ఇంకా 13 రోజులే..!


పాలమూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారహోరు.. జిల్లాలో జోరుగా సాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి 13 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎన్నికల ఫైనల్స్‌లో తేల్చుకునేందుకు నాయకులంతా ప్రచారంపై దృష్టి పెట్టారు. లీగ్ మ్యాచ్‌ల్లా సాగిన గ్రామపంచాయతీ, సహకార ఎన్నికలు గత జులై నెలలో ముగిశాయి. క్వార్టర్స్, సెమీస్‌లా మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు సైతం ఇటీవలే అయ్యాయి. మిగిలింది ఫైనల్ మ్యాచ్...! రాజకీయ జట్ల మధ్య అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది. సార్వత్రిక ఎన్నికల బరిలో అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తమదైన పద్ధతుల్లో ప్రచారంలో కదం తొక్కుతుండటంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గతనెల ఐదో తేదిన సార్వత్రిక ఎన్నికలకు నోటిషికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోరుకు ముందుగా మున్సిపల్.. ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలు వచ్చి పడ్డాయి.

 

 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో పోరు సాగింది. అనంతరం ఓట్ల లెక్కింపుపై సందిగ్ధత.. కోర్టు తీర్పుల నేపథ్యంలో గ్రామాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ ఎన్నికలపైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ రసవత్తరంగా సాగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తంతు ఈసారి చప్పచప్పగా మొదలైంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల టికెట్ల ఖరారు.. జంప్‌జిలానీలతో కొంత ఊపు వచ్చినప్పటికీ అంతంతమాత్రమే స్థానిక సందడి ముగియడంతో ఇప్పుడు పట్టణాలు, పల్లెలన్నీ సార్వత్రిక పోరుపైనే చర్చిస్తున్నాయి.

 

 నేతలతో ప్రచారాలు

 ఈసారి ఆయా సెగ్మెంట్లలో తమ పార్టీ అగ్రనేతలతో ప్రచారం చేయించుకునేందుకు అభ్యర్థులు ఎత్తుగడ వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సమావేశం నిర్వహించారు. నేడు జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో బహిరంగ సభ చేపట్టేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సీనియర్లను జిల్లాలో ప్రచారానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

 

 ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు

 స్థానిక ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగినవి కావడంతో గ్రామాల వారీగా పోలింగ్ సరళి.. అక్కడి ఓటర్ల మనోగతం.. పార్టీల వారీగా మద్దతుపై పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులు దృష్టిపెట్టారు. ఆయా గ్రామాలు, మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా బలాబలాలపై లెక్కలేస్తున్నారు.

 

 తమ పార్టీ అభ్యర్థులు అంచనా వేస్తున్న ఓట్లను బట్టి తమకు పోలయ్యే వాటిని లెక్క వేస్తున్నారు.  స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి వెచ్చించిన నిధులు.. సార్వత్రిక ఎన్నికలకు చేయాల్సిన ఖర్చులపై బేరీజు వేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారంతో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ఆయా చోట్ల ఓటింగ్ సరళిపై దృష్టి కేంద్రీకరించారు. క్రాస్ ఓటింగ్ ప్రాంతాల్లో పార్టీలవారీగా బలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రచార సమయం 13 రోజులే మిగిలి ఉండటంతో పార్టీల అభ్యర్థులందరూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున మైకులు మొత్తుకుంటున్నాయి. కళాకారుల ఆటపాటలు మొదలయ్యాయి. మండలాల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top