బాబ్బాబు.. విరమించండి

బాబ్బాబు.. విరమించండి - Sakshi


 కంటిలోన నలుసు.. పంటికింద రాయి.. చెప్పులోన ముల్లు.. చెవిలోన జోరీగ.. ఈ మాటలు టీడీపీ రెబెల్స్‌కు అచ్చంగా అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షానికి సీట్ల కేటాయింపు వంటి విషయాల్లో తప్పటడులు వేసిన చంద్రబాబు తీరుతో మొదలైన ధిక్కార స్వరం మరింత పెరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో మింగుడుపడని రెబెల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ దూతలు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించటం లేదు.

 

 సాక్షి, మచిలీపట్నం :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ల గడువు బుధవారంతో ముగియనుండటంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం చక్కర్లు కొట్టి మంత్రాంగం నెరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మరోమారు చర్చించి ఏదోరకంగా దారికి తెచ్చుకుంటామని చెబుతున్నారు. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు 39 మంది, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 305 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

 

మంగళవారం నామినేషన్‌ల ఉపసంహరణ తొలిరోజు కావడంతో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 మంది తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. బుధవారం నామినేషన్‌ల ఉపసంహరణకు తుదిరోజు కావడంతో పోటీని తగ్గించేందుకు బుజ్జగింపులు ఊపందుకున్నాయి. ప్రధాన అభ్యర్థులను వణికిస్తున్న తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో టీడీపీ నేతలకు కంటి మీద కునుకులేదు.

 

 ‘కంఠంనేని’ ససేమిరా..

 అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ వద్దకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మంత్రాంగం నడిపారు. దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. మీరు పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కు నష్టం, నామినేషన్ ఉపసంహరించుకుని ఆయన గెలుపుకోసం కృషి చేయాలని సుజనా చౌదరి బతిమాలినట్టు సమాచారం.



అయితే వాడుకుని వదిలేయడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని, 2009 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారని ఎదురుచూస్తే తనకు ఆశచూపి అంబటి బ్రాహ్మణయ్యకు ఇచ్చారని, ఇప్పుడు కనీసం తన పేరు కూడా పరిశీలించలేదని రవిశంకర్ ఘాటుగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో తాను పోటీ నుంచి తప్పుకొనేది లేదని, పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించకుంటే ఆ కడుపుమంట ఎలా ఉంటుందో చూపించాలనే పోటీకి దిగానని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది.

 

 మెత్తబడ్డ జయమంగళ..

తొలినుంచి టిక్కెట్ ఇస్తానని చెప్పి చివరకు కైకలూరు టిక్కెట్‌ను బీజేపీకి కేటాయించడంతో మండిపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నామినేషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోటీనుంచి తప్పించేందుకు టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి బాబు, బీజేపీ నేతలు సోమ, మంగళవారాల్లో ఆయనతో చర్చలు జరిపారు. ‘ఏం ఆశ పెట్టారో ఏమో’ జయమంగళ తన నామినేషన్ ఉపసంహరించుకునేలా మెత్తబడినట్టు తెలిసింది.

 

కైకలూరు నియోజవర్గంలోని మరో రెబల్ అభ్యర్థి చలమలశెట్టి రామానుజయను కూడా బుజ్జగించినట్టు సమాచారం. చంద్రబాబు జిల్లాకు వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్న చలమలశెట్టి రామానుజయ సతీమణి కోట్ల రూపాయలకు టిక్కెట్‌లు అమ్ముకున్నారంటూ టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంపై మండిపడిన చలమలశెట్టి ఇప్పుడు మెత్తబడి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

నూజివీడు టీడీపీలో తిరుగుబాటు..


పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా స్థానికేతరుడికి టిక్కెట్ ఇవ్వడంపై నూజివీడు తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగిరింది. కాంగ్రెస్‌కు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడం తెలిసిందే. దీంతో టీడీపీలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. తనకు కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంతో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నెల 18న జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ నెల 19న బచ్చుల అర్జునుడిని విజయవాడ పిలిపించుకుని బుజ్జగించారు.

 

అవనిగడ్డలో టిక్కెట్ ఇస్తానని వాడుకుని వదిలేయడంతో ఆగ్రహంతో రగిలిపోతున్న నోవా విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు వల్ల నూజివీడులో టీడీపీ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఆయనను కూడా బుజ్జగిస్తున్నారు. చంద్రబాబు సమక్షంలోనే తన నిరసన తెలిపిన ముత్తంశెట్టి మెత్తబడే అవకాశంలేదని చెబుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో మొదలైన తిరుగుబాటు పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల పుట్టిముంచుతుందని భయపడుతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top