అబ్బో.. ఏం కిక్కు!


శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల క్యాంపస్, పాలకొండ, టెక్కలి, న్యూస్‌లైన్: చిందెయ్యడానికి మందు.. చక్కర్లు కొట్టడానికి బైకులకు ఇంధనం.. చిల్లర ఖర్చులకు పచ్చనోట్లు.. చివర్లో జిహ్వాచాపల్యాన్ని సంతృప్తిపరచడానికి కమ్మని మాంసాహార భోజనం.. అభ్యర్థుల వెంటవాహనాల బారులు.. ఇవీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో కనిపించిన దృశ్యాలు. ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామని బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు.. ఇలా అరువు జనాలతో.. ప్రలోభాల ఎరలు వేసి తమ వెంట జనాలు ఉన్నారని చెప్పుకోవడానికి నానాపాట్లు పడ్డారు. అందుకోసం ఎన్నికల నిబంధనావళికి తూట్లు పొడిచారు. బుధవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, టెక్కలి, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ తదితర నియోజకవర్గాల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.



  శ్రీకాకుళం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారికి రూ.200 నగదు, క్వార్టర్ మద్యం బాటిల్ సరఫరా చేశారు. గ్రామాల నుంచి తరలించిన వారికి చీటీలు ఇచ్చారు. ర్యాలీ సాగిన దారి పొడవునా ఉన్న పలు మద్యం దుకాణాల్లో చీటీలు చూపించిన వారికి మద్యం ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇక నామినేషన్ల దాఖలు పూర్తి అయిన తర్వాత అరసవల్లిలోని ఓ తోటలో పెళ్లి విందు పేరుతో జనాలందరికీ మాంసాహార భోజనం పెట్టించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సౌరబ్‌గౌర్ ఎన్నికల పరిశీలకుడు చంద్రశేఖర్‌ను అక్కడకు పంపించారు. ఆయన వెళ్లేసరికి భోజనాలు పూర్తయ్యాయి.



అయితే అక్కడ టీడీపీ జెండాలతో ఉన్న పలు వాహనాలను ఆయన గమనించారు. అక్కడున్న వారిని ప్రశ్నించగా ఇటీవల జరిగిన పెళ్లికి సంబంధించి రిసెప్షన్ జరుగుతోందని చెప్పారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేయగా 2,500 మందికి భోజనాలు పెట్టించినట్లు, ఒక్కొక్కరికి రూ. 80 వంతున లెక్కకట్టి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాలని సూచించారు. కాగా ఈ ఇద్దరు అభ్యర్థులు జరిపిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వాహనాలు పాల్గొన్నాయి. 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఉండగా మిగిలిన అన్నింటినీ అనధికారికంగా తిప్పారు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల పరిశీలకుడు, రిటర్నింగ్ అధికారులు వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా పరిశీలిస్తున్నారు.   నరసన్నపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి నామినేషన్ కార్యక్రమంలోనూ మద్యం విరివిగా ప్రవహించింది. పచ్చ కార్యకర్తలతో పట్టణంలోని మద్యం షాపులు కిటకిటలాడాయి. ఒకవైపు ర్యాలీ జరుగుతుంటే.. మరోవైపు  కార్యకర్తలు మద్యం షాపుల వద్ద క్యూ కట్టారు. కొన్నిచోట్ల రోడ్డుపైకే మద్యం కేసులు తీసుకొచ్చి పంపిణీ చేశారు. పట్టణంలో ఇష్టానుసారంగా.. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు.



  ఎచ్చెర్ల టీడీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనాలను అన్ని రకాలుగా సంతృప్తి పరిచారు. మద్యం ఏరులై పారించారు. మాంసాహార బోజనాలు పెట్టారు. నియోజకవర్గంలోని ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లోని  115 పంచాయతీలకు స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.20 వేల వరకు అందజేసినట్లు సమాచారం. గ్రామాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు.  అలాగే ర్యాలీలో పాల్గొనే ద్విచక్ర వాహనాలకు లీటర్ చొప్పున పెట్రోల్ పోయించారు. ఇక నామినేషన్ కార్యక్రమం ముగిసిన వెంటనే చిలకపాలెం, ఎచ్చెర్ల, కింతలి మిల్లు ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు కిక్కిరిసి పోయాయి. పచ్చ కార్యకర్తలకు పబ్లిక్‌గా మద్యం పంపిణీ చేశారు. అనంతరం స్థానిక హోటళ్లలో మాంసాహార భోజనం పెట్టించారు. మొత్తం మీద నామినేషన్ కార్యక్రమానికే లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. పాలకొండ, టెక్కలిల్లోనూ మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top