మళ్లీ వస్తావా.. మా బాబే!

మళ్లీ వస్తావా.. మా బాబే! - Sakshi


ఫ్యాష్‌బ్యాక్ ఫల్గుణరావుకు ఓ జబ్బుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే అతడికి కళ్లముందు చక్రాలు తిరుగుతాయి. వెంటనే అతడు ఫ్లాష్‌బ్యాక్‌లోకి జారిపోతుంటాడు.  టీవీలో ఒక యాడ్ వస్తోంది. ఒక ఆడపిల్ల తండ్రి కరాటే డ్రస్‌లో ఉన్నాడు. వేధించే వాడిని ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నాడు. ఇంతలో తల్లి వచ్చి ‘ఇదంతా ఎందుకండీ.. ఆయన వస్తే చాలు.. పోకిరీలందరికీ తగిన గుణపాఠం చెబుతాడు. మూడునిమిషాల్లో తాట తీస్తాడు’ అంటుంది. వెంటనే ఫల్గుణరావు పగలబడి నవ్వుతూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు.

 

 ఫ్లాష్‌బ్యాక్....

 అప్పట్లో ఒక అభాగ్యురాలిపైన యాసిడ్ దాడి జరిగింది. ఆనాడు ఘనత వహించిన ఈ తాట తీసే మొనగాడే పాలిస్తున్నాడు. సదరు బాధితురాలికి రూ.5 లక్షలు సహాయం అందిస్తానని మొదట ప్రభుత్వం ప్రకటించింది. కాస్త వేడి చల్లబడగానే అంత డబ్బు చెల్లించలేమంటూ కోర్టుకు ఈ మహిళోద్ధారక మహనీయుడే స్వయంగా లేఖ రాశాడు. ఇదీ అతగాడికి.. ఆడపిల్లల తండ్రుల మీదా, ఆడపిల్లల సంక్షేమం మీదా ఉన్న గౌరవం. ఇద్దరు దంపతులు ఆరో తరగతి చదివే తమ పదకొండేళ్ల పిల్లాడి భవిష్యత్తు కోసం ఇప్పట్నుంచే బెంగపడుతుంటారట. ఆ బాబు బంగారు భవిష్యత్తు కోసం సైడు పోజులో ఉన్న ఫొటోలోంచి స్ట్రెయిటైపోతూ నేరుగా రావాలట. ఆయనే రావాలట. ఫల్గుణరావు మరోసారి విరగబడి నవ్వుతూ మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు.

 

 ఫ్లాష్‌బ్యాక్...

 ఆ రోజుల్లో గవర్నమెంట్ రిక్రూట్‌మెంటే ఆగిపోయింది. కారణం... ప్రభుత్వ ఉద్యోగులను పెంచుకుంటూ పోతే వాళ్లకు రిటైర్‌మెంట్ తర్వాత ఇవ్వాల్సిన పెన్షన్‌లాంటి ప్రయోజనాలు తడిసిమోపెడై పోతాయన్నది అప్పటి అధినేత భావన. అదే వాళ్ల రాజగురువు సలహా. అందుకే ఆ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ శాఖను పరికించినా కాంట్రాక్ట్ ఉద్యోగులే. అలాంటి పిసినారి మాబాబు... ఈ పదకొండేళ్ల బాబుకు రాబోయే కాలంలో ఉచిత రీతిన ఉద్యోగాలిచ్చి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడట.

 

 రైతులు కరెంట్ రాకడ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఉన్న రోజుల్లోనే కరెంట్ కనీసం ఒక నిర్దిష్టమైన టైమ్‌లోనైనా వస్తుండేదట. ఇప్పుడు అధికారికంగా రోజుకు ఎనిమిది గంటలూ, అనధికారికంగా మరో ఆరు గంటలూ... మొత్తం పన్నెండు గంటలపాటు పోతూ ఉందట. మళ్లీ రైతులకు కరెంట్ అందాలంటే ఈ విద్వద్వేత్త అయిన ఈ విద్యుద్వేత్తే రావాలట.

 ఫల్గుణరావు మళ్లీ పడీ పడీ నవ్వాడు.

 

 ఫ్లాష్‌బ్యాక్...

 రైతులకు పంట కోసం ఉచిత కరెంట్ ఇవ్వాలంటూ ఓ మహానేత అంటే... అలా గనక  ఇస్తే బట్టలారేసుకోవడానికి తప్ప విద్యుత్ తీగలు మరెందుకూ పనికిరావు అన్నాడు. అలాంటి ఆయన.. వికసించిన విద్యుత్తేజంతో విద్యుచ్ఛక్తిని పదిచేతులా పందేరం చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అక్కడెక్కడో సింగపూర్‌లో అంబులెన్సుల కోసం హెలికాప్టర్లూ, విమానాలూ ఉపయోగిస్తారని ఒకరంటే.. ఆయనగానీ వస్తే రాష్ట్రంలోనూ అదే పరిస్థితి అట. ఫల్గుణరావు గిలగిలా కొట్టుకుంటూ నవ్వాడు.

 

 ఫ్లాష్‌బ్యాక్...

 మొదట్లో ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు ఉచితంగా అందేవి. వాటిలో నాణ్యత పెంచాలంటూ... ‘యూజర్ ఛార్జీల’ పేరిట ఇంజెక్షన్ వేయించుకోవాలంటే సూదీ, దూదీ కొనుక్కురమ్మనీ.. స్టాండులో సైకిల్ పెట్టుకోవాలంటే సొమ్మిచ్చే అక్కడ నిలుపుకోవాలనీ చెప్పింది పచ్చనోట్లపై ప్రేమ గుమ్మరించే ఈ పచ్చపామే కదూ?

 

 వాస్తవానికి తన జబ్బు శత్రువులకు కూడా రాకూడదని అందరూ అనుకుంటుంటారు. కానీ ప్రస్తుతం ఫల్గుణరావు మాత్రం తన జబ్బు రాష్ట్రప్రజలందరికీ రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అబద్ధాల గురించి ఆమాత్రం అవగాహన కలిగితే... ఆయన ఎప్పటికీ రాగూడదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తెరుగుతారు కాబట్టి.

 - యాసీన్

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top