‘దేశం’లో.. మురళీ ‘ద్రోహం’

‘దేశం’లో.. మురళీ ‘ద్రోహం’ - Sakshi


సాక్షి ప్రతినిధి, కాకినాడ :సీట్ల సిగపట్లతో తెలుగుదేశం పార్టీ రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రాజమండ్రి సిటీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో మురళీమోహన్‌కు వివాదాలు తలెత్తాయి. అప్పట్లో తన ఓటమికి వారిద్దరూ పరోక్షంగా కారణమని ఆరోపిస్తూ.. ఆ కక్షతో.. మురళీమోహన్ ఈసారి తమ నాయకుల సీట్లకు ఎసరు పెట్టేందుకు యత్నిస్తున్నారని గోరంట్ల, నల్లమిల్లి అనుచరులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి సిటీని పొత్తుల్లో బీజేపీకి విడిచిపెట్టే ఎత్తుగడలో మురళీమోహన్ వ్యూహాత్మకంగా పైచేయి సాధించారు. తన చేతికి మట్టి అంటకుండా గోరంట్లను సిటీ నుంచి తప్పించడంలో మురళీమోహన్ కృతకృత్యులయ్యారు.

 

 ఆయన రెండో టార్గెట్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఆయన తనయుడు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వారి వంతు వచ్చింది. ఇందులో భాగంగానే రామకృష్ణారెడ్డి సీటుకు పొగ పెట్టేందుకు.. అసలు పార్టీలోనే లేని రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి భార్య సునీత పేరును మురళీమోహన్ ప్రతిపాదిస్తున్నారంటూ మూలారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. సునీత పేరును పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి మురళీమోహన్ తీసుకువెళ్లిన విషయం బయటకు పొక్కింది. దీనిపై అనపర్తిలో రచ్చరచ్చ అవుతోంది. మురళీమోహన్ తీరును ఎండగడుతూ అనపర్తిలో టీడీపీ మండల అధ్యక్షుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు), సీనియర్ నాయకుడు సిరసపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలు సమావేశం నిర్వహించారు.

 

 పార్టీ ఆవిర్భావం నుంచీ మూలారెడ్డి, రామకృష్ణారెడ్డి ఆస్తులు అమ్ముకొని పార్టీ జెండా మోస్తుంటే, పార్టీ సభ్యత్వం కూడా లేని సునీత పేరును ఎలా ప్రతిపాదిస్తారంటూ వారు నిప్పులు చెరుగుతున్నారు. అవసరమైతే స్వతంత్ర పోరుకు కూడా సిద్ధపడి, మురళీమోహన్‌కు, టీడీపీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. కేవలం డబ్బు లేదన్న సాకుతో సీటు మార్చేసేందుకు ప్రతిపాదిస్తే గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి వైదొలగుతామని తండ్రీ కొడుకులు చెప్పినా మిన్నకున్న మురళీమోహన్.. ఇప్పుడు రామకృష్ణారెడ్డిని తప్పించేందుకు ఎత్తులు వేయడాన్ని వారు ప్రశ్నించారు. నిలకడలేని నాయకులను తెచ్చుకుని మురళీమోహన్ తప్పటడుగులు వేస్తే గత ఎన్నికల్లో ఫలితాలే పునరావృతమవుతాయన్న విషయాన్ని గుర్తించాలని వారు అంటున్నారు. తన చర్యల ద్వారా మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణారెడ్డికి టిక్కెట్టు ఇవ్వకుంటే టీడీపీ రాజీనామాలు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు.

 

 సరిగ్గా ఏడాది క్రితం ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో భాగంగా మార్చి 26న చంద్రబాబు అనపర్తి మండలం కుతుకులూరు వచ్చారు. ఆ సందర్భంగా అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికే అని బహిరంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనకు బదులు సునీతకు టిక్కెట్టు ఇచ్చేందుకు మురళీమోహన్ ప్రయత్నించడం వెనుక గత ఎన్నికల నాటి విభేదాలే కారణమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్ సీటుకు ఎసరు పెట్టడంపై ఎగసిన నిరసన సెగ.. మంగళవారం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబుకు తగిలింది. వీటితో పాటు జిల్లాలోని మరికొన్ని సీట్లపై కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదాలు రోడ్డెక్కుతుండగా, ఇప్పుడు కొత్తగా మురళీమోహన్ కారణంగా మరో వివాదం రాజుకుంది. ఈ వివాదాన్ని బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top