దగాపై భగభగ

దగాపై భగభగ - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ :పార్టీ కోసం పని చేసిన స్థానిక నేతలకు కాక..ఇంకెవరికో టిక్కెట్లు కట్టబెట్టిన అధినేత చంద్రబాబు నాయుడి దుర్నీతిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహోదగ్రమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి చివరిరోజైన శనివారం జిల్లాలో జరిగిన పరిణామాలు ఆ పార్టీ అభిమానులను కలవరపరుస్తున్నాయి. అత్యంత కీలకమైన ఎన్నికల్లో అధినేత అనుసరిస్తున్న పోకడ ‘వినాశకాలే.. విపరీత బుద్ధిః’ అన్నట్టుందని వారు వాపోతున్నారు. చివరి నిమిషంలో ఊహించని రీతిలో పెద్దాపురం అసెంబ్లీ సీటు కోనసీమకు చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు కట్టబెట్టడం.. అక్కడ టిక్కెట్టు కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు ఆశావహులను హతాశులను చేసింది. వారి అనుచరులు పార్టీ జిల్లా అధ్యక్షుడని కూడా చూడకుండా రాజప్ప కారును ధ్వంసం చేశారు. దాదాపు అదే పరిస్థితి పిఠాపురంలో కూడా చోటుచేసుకుంది. పార్టీ శ్రేణుల  అసంతృప్తి ఈ రెండు నియోజకవర్గాల్లో బయటపడగా, మిగిలిన  చోట్ల చాప కింద నీరులా వ్యాపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ రెండు   స్థానాలపై ఆశలు పెంచుకున్న వారి ఆగ్రహాన్ని పార్టీ నుంచి ‘బి’ ఫారంలు పొందిన వారు చవి చూడాల్సి వచ్చింది. 

 

విశ్వసనీయత లేని అధినేత..

అసలు నియోజకవర్గంతో సంబంధం లేని వారిని తీసుకువచ్చి ఐదారేళ్లుగా పార్టీని మోస్తున్న తమపై         ఎక్కిస్తారా అంటూ ఆ రెండు నియోజకవర్గాల నేతలు ఆగ్రహోదగ్రులై పార్టీ జెండాలను తగలబెట్టి, కార్యాలయాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ అభ్యర్థుల కార్లపై దాడి చేసి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అభ్యర్థులనిర్ధారణకు ప్రజాభిప్రాయం, సర్వేలే కొలమానమన్న చంద్రబాబు అందుకు భిన్నంగా పెద్దాపురం, పిఠాపురం అభ్యర్థులుగా చినరాజప్ప, కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వంలను ప్రకటించి, జనం అనుకుంటున్నట్టే  విశ్వసనీయత లేని నేతగా మిగిలారని పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కట్టలు తెంచుకున్న తెలుగుతమ్ముళ్ల ఆగ్రహంతో టీడీపీ ఆ రెండు నియోజకవర్గాల్లో నిట్టనిలువునా చీలిపోయింది. పెద్దాపురం సీటు కోసం ముత్యాల రాజబ్బాయి, దౌలూరి దొరబాబు, గోలి రామారావు, పరుచూరి కృష్ణారావు, గోరకపూడి చిన్నయ్యదొర ఆది నుంచీ ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్టు ఆశ చూపి, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో లక్షలు ఖర్చుపెట్టించిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా చినరాజప్పను తీసుకు రావడం వారికి జీర్ణం కావడం లేదు. అయితే ఈ పరిణామాన్ని ముందూ ఊహించిన ఆరుగురు ఆశావహులు శనివారం రెబల్స్‌గా నామినేషన్లు వేసి, బాబుకు తమ తడాఖా చూపేందుకు సిద్ధమయ్యారు. తమలో ఒకరే బరిలో ఉండేలా ఒప్పందానికి వచ్చి, రాజప్పను రిక్తహస్తాలతో పంపాలని నిర్ణయించారు.

గత ఎన్నికల కన్నా దిగజారుడు అనివార్యం..

 

ఇక పిఠాపురంలో ఆరేడేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వర్మకు టిక్కెట్టు ఇస్తానన్న బాబు.. చివరి నిమిషంలో దగా చేసినందుకు అక్కడ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకోనుంది. చంద్రబాబు ఎంపిక చేసిన విశ్వం నామినేషన్ వేసే సందర్భంలో స్థానిక తెలుగుతమ్ముళ్ల నుంచి ఎదురైన ప్రతిఘటనే ఇందుకు నాంది అంటున్నారు.   వర్మ స్వతంత్రంగా నామినేషన్ వేయడం పార్టీ అభ్యర్థి విశ్వంకు పెద్ద దెబ్బేనని నేతలు విశ్లేషిస్తున్నారు. కాగా కాకినాడ సిటీలో కూడా టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబుకు అసమ్మతి సెగ తగిలింది. టిక్కెట్టుపై ఊరించి ఊరించి చివరకు మొండిచేయి చూపడంతో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తన తనయుడు శశిధర్‌తో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి నామినేషన్ వేయించారు. మత్స్యకారుల్లో ఒకప్పుడు మంచి పట్టున్న ముత్తా తన కుమారుడిని బరిలోకి దింపడంతో కొండబాబు ఓటు బ్యాంక్‌కు గండికొట్టడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ సిటీలతో పాటు పార్టీ ఇన్‌చార్జి బత్తుల రామును పక్కన పెట్టి గొల్లపల్లికి కట్టబెట్టిన రాజోలు, సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు మొండిచేయి చూపిన రాజమండ్రి రూరల్, పార్టీని నమ్ముకున్న వారిని కాదని వలస నేతలకు అవకాశం కట్టబెట్టిన కొత్తపేట, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అమలాపురం, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న పార్టీ గత ఎన్నికల్లో నాలుగు సీట్లకే పరిమితమవగా, తాజా పరిణామాలతో ఈ సంఖ్య మరింత తగ్గిపోతుందని పార్టీ అభిమానులు కలవరపడుతున్నారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top