నాపై పోటీకి దమ్ముందా?

నాపై పోటీకి దమ్ముందా? - Sakshi


    * సమైక్యద్రోహి కిరణ్

    *కమీషన్ల కోసమే కండలేరు తాగునీటి పథకం  

    * ప్రజల సొమ్ము దోచుకోలేదని ప్రమాణానికి సిద్ధమేనా ?

    * రాజంపేట వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి ధ్వజం


 పీలేరు, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఆయన సోదరుల్లో ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి డిపాజిట్టు తెచ్చుకున్నా రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధమేనన్నారు. మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల దాహార్తి తీర్చలేని కిరణ్ ఏ మొహం పెట్టుకుని నామినేషన్ వేస్తార ని ప్రశ్నించారు.



ప్రజలు రోజూ బిందె నీరు రూ. 3 నుంచి రూ. 5కు కొనుక్కోవాల్సిన దుస్థితి ఆయనవల్లే వచ్చిందని కిరణ్‌పై మండిపడ్డారు. పీలేరు లో ప్రభుత్వ భూముల తోపాటు గుట్టలు, పుట్టలు, చెట్లు, వాగులు, వంకలు ఆక్రమించి వందల కోట్లు దండుకున్నది ఆయన అనుచరులేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవిపోయే ముందు కమీషన్ల కోసం కండలేరు నుంచి తాగునీరు జిల్లాకు తరలించే ప్రక్రియ చేపట్టలేదా ? అని ప్రశ్నించారు. కమీషన్లు, ప్రజాధనాన్ని మూడన్నరేళ్లలో దోచుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ నల్లారి సోదరులకు సవాల్ విసిరారు. రూ. 9 కోట్లతో  ఏర్పాటు చేసిన కాంతి కిరణాలు మొహం చాటేశాయని, వీటిని ఏర్పాటు చేసిందీ కమీషన్ కోసం కాదా ? అని  ప్రశ్నించారు.



రాష్ట్రంలో సమైక్య ద్రోహిగా మొదటి స్థానం కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆయన సమైక్యవాదినంటూ ఇప్పుడు డ్రామాలాడితే ప్రజలు నమ్మరన్నారు. సమైక్య ద్రోహులు జై సమైక్యాంధ్ర అంటూ పార్టీని ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలన్నారు. పీలేరు ప్రజలు కిరణ్ సోదరుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో ఇక ఎన్నడూ ఉండరని తెలిపారు.



రూ. 7 కోట్లతో పీలేరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించవచ్చని, సీఎంగా ఈ పని కూడా చేయని కిరణ్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రోజైనా అన్నదమ్ములు ఎండలో కష్టపడ్డారా ? వ్యాపారాలేమైనా చేశారా ? ఏమి చేయకనే వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కిరణ్ రోడ్‌షోలు జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా తన వెంట పెట్టుకోలేని కిరణ్‌కు ఆయన సత్తా ఏ పాటిదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు.



మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్న చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు. ముస్లిం మైనారిటీలు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్రలో 130 నుంచి 150 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



ఈ సమావేశంలో పార్టీ నేతలు నారే వెంకట్రమణారెడ్డి, మల్లెల రెడ్డిబాషా, బీడీ నారాయణరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, షామియానా షఫీ, లోకనాథరెడ్డి, ఎస్ హబీబ్‌బాషా, దండు జగన్‌మోహన్‌రెడ్డి, సదుం నాగరాజ, మల్లికార్జునరెడ్డి, గడిబాషా, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, అల్లాబక్షు, మల్లెల మస్తాన్, బాబ్జిరెడ్డి,  మధుకర్‌రెడ్డి, ఆదినారాయణ, శ్రీనాథపురం మణి, జయపాల్‌రెడ్డి, వెంకటరమణ, మార్కొండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top