టికెట్లు అమ్ముకుంటున్నారు

టికెట్లు అమ్ముకుంటున్నారు - Sakshi


మచిలీపట్నంలో బాబును నిలదీసిన టీడీపీ నాయకుడి భార్య

 

మచిలీపట్నం: ‘‘చంద్రబాబూ... టికెట్లు అమ్ముకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడినవారికి టికెట్ ఇవ్వరా? ఇదేమి న్యాయం...’’ అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మహిళ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని నిలదీశారు. ఆమె ఎవరో కాదు... కైకలూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ భార్య. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌ని ఆమె అడ్డుకున్నారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. వేరేవారికి కైకలూరు టికెట్ కేటాయించటంపై రామానుజయ అనుయాయులు చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకుని నిరసన తెలిపారు. కైకలూరు సీటును రామానుజయకే ఇవ్వాలని నినాదాలు చేశారు.



పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుతొలగించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోవటంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. కృష్ణా జిల్లాలోని పెడన, మచిలీపట్నం, పామర్రుల్లో ఏర్పాటు చేసిన సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ఎప్పటిలాగే అమలు కాని హామీలపైనే ఆయన రొటీన్‌గా ప్రసంగించడంతో సభకు హాజరైనవారిలో పెద్దగా స్పందన కనిపించలేదు. బీజేపీతో ఎన్నికల పొత్తు కారణంగా ఇబ్బందులు వచ్చాయని, వాటిని అధిగమించేందుకు అవస్థలు పడాల్సి వచ్చిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు కారణంగా తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం కారణంగా తన పర్యటన ఆలస్యమైందన్నారు. దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ముస్లింలు, మైనార్టీలకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. రాష్ట్ర విభజనతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కనుమరుగువుతోందని జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజలంతా తలా కాస్తా తట్ట మట్టి, సిమెంటు వేసి దాన్ని పూర్తిగా సమాధి చేయాలన్నారు.



మన్మోహన్‌సింగ్ ప్రధానిలా కాక సోనియా చేతిలో రోబో మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సమర్థుడైన యువకుడు కాదని, అతనికి దేశాన్ని పాలించే సీన్ లేదని వ్యాఖ్యానించారు. మనమంతా కష్టాల్లో ఉన్నామని, ఇటువంటి సమయంలో విజన్ ఉన్న తన లాంటి నాయకుడ్ని ఎన్నుకోవాలని చెప్పారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బందరు, పెడన టీడీపీ అభ్యర్థులు కొల్లు రవీంద్ర, కాగిత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top