చీరకట్టు చిన్నది... ఓటడుగుతున్నది!


ఆమె యాభై రకాలుగా చీర కడుతుంది. ఆమె ఎంత వేగంగా చీర కడుతుందంటే చూసినోళ్లు కంగారు పడిపోతారు. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు ప్రపంచంలో ఆమె కట్టినంత వేగంగా ఇంకెవరూ చీర కట్టలేరని ఖితాబు ఇచ్చేసింది. సీరియల్ నటుల నుంచి సినిమా స్టార్ల దాకా, ఐశ్వర్య రాయ్ నుంచి ఐఎఎస్ ఆఫీసర్ల భార్యల దాకా అందరకూ ఆమె దగ్గర చీర కట్టు నేర్చుకుంటారు. సినిమాల నుంచి సీరియల్స్ దాకా అన్నిటా ఆమె చీర డిజైన్లు దర్శనమిస్తూంటాయి. మొత్తం మీద 'ఆరడుగుల మన్మథలేఖ'కు ఆమే ఆసలు చిరునామా! ఇంగ్లీషులో ఆమెను ముచ్చటగా 'డ్రేప్ క్వీన్' అంటూంటారు.




ఆమె పేరు షైనా ఎన్ సీ. ఆమె రాజకీయ నేత. మహారాష్ట్ర బిజెపి కోశాధికారి కూడా. దేశంలో ఉన్న ఏకైక మహిళా కోశాధికారి ఆమే. ఫాషన్ ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఉండే షైనా పేరు నిన్న మొన్నే పొలిటికల్ ప్రపంచంలోనూ మార్మోగింది. ఆమె నరేంద్ర మోడీ ఉర్దూ వెబ్ సైట్ ను తయారు చేయించి, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసింది. మరో ఖాన్ షారుఖ్ ఆమె బెస్ట్ ఫ్రెండ్. అప్పుడే ఆమె వార్తలకెక్కింది. కెమెరాలు ఇక మరొకరిని ఫోటో తీయడం మానేశాయి. ఛానెళ్లు ఇంకొకరిని చూపించడం వదిలేశాయి. అలా షైనా షైన్ అయిపోయింది.




బిజెపిలో అలాంటి  వారుండటమేమిటని ఆశ్చర్యపోయేవారూ ఉన్నారు. కానీ వాళ్లంతా ఆమె రాజకీయాలు మాట్లాడటం మొదలుపెడితే ఆమె అవగాహనకు నోరెళ్లబెట్టేస్తారు. ఇప్పుడంతా ఆమెను 'బ్యూటీ విత్ బ్రెయిన్' అనడం మొదలుపెట్టారు. ఆమె ఆషామాషీ వ్యక్తి కాదు. ఆమె తండ్రి నానా చూడాసమా ముంబాయికి షెరీఫ్ గా పనిచేశారు. ఆమె తల్లి మునీర్ చూడాసమా ముస్లిం.




కొత్త తరం బిజెపి లీడర్లకు షైనా ప్రతినిధి. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బాంద్రా నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. పోటీలో ఉన్నా లేకపోయినా ఆమె వార్తల్లో మాత్రం ఉంటున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top