హఠాత్తుగా ప్రత్యర్థులుగా మారారు!

జయలలిత-నరేంద్ర మోడీ - Sakshi


రాజకీయాలలో ఎవరు ఎప్పుడు స్నేహంగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థులుగా మారిపోతారో చెప్పడం కష్టం. అదే తరహాలో ఇద్దరు స్నేహితులు హఠాత్తుగా ప్రత్యర్థులుగా మారారు. రాజకీయ రణక్షేత్రంలో వాక్‌బాణాలు సంధించుకుంటూ విమర్శల కత్తులు దూసుకుంటున్నారు. నేను గొప్ప అంటే కాదు కాదు నేనే గొప్ప అంటూ తమ ఘనతలను ఏకరవు పెట్టుకుంటున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకూ ఎవరా మిత్రలు? ఎవరా శత్రువులు? అని ఆలోచిస్తున్నారా? ఇద్దరూ ఉద్దండులే. విశిష్ట వ్యక్తులే. ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. ఒకరు ఉత్తరాదిన ముఖ్యమంత్రి అయితే, మరొకరు దక్షిణాదిన ముఖ్యమంత్రి. దేశంలో ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే వారిద్దరినీ గుర్తు పట్టేసి ఉంటారు. ఒకరు తమిళనాడు ముఖ్యమంత్రి, పురట్చితలైవి (విప్లవ వనిత) జయలలిత కాగా, మరొకరు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. ఈ ఇద్దరు  సారధులు గతంలో మంచి స్నేహితులుగా పేరు పొందారు. ఒకరి ఘనతలను మరొకరు మెచ్చుకుంటూ స్నేహమంటే ఇదేరా అని కూడా అనిపించుకున్నారు. కానీ  ప్రధాని పదవి ఆ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. వారి స్నేహాన్ని శత్రుత్వంగా మార్చేసింది. రాజకీయ శత్రువులుగా మారిపోయారు.



ప్రస్తుతం సాగుతున్న ఎన్నికల ప్రచార పర్వంలో అంతటా వినిపిస్తున్న మంత్రం అభివృద్ధి. యూపీఏ పాలనలో సాగిన అవినీతి, కుంభకోణాలతో అభివృద్ధి పాతాళంలోకి కూరుకుపోయిన నేపథ్యంలో గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ  నరేంద్రమోడీ చేస్తున్న ప్రచారం ప్రజలను ఆకర్షిస్తోంది. గుజరాత్‌ను చూపిస్తూ దేశాన్ని కూడా అదే విధంగా వృద్ధి చేస్తానంటూ ఆయన దూసుకెళ్తున్నారు.  జయలిలత సొంత ఇలాకా తమిళనాడులోనూ అదే విధంగా ప్రచారం చేశారు. చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభల్లో కూడా ఆయన డీఎంకే, అన్నాడీఎంకేలను ఒకే గాటన కట్టి విమర్శలు గుప్పించారు. ఇంకేముంది ఈ ప్రసంగాలన్నీ  జయలలిత ఆగ్రహానికి కారణమయ్యాయి. తన రాజ్యానికి వచ్చి తనపైనే విమర్శలు చేస్తారా? అంటూ ఆమె మోడీపై  మండిపడుతున్నట్లు సమాచారం. అయితే పురచ్చితలైవి ఆగ్రహానికి ఇదొక్కటే కారణం కాదని, మరో బలమైన కారణం కూడా ఉందని  ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.



నరేంద్రమోడీలాగా జయలలిత కూడా ప్రధాని పీఠంపై కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించిన ఊపు, ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణను ఊతంగా చేసుకొని దేశ రాజకీయాల్లో  కీలక భూమిక నిర్వహించాలని జయలలిత తహతహలాడుతున్నారు. ప్రధాని పదవిపై మక్కువను బహిరంగంగా ఆమె బయటపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 సీట్లలో 35 సీట్లు సాధిస్తే ప్రధాని పదవి తమిళులకే దక్కుతుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. పుదుచ్చేరీతో కలుపుకొని మొత్తం 40 సీట్లలో 30 నుంచి 35 సీట్లు సాధించాలని శ్రమిస్తున్న జయలలితకు మోడీ నుంచి సవాళ్లు ఎదురవుతున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ డీఎంకే కొన్ని ప్రాంతాల్లో ఇంకా బలంగా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆగర్భ శత్రువువైన కరుణానిధి పార్టీతోనే ముప్పు ఉందనుకుంటే మోడీ రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని జయ భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా తమిళనాట బీజేపీ ఏడు పార్టీల కూటమిగా అవతరించడంపై ఆమె దృష్టి సారించారు.  ఆ కూటమి ప్రభావం పెరిగితే తనకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మోడీకి మొదట్లోనే చెక్ పెట్టే దిశగా జయ చెలరేగిపోతున్నారని తమిళనాట ప్రచారం సాగుతోంది.



గుజరాత్ మాదిరిగానే విస్తారంగా అవకాశాలున్న తమిళనాడు అభివృద్ధి పథంలో అంతగా దూసుకుపోవడం లేదని తమిళనాడులో నిర్వహించిన ప్రచారంలో మోడీ విమర్శించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రాన్ని వృద్ధిలోకి తేవడంలో విఫలమయ్యాయని కూడా మండిపడ్డారు. ఈ విమర్శలకు జయలలిత ఘాటుగా బదులిచ్చారు. తమిళనాట మంచి పనులు చేసిందీ, ప్రజల కోసం నిరంతరం ఆలోచించేదీ అన్నాడీఎంకే పార్టీ ఒక్కటేనని ఆమె స్పష్టం చేశారు. అంతటితోనే ఆగిపోకుండా  గుజరాత్ అభివృద్ధి  అంతా మిథ్య అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ కంటె తమిళనాడు ఎంతో ముందంజలో ఉందని కూడా సెలవిచ్చారు. మోడీపై జయ విమర్శల వర్షం కురిపించడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తమిళనాట  రెండు ప్రధాన ముస్లిం పార్టీలు ప్రస్తుతం డీఎంకేతో జతకట్టాయి. ఇదే అంశం జయలలితను కలవరపరుస్తున్నట్లు సమాచారం. ముస్లిం ఓట్లకు కత్తెర పడకుండా చూసుకునే చర్యల్లో భాగంగానే మోడీపై జయ నిప్పులు చెరుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఇది మోడీ, జయలలితలకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఒకప్పటి స్నేహితులు, ప్రస్తుత ప్రత్యర్థులు మళ్లీ చేయి కలిపే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top