ్రిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.  గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ తమ్ముళ్ళ ఆగ్రహం పతాకస్థాయికి చేరింది. స్థానికేతరుడైన తులసీరాంప్రభుకు టికెట్‌ కేటాయించి ఆ తరువాత స్థానిక నేత గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. ఇదీ నచ్చని పార్టీ కార్యకర్తలు ఆయన్ను రూములో బంధించి, నామినేషన్ వేయనీయకుండా చేసేందుకు ప్రయత్నించారు.



టికెట్లు కేటాయింపుల విషయంలో కృష్ణా జిల్లా కైకలూరులో ఓ మహిళ స్వయంగా చంద్రబాబునే నిలదీశారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ శాపనార్థాలు పెట్టారు.  నూజివీడులో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఆ పార్టీ జిల్లా, స్థానిక నాయకత్వాలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వొద్దని కోరినా అధినేత ఆయనకే కట్టబెట్టడంపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమంటున్నాయి.


 


ఇలా పొత్తు..వలసలతో నిండిపోయిన టీడీపీలో అసలు తెలుగు తమ్ముళ్లకు చోటే లేకుండా పోతుంది. దీంతో టీడీపీ(తిరుగుబాటు దేశం పార్టీ)గా మారిపోయిందని  పలువురు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా బలమున్న నాయకుల్ని వదిలేసి అసలు ఏప్రభావము చూపని వారికి టికెట్లు కేటాయించడంతోనే టీడీపీకి ఓటమి ముందే ఖాయమైందనేది విశ్లేషకులు అభిప్రాయం.


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top