ఇదేంటయ్యూ చంద్రం

ఇదేంటయ్యూ చంద్రం - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీతో పొత్తు పేరుతో నాటకం ఆడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చివరకు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం కొరివితో తల గోక్కున్నట్టయ్యిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీడీపీలో నెలకొన్న వర్గ రాజకీయూలు, వలస నేతలను అక్కున చేర్చుకుని పార్టీ శ్రేణులను అభాసుపాలు చేసిన ఘటనలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్నటివరకూ బీజేపీతో పొత్తు అంటూ దొంగాట ఆడి చివరకు ఆ పార్టీకి రాంరాం చెప్పడం గోరుచుట్టపై రోకలి పోటులా పరిణమిస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొం టున్నారుు.

 

 పొత్తంటూనే దొంగాట

 నిన్నటివరకూ బీజేపీతో పొత్తు అంటూనే చంద్రబాబు నాయుడు దొంగాట ఆడా రు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామంటూ కొందరు నేతలతో ప్రచారం చేయించి.. మరోవైపు నరసాపురం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టించడం టీడీపీ, బీజేపీలను ఇరకాటంలో పడేసింది. తాడేపల్లిగూడెం స్థానాన్ని కూడా బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చి చివరకు టీడీపీ తరఫున కొట్టు సత్యనారాయణతో నామినేషన్ వేయించారు. ఈ తరహా నాటకాలు అటు బీజేపీ, ఇటు టీడీపీ శ్రేణులను అయోమయూనికి గురిచేశాయి.

 

 ఇదీ వ్యూహం  

 బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదరకముందే పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజును చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీలో చేర్పించారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని ఆ పార్టీతో చర్చలకు ముందే చంద్రబాబు నిర్ణయించారు. ఆ తర్వాత అక్కడ తన మనిషే ఉండేలా చూసుకునేందుకు రఘురామకృష్ణంరాజును బీజేపీలోకి పంపించారు. తద్వారా నరసాపురం సీటును బీజేపీకి ఇచ్చి ఆ స్థానంలో తన మద్దతుదారుడే బరిలో ఉండేలా వ్యూహం రచించారు. ఈ వ్యూహం కచ్చితంగా ఫలించి రఘురామకృష్ణంరాజుకే బీజేపీ సీటు వస్తుందని అంతా భావిం చారు. అనూహ్యంగా మరో పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు తెరపైకి రావడంతో చంద్రబాబు-రఘురామకృష్ణం రాజు వ్యూహం బెడిసికొట్టింది. గంగరాజు సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఆయన  వైపే మొగ్గు చూపింది.

 

 అయినా రఘురామరాజు చివరివరకూ బీజేపీ అగ్ర నాయకులపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు కూడా రఘురాజుకు సీటివ్వాలని తన కోటరీ ద్వారా లాబీయింగ్ చేయించారు. కానీ చివరికి బీజేపీ గంగరాజుకే సీటు కేటాయించడంతో చంద్రబాబు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయింది. మరోవైపు తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చి అక్కడి నేతలతో ఒత్తిడి చేరుుంచి.. చివరకు అక్కడినుంచి కూడా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపే వ్యూహం రచించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి నుంచి పొత్తు లేదనే ప్రచారాన్ని ప్రారంభించి బీజేపీ నేతలపై ఒత్తిడి పెంచారు. మరోవైపు బీజేపీ సీటు దక్కని రఘురామకృష్ణంరాజు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. చివరికి నరసాపురం సీటు దక్కించుకునేందుకు బాబు రఘురామరాజుతో గురువారం నామినేషన్ వేయిం చడం విశేషం. ఆయన ఒకటి బీజేపీ తరఫున, మరొకటి టీడీపీ తరఫున రెండు సెట్ల నామినేషన్లు వేయడం విశేషం. గంగరాజును మార్చి రఘురామకృష్ణంరాజుకు సీటిస్తే పోటీలో ఉండేందుకు అనువుగా బీజేపీ తరఫున, లేనిపక్షంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వీలుగా ఆ పార్టీ పేరుతో నామినేషన్ వేయడం గమనార్హం.

 

 అలాగే తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మె ల్యే కొట్టు సత్యనారాయణ కూడా నామినేషన్ వేశారు. ఆయన్ను కూడా టీడీపీ తరఫున పోటీలో ఉంచేందుకు పావులు కదుపుతున్నారు. ఇదంతా బీజేపీని ఇరుకునపెట్టి నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్లను దక్కించుకునేందుకు చంద్రబాబు ఆడించిన నాటకమేనని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు  బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తాడని తెలిసి కూ డా పొత్తుకు ఒప్పుకోవడం తమ పార్టీ చేసిన తప్పని బీజేపీ నేతలు చెబుతున్నారు. బాబు ఎత్తులకు లొంగేది లేదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. పొత్తు పేరిట చంద్రబాబు బీజేపీని ముప్పతిప్పలు పెడుతుండటంపై ఆ పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top