హితులా.. కత్తులా ?

హితులా.. కత్తులా ? - Sakshi

  • నిన్నటి ప్రత్యర్థులు నేడు మిత్రులు

  • బాబు వ్యూహం వికటిస్తుందేమో

  • టీడీపీ శ్రేణుల్లో భయూందోళన

  • 4 నియోజకవర్గాల్లో వింత పరిస్థితి

  •  సాక్షి, తిరుపతి: కిందటి ఎన్నికల్లో ప్రత్యర్థులు..ఈ ఎన్నికలకు మిత్రులయ్యారు. వీళ్లంతా నిజమైన మిత్రులేనా అనే అనుమానాలు టీడీపీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో టీడీపీని నింపేసుకున్న చంద్రబాబు వారిలో కొందరికి టికెట్లు కూడా ఇచ్చారు. టికెట్లు ఇవ్వలేని వారిని నామినేషన్ల తరువాత పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు వారంతా పోటీలో ఉన్న అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంది. ఇక్కడే టీడీపీ శ్రేణుల్లో అనుమానాలకు తావిస్తోంది.

     

     అధినేత చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టిందంటే కొత్తగా చేరిన హితులంతా కడుపులో కత్తులయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం వచ్చిన వారిని ఎంత తక్కువగా నమ్మితే అంత మంచిదనే అభిప్రాయం వారిది. పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నట్టు టీడీపీ అభ్యర్థులకు వారంతా కడుపులో కత్తులే అనుకోవాల్సి వస్తోంది.

     

     శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్సీవీ

     శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీచేస్తున్నారు. ఈయనకు 2004, 09 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి ఎస్సీవీ నాయుడు. 2004 వరకు బొజ్జలకు ముఖ్య అనుచరుడుగా ఉంటూ వచ్చిన ఎస్సీవీ నాయుడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు తెచ్చుకున్నారు. అప్పటివరకు ఓటమి అంటే ఎరుగని బొజ్జలను ఇంటికి పంపారు.

     

     అప్పటికే గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్సీవీ నాయుడుపై బొజ్జల విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇద్దరూ దుమ్మెత్తిపోసుకున్నారు. గోపాలకృష్ణారెడ్డిని గెలిపిస్తే హైదరాబాద్ వెళ్లాలని ఎస్సీవీ ఆరోపిస్తే, ఎస్సీవీని గెలిపిస్తే నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతుందని బొజ్జల ప్రత్యారోపణ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్టు కోసం ప్రయత్నించిన ఎస్సీవీకి చుక్కెదురైంది. టికెట్టు ఇవ్వకపోయినా చంద్రబాబు పంచన చేరిపోయారు.

     

     తిరుపతిలో వెంకటరమణ, చదలవాడ

     మాజీ ఎమ్మెల్యే ఎం వెంకటరమణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నామినేషన్ల గడువు చివరి రోజున వెంకటరమణకు టికెట్టు ఖరారు చేశారు. అప్పటివరకు తనకే టకెట్టు అనే విశ్వా సంతో ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి ఈ రకంగా వెంకటరమణ షాకిచ్చారు. వీరిద్దరూ 2012లో తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులు. వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ తరఫున, చదలవాడ టీడీపీ టికెట్టుతో పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ అభ్యర్థి గెలుపొందారు.

     

    2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి అప్పటికప్పుడు వచ్చిన వెంకటరమణను అక్కున చేర్చుకుని చంద్రబాబు టికెట్టు ఇచ్చారు. సోమ వారం తిరుపతిలో చంద్రబాబు రోడ్‌షోలో ఆ యన పక్కన చదలవాడ, వెంకటరమణ ఉన్నా రు. మరుసటి రోజు ఎవరిదారివారిదే అయింది. గతంలో కూడా వీరు భూకబ్జాలకు సంబంధించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

     

     పూతలపట్టులో లలితాథామస్, రవి

     పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో లలితా థామస్, డాక్టర్ రవి ప్రధాన ప్రత్యర్థులు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లలితాథామస్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రవి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని రవి నిన్నటి వరకు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారు. తొలుత రెండు మూడుసార్లు టీడీపీలో చేరడానికి ప్రయత్నించినా చంద్రబాబు ఆయన ను చేర్చుకోలేదు. నామినేషన్లు పూర్తయి న తరువాత డిమాండ్లేమీ ఉండవనే సందర్భం లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చంద్రగిరిలో టీడీపీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన లలితాథామస్ విజయం కోసం ఎంతమేరకు పనిచేస్తారో చూడాల్సి ఉంది.

     

     చంద్రగిరిలో అరుణమ్మ, సైకం


     చంద్రగిరి నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో  గల్లా అరుణకుమారి కాంగ్రెస్ అభ్యర్థిగాను, సైకం జయచంద్రారెడ్డి పీఆర్పీ అభ్యర్థిగాను పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరూ టీడీపీ గూటికి వెళ్లారు. చంద్రగిరి టికెట్టుకు తాను రేసులో ఉన్నానని పార్టీలో చేరిన మరుసటి రోజునే సైకం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే టికెట్టు అరుణమ్మకే ఇచ్చారు.

     

     సిట్టింగ్ ఎమ్మెల్యే హేమలత అసంతృప్తి

     సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీ హేమలతకు టికెట్టు నిరాకరించడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మంగళవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లిన సమయంలో ఆమె ప్రచారరథంపై కనిపించలేదు. అంతకుమందు హెలిపాడ్ వద్ద చంద్రబాబుకు నమస్కరించుకుని కాన్వాయ్‌లోని తన కారులో ఉండిపోయారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని భావించి, హేమలత కాన్వాయిలోనే ఉన్నారని ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆదిత్య విజయానికి కృషి చేస్తుందని చంద్రబాబు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top