కమాన్..దూకుడే..!


జిల్లాను సందర్శించిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీలు టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా విమర్శలు గుప్పించడంతో వాటికి పాలమూరు నుంచే గట్టి సమాధానం చెప్పడానికి గులాబీ దళాధిపతి కె.చంద్రశేఖర్ ఉద్యుక్తులవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు 11 ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రత్యర్థి పక్షాలకు సవాల్ విసరాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

 

 

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో చావో రేవో అనే రీతిలో తలపడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో టీఆర్‌ఎస్ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి తమపార్టీల అగ్రనేతలను జిల్లా కు రప్పించడంతో ప్రచారాన్ని పట్టాలెక్కించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహు ల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్ర మోడీతమప్రసంగాల్లో కేసీఆర్ లక్ష్యం గా విమర్శనాస్త్రాలు సంధించారు. దీం తో అందరికంటే ముందే ప్రచార పర్వం లోకి దిగిన టీఆర్‌ఎస్ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే వ్యూహంలో భాగంగా శుక్రవారం ఒకే రోజు 11 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నాలుగు చోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు.



కృష్ణమోహన్‌రెడ్డి చేరిక సందర్భంగా గద్వాలలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి, మహబూబ్‌నగర్, షాద్‌నగర్‌లో జరిగిన సభలకు కేసీఆర్ హాజరయ్యారు. గద్వాలతో సహా ఇప్పటి వరకు సభలు నిర్వహించని మరో పది నియోజకవర్గాల్లో శుక్రవారం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల నుంచి జన సమీకరణ జరపాల్సిందిగా పార్టీ నుంచి ఖచ్చితమైన ఆదేశాలు అందినట్లు టీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. ఒక్కో సభకు కనీసం 25వేల మందిని సమీకరించడం లక్ష్యంగా నిర్దేశించారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కొందరు అభ్యర్థులు జన సమీకరణ గెలుపునకు చివరి అస్త్రంగా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

 

 ప్రధానంగా కాంగ్రెస్‌తోనే

 టీడీపీ-బీజేపీ కూటమి బరిలో ఉన్నా టీఆర్‌ఎస్ మాత్రం కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉండటంతో కాంగ్రెస్ సాంప్రదాయక ఓటుకు భారీగా గండిపడుతుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. కొడంగల్ అసెంబ్లీ స్థానం, మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం మినహా టీడీపీ-బీజేపీ కూటమి నుంచి పెద్దగా పోటీ ఉండదనే అంచనాలో టీఆర్‌ఎస్ నాయకత్వం ఉంది.

 

 బీజేపీ ఎంపీ అభ్యర్థి విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందని పసిగట్టిన టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థికి పడే ప్రతీ ఓటు పార్టీ ఎంపీ అభ్యర్థికి కూడా పడేలా ప్రణాళిక సిద్దం చేస్తోంది. రాహుల్ గాంధీ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను వెన్నుపోటు దారుడిగా అభివర్ణించడం, నరేంద్ర మోడీ ‘తండ్రి బిడ్డ లు, మామా అల్లుళ్ల పార్టీ’కి ఓటేయొద్దని చెప్పడాన్ని టీఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. శుక్రవారం జిల్లాలో జరిగే 11 బహిరంగ సభల్లో రాహుల్, మోడీ, చంద్రబాబు లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top