దేశాన్ని లూటీ చేస్తున్న సోనియా కుటుంబం: సుబ్రహ్మణ్య స్వామి

దేశాన్ని లూటీ చేస్తున్న సోనియా కుటుంబం: సుబ్రహ్మణ్య స్వామి - Sakshi


హైదరాబాద్: సోనియా కుటుంబం దేశాన్ని లూటీ చేస్తోందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఆమెదేనని, చట్టాలను, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆయన తీవ్ర వాఖ్యలు చేశారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సోనియా కుటుంబంపై విరుచుకుపడ్డారు. కొన్నిరోజులుగా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ప్రియాంక గాంధీపై దాడితో ప్రారంభించి..రకరకాల ఆరోపణలు గుప్పించారు. తుదకు నెహ్రూను కూడా వదల్లేదు. వివరాలు ఆయన మాటల్లో..

 

 - ప్రియాంక భర్త వాద్రా 12 కంపెనీలు నిర్వహిస్తున్నారు. రకరకాల ఉల్లంఘనలతో వీటిని భూ కుంభకోణాలకు వాడుకుంటున్నారు. తక్కువ ధరకు భూములు పొంది వాటి ‘ల్యాండ్‌యూజ్’ను మార్పించి వాణిజ్యపరమైన కార్యక్రమాల ద్వారా ఎక్కువ మొత్తం సంపాదించటం వాటి పని. ఈ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం విచారణ జరిపే అవకాశం ఉందని భావిస్తున్న వాద్రా... తాను లండన్‌లో నిర్మిస్తున్న హోటల్‌ను ఆధారంగా చేసుకుని అక్కడ నివాస హోదాకోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడికి పారిపోయే ఆలోచనలో ఉన్నారు.

 

- సోనియా, రాహుల్‌లు ‘యంగ్ ఇండియన్స్’పేరుతో కేవలం ఐదు లక్షల మూలధనం తో కొత్త సంస్థ ప్రారంభించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కంపెనీ భూములను అక్రమ మార్గాల్లో పొంది రూ.5 వేల కోట్ల ఆస్తులు సముపార్జించారు. వీటిపై నేను పాటియాలా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశా.  



 - ప్రియాంక మూడు ‘డైరక్టర్ ఐడెంటిటీ నెంబర్ (డీఐఎన్)’ లు  కలిగి ఉన్నారు. ఇది  తీవ్రమైన  నేరం. ఆరునెలల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా పడుతుంది. దీనిపై నేను  కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేశా. ఒకటికంటే ఎక్కువ డీఐఎన్‌లు ఉండకుండా నిరోధించాల్సిన మంత్రి సచిన్‌పైలటే స్వయంగా దాన్ని కలిగి ఉండటం విశేషం.

 

- రాహుల్ తాను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ చేసినట్టు నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ ఆయన అక్కడ ఎంఫిల్ చేయలేదు. పైగా నేషనల్ ఎకనమిక్ ప్లానింగ్ పాలసీ అనే సబ్జెక్టులో ఫెయిలయ్యారు. అక్కడ రవూల్ వించి అనే ఇటలీ పేరుతో రాహుల్ పేరు నమోదై ఉంది. సోనియా ఇటలీలో కనీసం ఐదో తరగతి కూడా పాస్ కాకుండానే కేంబ్రిడ్జి నుంచి ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు గతంలో అఫిడవిట్‌లో పేర్కొన్నారు.



 - ‘జంటిల్‌మెన్ పాస్’తో డిగ్రీ పూర్తి చేసిన నెహ్రూ కంటే పీహెచ్‌డీ పూర్తి చేసిన అంబేద్కర్‌కే ‘పండిట్’ అనే గౌరవవాచకం ఉండాలి.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top