ముందస్తు చర్యలు తీసుకోండి


జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సెక్టోరల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ ఆదేశించారు. బుధవారం ఎస్‌వీఎస్ ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ  శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.

 

 పిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలో, రిటర్నింగ్ అధికారి నియోజకవర్గ కేంద్రంలో విధులు నిర్వహించాలని, వీరి పనితీరుపై సెక్టోరల్ అధికారి మాత్రం పోలింగు కేంద్రాలు, రూట్లు, గ్రామాల్లోని  పోలింగ్ పరిస్థితులపై సమయస్ఫూర్తితో మానిటరింగ్ చేయాలన్నారు. ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులుండేలా పర్యటించాలని, ప్రహరీలు, నీడలేనిచోట షామియానాలు వేయించాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి వచ్చినందున ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పారితోషికం సకాలంలో చెల్లించాలని, శాంతి భద్రతల సమస్య ఎక్కడ తలెత్తినా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 సీఆర్‌పీసీ 44 ప్రకారం చట్టవిరుద్ధంగా ప్రవర్థించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం సెక్టోరల్ అధికారులకుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ప్రచారం నిర్వహించినా, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులెవరైనా కండువాలతో, పార్టీ గుర్తులు కనిపించే చొక్కాలు ధరించి పోలింగు కేంద్రంలోకి వెళ్లినా అప్రమత్తం కావాలని సూచించారు. ఈనెల 18 నుంచి ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈ ఎన్నికల్లో ఓటు స్లిప్పులనే ఓటరు గుర్తింపుగా పరిగణించటం జరుగుతుందని, ఈ  స్లిప్పును చూపించే ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శిక్షణలో సహాయ కలెక్టర్ విజయరామరాజు, ఆర్‌డీఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

 

 అన్నీ కొత్త ఈవీఎంలే..

 కలెక్టరేట్: జిల్లాలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు ఈసారి కొత్త ఈవీఎంలనే వినియోగిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం రెవెన్యూ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2009, 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నింటిని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పంపించామని, వాటిని మళ్లీ ఇక్కడకు పంపకుండా, ఎన్నికల కమిషన్ జిల్లాకు కొత్త ఈవీఎంలను సరఫరా చేసినట్లు తెలిపారు. 7280 బ్యాలెట్ యూనిట్లు అవసరముండగడా 9700 తెప్పించామని, అలాగే 7500 కంట్రోల్ యూనిట్లకు 9700 అదనంగా వచ్చాయన్నారు. వీటన్నింటిని ఈసీఐఎల్ ఇంజనీయర్లతో తనిఖీ చేసి మొదటి విడతగా అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో 5శాతం చొప్పున 475 ఈవీఎంలను ఎంపిక చేసుకొని మాక్‌పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈనెల 21న రెండోవిడత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అన్ని పార్టీల నాయకులు మాక్‌పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ విజయరామారాజు, డీఆర్‌ఓ రాంకిషన్, ఎన్‌ఐసీ డీఐఓ మూర్తి, కాంగ్రెస్ పార్టీ తరుపున సత్తూర్ రాములుగౌడ్, టీడీపీ తరుపున ఎల్.రమేశ్, సీపీఎం నుంచి తిరుమలయ్య, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top