మంత్రులుగా మసకబారి పోయారు!

మంత్రులుగా మసకబారి పోయారు! - Sakshi


 సాక్షి, గుంటూరు :రాష్ట్రానికి అమాత్యులుగా ఒక వెలుగు వెలిగి రాజకీయంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన ఎంతో మంది సీనియర్, జూనియర్ మంత్రులు అనంతరం టిక్కెట్లు దక్కక పోవడంతో వారి రాజకీయ జీవితం మసకబారిపోయింది. బండ్లు ఓడలు.... ఓడలు బండ్లు కావడమంటే బహుశా ఇదేనేమో.. అనేక మంది ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి అధికారులను సైతం అనేక సార్లు తమ చుట్టూ తిప్పుకున్న మంత్రులు ప్రస్తుతం జూనియర్ ఎమ్మెల్యేలు, కిందిస్థాయి అధికారుల చుట్టూ ప్రదక్షణలుచేయాల్సిన దుస్థితి నెలకొంది. మంత్రులుగా ఉండి అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించి జిల్లాలో  అనేక మందికి టిక్కెట్లు ఇవ్వమంటూ రికమండేషన్లు చేయాల్సిన మంత్రివర్యులు కనీసం వారి టిక్కెట్టు వారు తెచ్చుకోలేకపోవడం నిజంగా అవమానకరమైన పరిస్థితి. వీరు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతగా మంచి పనులు చేసినా మరుసటి ఎన్నికల్లో అధిష్టానాలు టిక్కెట్లు ఇవ్వలేదంటే, ఆ మంత్రి సరిగా పనిచేయకపోవడం వల్లే పక్కన పెట్టారనే భావన అందరిలోనూ కలగకమానదు. మంత్రులుగా చేసిన అనుభవం ఉన్నా అధిష్టానం ఆశీస్సులు లేకపోతే ఇలాగే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు, మంత్రిగా పనిచేసి ఆ తరువాతి ఎన్నికల్లో టిక్కెట్లు పొందలేక రాజకీయంగా తెరమరుగయ్యారు.

 

  1983, 1985 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మంగళగిరి నుంచి టీడీపీ తరఫున ఎంఎస్‌ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో ఆయన ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 1989లో టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఎంకు కేటాయించడంతో ఆ ఎన్నికల్లో కోటేశ్వరరావు టిక్కెట్టు పొందలేకపోయారు. ఆ తర్వాత రాజకీయంగా తెరమరుగయ్యారు.  పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల నుంచి 1967, 1991, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థులజాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆయన రాజకీయ జీవితానికి తెరపడినట్టు అయింది.

 

  గుంటూరు -2 నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ శనక్కాయల అరుణ మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన తొలిసారే ఆమె మంత్రి పదవి పొందారు. అయితే అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెకు టిక్కెట్టు నిరాకరించింది. దీంతో అరుణ రాజకీయ జీవితానికి అర్ధంతరంగా తెరపడినట్టయింది. తాడికొండ నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన  డొక్కా మాణిక్య వరప్రసాదరావు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top