పోటెత్తిన నామినేషన్లు


సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 204 మంది 290 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజే 161 నా మినేషన్లు దాఖలు కావడం విశేషం. నెల్లూరు ఎంపీ స్థానానికి మొత్తం 17 మంది అభ్యర్థులు 25 నామినేష న్లు సమర్పించారు. చివరిరోజే 14 నామినేషన్లు దా ఖలయ్యాయి.

 

 తిరుపతి ఎంపీ స్థానానికి 19 మంది 24 నామినేషన్లు సమర్పించగా, చివరి రోజు 18 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ర్యాలీగా సంబంధిత కేంద్రాల వద్దకు చేరుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారు నామినేషన్ దరఖాస్తును పూర్తిచేయడం, అవసరమైన పత్రాలు జతరపరచడం, ప్రతిపాదకుల సంతకాలు తదితర విషయాల్లో తికమకపడ్డారు. ఓ వైపు సమయం మించిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు నిర్ణీత సమయంలోపే నామినేషన్లు సమర్పించడంతో ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఓ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి కూడా కొంత ఇబ్బందిపడినట్లు తెలిసింది. అయితే నామినేషన్ దరఖాస్తులను పూరించడం, అఫిడవిట్లను సమర్పించడంలో ఏదేని లోపాలుంటాయనే ఉద్దేశంతో అభ్యర్థులు తమ కుటుంబసభ్యులు, అనుచ రులతో డమ్మీలుగా నామినేషన్లు వేయించారు. మరోవైపు అదనంగా మరో రెండు, మూడు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థిత్వాలు ఆశించి భంగపడిన వారు రెబల్ అభ్యర్థులుగా బరిలోదిగారు. గూడూరులో టీడీపీ రెబల్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.

 

 రేపు పరిశీలన : నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం జరగనుంది. 23వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి వరకు అభ్యర్థిత్వాలు ఖరారుకాని అభ్యర్థులు శనివారం హడావుడిగా నామినేషన్లు సమర్పించారు. వీరంతా ఆదివారం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 

 తనిఖీలు ముమ్మరం: ఇప్పటి వరకు నామినేషన్ కార్యక్రమాలు జరుగు తుండడంతో నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్న భద్రతా సిబ్బంది శనివారం నుంచి ముమ్మరం చేశారు. ముఖ్యంగా పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో సిబ్బంది సంఖ్య పెంచడంతోపాటు తనిఖీలను క్షుణ్ణంగా చేయడం ప్రారంభించారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top