బీజేపీ సీటులో కోత

బీజేపీ సీటులో కోత - Sakshi


* చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ

* ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానం టీడీపీకి

* వదులుకునేందుకు సిద్ధం

* నర్సరావుపేట, కోడుమూరు

* అభ్యర్థులను మార్చడానికి అంగీకారం


 

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒత్తిడికి బీజేపీ తలొగ్గింది. పొత్తుల్లో ఇప్పటికే కేటాయించిన ఇచ్ఛాపురం స్థానాన్ని వదులుకోవడానికి, నర్సరావుపేట, కోడుమూ రు స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు అంగీ కరించింది. కానీ నరసాపురం, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులను మార్చేందుకు ఒప్పుకోలేదు. మొత్తంమీద 4 లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలతో బీజేపీ సరిపెట్టుకుంది. సీమాం ధ్రలో ఒంటరిగా పోటీ చేయాలని భావించినప్పుడు పొత్తు పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెచ్చి, తీరా పొత్తు కుదిరి నామినేషన్ల ఘట్టం కూడా పూర్తవుతున్న సందర్భంలో చంద్రబాబు ఎత్తుగడ బీజేపీ నేతలను విస్మయపరిచింది. బీజేపీకి బలం లేదని, బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోందంటూ అడ్డగోలు వాదన చేయడం రాష్ట్ర బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించినప్పటికీ జాతీయ నేతల జోక్యంతో రాజీకి రాక తప్పలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్ చేరుకుని శుక్రవారం చంద్రబాబుతో  చర్చలు జరిపారు.

 

 ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు నివాసంలో ఇరు పార్టీల నేతలు ప్రకాశ్ జవదేకర్, కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జవదేకర్, సుజనాచౌదరి విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తు సజావుగా కొనసాగుతుందన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఇచ్ఛాపురం స్థానాన్ని బీజేపీ వదులుకుంటున్నట్టు జవదేకర్ తెలిపారు. దానికి బదులుగా పార్టీకి మరో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందన్నారు. విశాఖపట్నం లోక్‌సభ నుంచి కంభంపాటి హరిబాబు, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, తిరుపతి (ఎస్సీ) స్థానంలో కారుమంచి జయరాం, రాజంపేట నుంచి పురందేశ్వరి పోటీలో ఉంటారని స్పష్టంచేశారు.

 

 నరసరావుపేట, కోడుమూరులో మార్పు

 నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థి యడ్లపాటి రఘునాథ్‌బాబు స్థానంలో నల్లబోతు వెంకట్రావుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కోడుమూరులోనూ పార్టీ అభ్య ర్థి కె.రమేష్ విషయంలో స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఎం.రేణుకమ్మను బరిలో ఉంచాలని నిర్ణయించారు. దీనిని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించాల్సి ఉంది. నరసాపురం, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులను మార్చాలని చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలందరూ డిమాండ్ చేశారు. నరసాపురంలో రఘురామకృష్ణంరాజును దించాలని గట్టిగా పట్టుబట్టారు. అయితే వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు గంగరాజు పేరు మార్పునకు బీజేపీ నేతలు అంగీరిస్తారేమో నని ఆరెస్సెస్ ముందు జాగ్రత్త తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి రాంమాధవ్ వెంకయ్య ఇంట్లో జరిగిన బీజేపీ నేతల చర్చల్లో పాల్గొని ఆరెస్సెస్ అభీ ష్టాన్ని తెలియజేశారని సమాచారం. దీంతో గంగరాజును మార్చేందుకు బీజేపీ ససేమిరా అంది. రాజంపేటలో పురందేశ్వరిని మార్చడం కుదరని తేల్చింది. అనంతరం పురందేశ్వరికి బీ ఫామ్ ఇచ్చారు. ఆమె శనివారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top