కాంగ్రెస్ మార్కు దౌర్జన్యకాండ

కాంగ్రెస్ మార్కు దౌర్జన్యకాండ - Sakshi

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు ఎలాగూ ఓట్లేయరు.. కనీసం పోస్టల్ బ్యాలెట్‌నయినా మేనేజ్ చేయాలి.-ఇదీ జిల్లా కాంగ్రెస్ పెద్దల పన్నాగం.దీనికోసం ఏం చేయాలి!? ఉద్యోగులను టార్గెట్ చేద్దాం! ముందు సామాదానభేదోపాయాలు ప్రయోగిద్దాం. వింటే సరే సరి. లేకుంటే దండోపాయమే!-ఇదీ కాంగ్రెస్ నేతల వ్యూహంమరి ఈ పని ఎవరు చేస్తారు!? ఇంకెవరు మన పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల పెద్దలు ఇద్దరు ఉన్నారు కదా! వారినే ప్రయోగిద్దాం!-ఇదీ వారి కార్యాచరణ. కేంద్రమంత్రి కృపారాణి సూత్రధారిగా, ఆమెకు సన్నిహితులైన ఇద్దరు ఉద్యోగ సంఘాల పెద్దలు పాత్రధారులుగా ప్రణాళికను అమలు చేసేస్తున్నారు.


 


 కుతంత్రం కథా కమామిషు..


 చరిత్రలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓటమి ఎలాగూ తప్పదని తేలిపోయింది. కనీసం పరువు దక్కించుకోవాలంటే డిపాజిట్లు దక్కాలి కదా అని కాంగ్రెస్ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. దీనిపై కేంద్రమంత్రి కృపారాణితోసహా ఆ పార్టీ అభ్యర్థులు కొన్ని రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ క్రమంలో వారి దృష్టి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లపై పడింది. ఉద్యోగులు ఎలాగూ కొన్ని రోజులు ముందే పోస్టల్ బ్యాలెట్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి వారిని మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రి కృపారాణి వర్గంలో శ్రీకాకుళం పట్టణంలో ఉండే ఉద్యోగ సంఘాల కీలక నేతలు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరి కుటుంబ సభ్యుడు ఆ పార్టీ అభ్యర్థి కూడా కావడం గమనార్హం. దాంతో ఆ ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ఉద్యోగులను మేనేజ్ చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు, వినకుంటే బెదిరించేందుకు కూడా సన్నద్ధమయ్యారు. 


 


 ఏం చేస్తున్నారంటే...


 ఉద్యోగ సంఘాల నేతలిద్దరూ ఉద్యోగుల జాబి తాతో సహా రంగంలోకి దిగారు. మొదట వాణిజ్య పన్నుల శాఖ, వైద్యఆరోగ్య శాఖలో ఉద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. ఉద్యోగుల ఇళ్లకు వెళుతూ పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వేయాలని చెబుతున్నారు. ఆ బ్యాలెట్ తమకు చూపించి పంపాలని షరతు విధిస్తున్నారు. అం దుకు ఇంత ఇస్తామని చెబుతున్నారు. సహచర ఉద్యోగుల బ్యాలెట్ ఓట్లను కూడా కూడగడితే భారీగా ముట్టచెబుతామని ఆశ చూపిస్తున్నారు.


 


 అందుకు సదరు ఉద్యోగి సరేనంటే సరే. లేకపోతే ఆయన్ని బెదిరిస్తున్నారు. ‘నీకు సర్వీసులో ఇబ్బం ది వస్తే మేం కావాలా? ఇప్పుడు మా వాడికి ఓటు వేయమంటే నాన్చుతావా? మాకు చూపించి పోస్టల్ బ్యాలెట్ వేయ్.. లేకపోతే తర్వాత సర్వీసు లో నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు తెలుసు’ అని హెచ్చరిస్తున్నారు. ‘ప్రభుత్వం ఏ పార్టీది వచ్చినా సరే యూనియన్‌లో మేమే ఉంటాం కదా! మా అవసరం రాదనుకుంటున్నావా? నీ సంగతి తేలుస్తాం..’అని సూటిగానే బెదిరిస్తున్నా రు. దాంతో కొంతమంది ఉద్యోగుల భయంతో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా బ్యాలెట్ ఓటు వేస్తున్నారు. ఒక్కసారి చెబితే మాట వినని ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. మాట వినకపోవడంతో ఆయన్ని తీవ్రస్థాయిలో బెదిరిం చారు. దాంతో ఆయన ఒకానొక దశలో హడలిపోయారు. దాదాపు ఆయనతో బలవంతంగా పోస్ట ల్ బ్యాలెట్ తమకు అనుకూలంగా వేయించారు. శ్రీకాకుళంలో మరికొందరు ఉద్యోగులకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. దాంతో ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది.


 


 వారిద్దరు ఎన్నికల విధులకు మినహాయింపా!


 ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలిద్దరికి మాత్రం జిల్లా ఉన్నతాధికారులు ఎందుకనో మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్రమంత్రి కృపారాణి ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాంతో ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఇద్దరు చెలరేగిపోతున్నారు. ఉద్యోగులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకుని పోస్టల్ బ్యాలెట్ కోసం వేధిస్తున్నారు.


 


 కలెక్టర్‌కు ఫిర్యాదు


 ఉద్యోగ సంఘాల నేతల బెదిరింపులపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. వారిద్దరిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ సౌరభ్ గౌర్‌కు విజ్ఞప్తి చేశారు. వారిద్దరికీ ఎన్నికల విధులు కేటాయించాలని కోరారు. లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ను తమ అభిమతం ప్రకారం వినియోగించుకోలేక ఉద్యోగుల హక్కుకు భంగం వాటిల్లుతోందని చెప్పుకొచ్చారు. మరి దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే! 


 


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top