రుణం తీర్చుకోవడానికే పోరాడుతున్నాం

రుణం తీర్చుకోవడానికే పోరాడుతున్నాం - Sakshi


వరంగల్ జిల్లా ‘వైఎస్సార్ జనభేరి’లో షర్మిల

 ప్రజలను సొంత బిడ్డల్లా చూసిన నేత వైఎస్

 అందరి గుండెల్లోనూ ఆయనది చెరగని ముద్ర

 తెలంగాణ అంటే మహానేతకు ప్రత్యేకాభిమానం

 అనేక పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు

 వైఎస్ కుటుంబం మీకు రుణపడి ఉంది

 వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి... మానుకోటలో పూల వర్షం


 

 సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజలను సొంత బిడ్డల్లా... రాష్ట్రాన్ని సొంత కుటుంబంలా చూసుకుని పరిపాలన సాగించే రాజన్న రాజ్యం మళ్లీ వచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ జనభేరి’లో భాగంగా ఆమె శనివారం వరంగల్ జిల్లా మరిపెడ, కురవి, మహబూబాబాద్, గూడూరు, నర్సంపేటలో రోడ్‌షో నిర్వహించారు. ఉదయం 11 గంటలకు మరిపెడలో మొదలైన రోడ్‌షో.. సాయంత్రం 7 గంటలకు నర్సంపేటలో ముగిసింది. మరిపెడ, మహహబూబాబాద్, నర్సంపేటలో షర్మిల ప్రసంగించారు. ‘ప్రజలను సొంత బిడ్డల్లా, రాష్ట్రాన్ని సొంత కుటుంబంలా చూసుకుని పరిపాలించిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ఎన్నడూ తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేసి చూడలేదు. అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల ప్రజలను సొంత కుటుంబంలా భావించారు. వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ, విద్యుత్ కనెక్షన్లు, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ విషయంలో తెలంగాణకే పెద్ద పీట వేశారు. మహానేతకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాదయాత్రను మొదలు పెట్టింది తెలంగాణలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇలా ఎన్నో పథకాలను తెలంగాణలోనే మొదలు పెట్టి.. ఈ ప్రాంతం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాలకు 13 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు’ అని షర్మిల పేర్కొన్నారు.

 

 అందరి గుండెల్లో వైఎస్‌కు సుస్థిర స్థానం: ‘వైఎస్సార్ చనిపోయినపుడు ఆ బాధని తట్టుకోలేక తెలంగాణలోనే ఎక్కువ మంది ఆయన వెంటే వెళ్లారు. ఇది తెలంగాణ బిడ్డలకు, వైఎస్‌ఆర్‌కున్న చెరగని అనుబంధం. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ‘హెడ్‌లైన్స్ టుడే’ వార్తా సంస్థ ఇటీవల సర్వే నిర్వహిస్తే.. తెలంగాణలోని 60 శాతం మంది వైఎస్‌ఆర్ పేరే చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆ మహానేతకు సుస్థిర స్థానముంది. తెలంగాణ ప్రజలు వైఎస్సార్‌కు వారి గుండెల్లో చోటిచ్చారు. మీ అభిమానాన్ని మేము గుర్తుంచుకుంటాం. మేం మీకు రుణపడి ఉం టాం. వైఎస్‌ఆర్ కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి మీ ముందుకు వస్తున్నాం. ఎంత కష్టం.. నష్టం వచ్చినా.. మీ రుణం తీర్చుకోవడానికే పోరాడుతున్నాం’ అని షర్మిల ఉద్వేగంతో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. వైఎస్ హయాంలో విద్యుత్ చార్జీలు, ఏ ఒక్క పన్నూ పెంచలేదని, ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చార్జీలు, పన్నులు పెంచి పేదల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు.

 

 విలువలకు.. విశ్వసనీయతకు కట్టుబడిన వైఎస్ జగన్

 

 ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీని భుజాలపైన మోసిందని షర్మిల విమర్శించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘మంచివాడని చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబును టీడీపీలోకి పిలిచి మంత్రి పదవిచ్చారు. అయితే ముఖ్యమంత్రి కుర్చీపై బాబు కన్ను పడింది. సొంత మామ అని కూడా చూడకుండా సీఎం పదవి కోసం వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి ఆయననే వెలివేశాడు. చివరకు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించాడు. మోసం.. వెన్నుపోటు నుంచి పుట్టిన చంద్రబాబు.. వ్యవసాయం దండగ అన్నాడు. మద్యపాన నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యంలాంటి ఏ ఒక్క వాగ్దానాన్నీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్నో హామీలిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు. ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే.. పులి పులే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏ రోజూ ప్రజా సమస్యలపై పోరాడలేదు. రైతులు, చేనేత, కార్మిక, విద్యార్థులపక్షాన నిలవలేదు. పెంచిన చార్జీలను తగ్గించాలని అడగలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ప్రజల పక్షాన నిలిచారు. రాత్రనక, పగలనక జగనన్న మాత్రమే పేద విద్యార్థుల ఫీజుల కోసం దీక్ష చేశాడు.. పోరాడాడు. రైతులు, చేనేతల సంక్షేమానికి, ఫీజుల తగ్గింపు కోసం రోజుల తరబడి దీక్ష చేశాడు. ‘ఓదార్పు’ అనే ఒక్క మాట కోసం పదవిని వదులుకుని విలువలకు,.. విశ్వసనీయతకు కట్టుబడ్డాడు. చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. బోనులో ఉన్నా.. సింహం సింహమే అని నిరూపించుకున్నాడు. మహానేత వైఎస్‌లాగా ప్రజలను చూసుకునే నేత జగన్’ అని షర్మిల పేర్కొన్నారు.  

 

 రాజన్నను గుర్తు చేసుకోండి

 

 రాజన్న ఆశయం కోసం పుట్టిన వైఎస్సార్‌సీపీతోనే పేదలకు ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ‘మీ రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వండి. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు వేసే ముందు.. మీ గుండెల్లో ఉన్న రాజన్నను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి. మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వండి. నా మీద ఆప్యాయతతో మండుటెండలో నా కోసం వచ్చిన మీకు శిరస్సు వంచి పేరుపేరునా.. చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా’ అని షర్మిల విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ ఫారెస్టు ఆఫీస్ సెంటర్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు షర్మిల ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి జనం షర్మిలపై పూలు చల్లి అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా స్వరూప అనే చిన్నారి షర్మిలకు లంబాడీ దుస్తులను, గాజులను బహూకరించింది. షర్మిల వాటిని ధరించి అభివాదం చేయడంతో ప్రజలు పెద్దగా చప్పట్లు కొట్టారు. వైఎస్సార్‌సీపీ మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి బానోత్ సుజాతమంగీలాల్, ములుగు నియోజకవర్గ అభ్యర్థి లోకిని సంపత్, సీపీఎం మహబూబాబాద్ అసెంబ్లీ అభ్యర్థి బానోత్ సీతారాంనాయక్, నర్సంపేట అభ్యర్థి గాదె ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వరరావు, మహబూబాబాద్ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ సమన్వయకర్త నాడెం శాంతికుమార్‌లు షర్మిల వెంట రోడ్‌షోలో పాల్గొన్నారు.



 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top