రాయలసీమ రాజకీయ ‘శోభ’

రాయలసీమ రాజకీయ ‘శోభ’ - Sakshi


నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమను విడిచి వెళ్లిపోయారు.

 

 శోభా నాగిరెడ్డి అంటే..చిరునవ్వుకు, సమర్ధతకు, పట్టుదలకు, విశ్వసనీయతకు మారుపేరు. సహజ సిద్ధమైన శాంత స్వభావంతో కూడిన సీమ అంత ః సౌందర్యం శోభా నాగిరెడ్డిని చూసినప్పుడు తలపునకు వచ్చేది. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కర్నూలు జిల్లాలో, అతి సున్నితమైన ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, కర్నూలు ప్రాంతాలలో పుట్టినింటికీ, మెట్టినింటికీ వన్నె తేవడం శోభా నాగిరెడ్డిలో గమనించగలం.

 సీమలో ఫ్యాక్షనిజం తప్ప ఇంకేమీ లేదనీ, సీమవాసులంటే క్రూరులు, దయాదాక్షిణ్యాలు లేనివారనీ, బాంబు సంసృ్కతి తప్ప వేరొకటి తెలియనివారనీ హత్యలు, ద్వేషాలు మినహా వేరేవీ అక్కడ లేవనే అపోహలూ, భావనలూ శోభా నాగిరెడ్డి వ్యక్తిత్వం ముందు తలొంచాయి. శోభా నాగిరెడ్డి నాయకత్వ లక్షణాలు గమనించిన వారికి అవన్నీ ఎంత దారుణమైన కల్పనలో అవగతమవుతుంది. రాయలసీమ నాయకులలో ఇంత చక్కటి వాగ్ధాటి, సరళమైన వ్యక్తీకరణ, తెలుగుదనం, కృష్ణమ్మ పరవళ్ల లాగా, గోదావరి గలగల లాగా, కోనసీమ పచ్చదనం లాగా శోభాయమనంగా కన్పించే అరుదైన వ్యక్తిత్వం శోభానాగిరెడ్డిది. ఆమె పెద్ద చదువులు చదవలేదు. కానీ సామాన్యంగా కన్పిస్తూ వైవిధ్య, వైరుధ్య వ్యక్తిత్వం గల భిన్నమైన రాజకీయ వ్యవస్థల మధ్య తనకు నచ్చిన పార్టీకి మాత్రమే సన్నిహితంగా కొనసాగుతూనే పార్టీలకు, వర్గాలకూ  అతీతంగా అందరి మన్నన పొందిన అరుదైన నేత ఆమె.



 పార్టీ ఏదైనా -తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్సార్‌సీపీ- నాయకత్వం అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నేరవేర్చిన నేర్పరి శోభ. ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసి కడు సమర్థవంతంగా నెగ్గుకొచ్చారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తరఫున శాసనసభ్యురాలిగా పనిచేసి, చివరిగా వైఎస్సార్‌సీపీలో తన ప్రయాణం సాగిస్తూ, కర్తవ్య నిర్వహణలోనే కన్నుమూశారు. వైఎస్ మరణానంతరం ప్రజారాజ్యం పార్టీని వీడి జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరి, క్రమశిక్షణ కలిగిన నేతగా వ్యవహరించారు. పార్టీలో ముఖ్యనేతగా ఎదిగి శాసన సభ్యుత్వం వదులుకుని, తిరిగి గెలిచి జగన్ కుటుంబం ఆదరణకు నోచుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి కుటుంబం ఓ అక్కను, ఓ ఆడపడుచునుపొగొట్టుకున్నామన్నట్టు బాధపడడం కనిపిస్తున్నది. ఒక రాజకీయ నేత మరణం ఇంతగా కదిలించడం అరు దు. ఏ పార్టీకి చెందినవారైనా ఆమె మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళల ప్రాతినిద్యం రాజకీయాల్లో పెరుగుతున్నది. ఇది ఆహ్వానిం చదగిన పరిణామం. రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అలాగే రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన మహిళలు  శక్తిసామర్థ్యల్లో పురుషులకు తీసిపోమని కూడా నిరూపించుకోవాలి. ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో అధికార రాజకీయాల్లో మహిళలు వ్యక్తిత్వం నిలుపుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి గహనమైన సమస్యను శోభానాగిరెడ్డి ఎలా అధిగమించారో నేడు రాజకీయాలలోకి వస్తున్న మహిళలందరూ గమనించాలి.

 

నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమవాసులను విడిచి వెళ్లిపోయారు.

 శోభానాగిరెడ్డి శక్తియుక్తులు ఎన్నో సందర్భాలలో రుజువైనాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనడంలో అగ్రభాగాన నిలిచి వైఎస్ కుటుంబాన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, జగన్‌మోహన్‌రెడ్డినీ సమర్థించి నిలిచిన నేత శోభానాగిరెడ్డి.

 

ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంతో మారిపోతున్నాయి. ప్రజలు జగన్‌రెడ్డికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హారతి పడుతున్నారు. దీనిని చూడలేని ప్రత్యర్థులు కూడా హద్దు మీరుతున్నారు. కానీ, ఈ విపరిణామాలను ఎదిరించి నిలిచేందుకు సన్నద్ధమైన ఒక యోధురాలు నిన్న ప్రమాదంలో మరణించింది. అదే విషాదం. ఏ ఆశయం కోసమైయితే శోభానాగిరెడ్డి చివరి  నిమిషం వరకు పోరాడారో ఆ పోరాటం మనందరికీ స్పూర్తి కావాలి. వైఎయస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని ఆమె కలగన్నారు. అది నెరవేరాలి. ఆ కలను సార్థకం చేయడమే  శోభానాగిరెడ్డికి అర్పించే  నిజమైన నివాళి.

 

ఇమామ్  (వ్యాసకర్త ‘కదలిక’ ఎడిటర్)

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top