ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌పై తొలగని సందిగ్ధత


ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు తెలుగుదేశం టికెట్‌పై నెలకొన్న  సందిగ్ధత తొలగలేదు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి బీ ఫాం కోసం కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి బీ ఫాం తెచ్చుకునేందుకు ఆయన వెళ్లారు. ప్రొద్దుటూరు టికెట్ కేటాయింపుపై చంద్రబాబు నాయుడు ట్విస్ట్ పెట్టారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత బీ ఫాం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 

 అయితే ఇందుకు విరుద్ధంగా జరిగింది. వాస్తవానికి ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి పార్టీ కండువాతో గురువారం మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్‌కార్యాలయంలో  లింగారెడ్డి నామినేషన్ వేశారు. బీ ఫాం లేకపోవడంతో అధికారులకు సమర్పించలేదు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆయన నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. అయితే లింగారెడ్డికి  బీ ఫాం ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడుకు చంద్రబాబు బీఫాం అప్పగించినట్లు తెలుస్తోంది.   రమేష్ నాయుడు మాత్రం వరదరాజులరెడ్డి వైపు మొగ్గుచూపుతుండటంతో లింగారెడ్డి వర్గీయులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీంతో పార్టీ అధ్యక్షునితో నేరుగా మాట్లాడి బీ ఫాం తెచ్చుకునేందుకు లింగారెడ్డి హైదరాబాద్  వెళ్లారు.టికెట్ విషయంలో పార్టీ అధ్యక్షునితో తాడోపేడో తెల్చుకోవాలనే ఉద్ధేశంతో లింగారెడ్డి ఉన్నట్లు తులేస్తోంది. వాస్తవానికి బుధవారం రాత్రి కూడా లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలు నారా లోకేష్ సభకు హాజరై మాట్లాడారు.  టికెట్ కేటాయింపులో ఇరువురి మధ్య పోటీ పెరగడంతో వరదరాజులరెడ్డి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

 ఈ కారణంగానే లింగారెడ్డి ఒంటరిగా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. జిల్లాలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. నామినేషన్ దాఖలకు శనివారం ఒక్కరోజే గడువు ఉన్నా ఇంత వరకు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఈ విషయం చర్చాంశనీయంగా మారింది. లింగారెడ్డి నామినేషన్ దాఖలు చేసినా టికెట్ మాత్రం తమకే వస్తుందని వరదరాజులరెడ్డి వర్గీయులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో చివరి వరకు టికెట్ ఎవ్వరికి దక్కుతుందనే విషయం అర్థం కావడం లేదు. మరో వైపు శనివారం వరదరాజులరెడ్డి కూడా నామినేషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top